శనివారం 26 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 07, 2020 , 23:50:54

సీఎం ఆదేశాలతో మిగులు విద్యుత్‌ సాధిస్తున్నాం

సీఎం ఆదేశాలతో మిగులు విద్యుత్‌ సాధిస్తున్నాం

  • సీఎండీ ప్రభాకర్‌ రావు 

నందికొండ :  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశానుసారం మిగులు విద్యు త్‌ ఉత్పత్తిని సాధిస్తూ ముందుకుపోతున్నామని టీఎస్‌జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు.నాగార్జునసాగర్‌ డ్యాం ప్రధాన జల విద్యుత్‌ కేంద్రంలో ఇటీవల ప్రమాదవశాత్తు పాడైపోయిన 8వ టర్బర్న్‌ పునరుద్ధరణ పనులను శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం అధికారులతో పైలాన్‌ జెన్‌కో గెస్ట్‌ హౌస్‌లో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జూరాల, శ్రీశైలం ప్రాజెక్ట్‌లలోకి వరద నీరు రావడంతో 20రోజులగా పూర్తి స్థాయిలో విద్యుత్‌ ఉత్పత్తి చేపడుతున్నామన్నారు. దీంతో రాష్ర్టానికి ప్రతి రోజు 25 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందించడంతో 3 కోట్ల ఆదాయం చేకూరుతుందన్నారు. గత ఏడాది 4500 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశామని ఈ సంవత్సరం ఇంకా అదనంగా విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలను రూపొందించామన్నారు. కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్ట్‌లకు గత ఏడాది 1900 మెగా వాట్స్‌ విద్యుత్‌ అవసరం కాగా ఈ సారి 14000 మెగా వాట్స్‌ విద్యుత్‌ అవసరమవుతుందని,

సీఎం కేసీఆర్‌ ముందస్తుగా తెలిపిన విధంగా విద్యుత్‌ ఉత్పత్తికి సిద్ధం గా ఉన్నామన్నారు. నాగార్జునసాగర్‌, శ్రీశైలం జల విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా రివర్సబుల్‌ విధానం ఉపయోగించి పీక్‌ సీజన్‌లో కూడా విద్యుత్‌ ఉత్పత్తి చేయడానికి ఏర్పాట్లు చేశామన్నారు. రాష్ట్రం లో 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ అందిస్తున్నామన్నారు.నాగార్జునసాగర్‌లోని జల విద్యుత్‌ కేంద్రంలో ఆధికారుల పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.అంతకు ముందు జెన్‌కో డీఏవీ పాఠశాలలో నిర్వహించిన హరితహారంలో పాల్గొని మొక్కలను నాటారు.  వీరితో హైడల్‌ డైరెక్టర్‌ వెంకట్‌రాజన్‌,  సీఈలు శ్రీనివాసరావు, సూర్యనారాయణ, ఎస్‌ఈలు రామకృష్ణారెడ్డి, రఘురామ్‌, లక్ష్మణ్‌కుమార్‌, డీఈలు వెంకటేశ్వరరావు, నర్సింహారెడ్డి, ప్రవీణ్‌కుమార్‌, వేణు, ప్రసన్నకుమార్‌, కొవిడ్‌ నోడల్‌ అధికారి ఏడీఈ సందీప్‌రెడ్డి, ఏఈలు ఉన్నారు.


logo