మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Nalgonda - Aug 05, 2020 , 00:36:22

సివిల్స్‌ విజేతలను అభినందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సివిల్స్‌ విజేతలను అభినందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి

సివిల్స్‌ ఫలితాల్లో ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు మెరుగైన ర్యాంకులు సాధించారు. తల్లిదండ్రుల కలలు నిజం చేస్తూ.. పట్టుదల, ఏండ్ల తరబడి కృషితో లక్ష్య సాధనదిశగా అడుగులు వేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం గుండ్లబావి గ్రామానికి చెందిన ధాత్రిరెడ్డి 46వ ర్యాంకు, తంగడపల్లి వాసి బడేటి సత్యప్రకాశ్‌గౌడ్‌ 218ర్యాంకు సాధించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన పిన్నాని సందీప్‌కుమార్‌ 244ర్యాంకు, నల్లగొండ పట్టణానికి చెందిన రేణుకుంట్ల శీతల్‌కుమార్‌ 417వ ర్యాంకు సాధించాడు. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురు సివిల్స్‌లో సత్తా చాటడంతో విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ట్విట్టర్‌ వేదికగా అభినందనలు తెలియజేశారు.

చౌటుప్పల్‌ రూరల్‌ : మండల పరిధిలోని గుండ్లబావి గ్రామానికి చెందిన పెద్దిటి కృష్ణారెడ్డి, సుశీలాదేవి దంపతుల కుమార్తె ధాత్రిరెడ్డి మంగళవారం ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో 46వ ర్యాంకు సాధించి తెలుగు రాష్ర్టాల్లో టాపర్‌గా నిలిచింది. ఇంట్లోనే ఉంటూ సొంతంగా సివిల్స్‌ పరీక్షలకు సిద్ధమైంది. తొలి ప్రయత్నంలోనే 233వ ర్యాంకు సాధించి ప్రస్తుతం హైదరాబాద్‌లో వల్లభాయ్‌పటేల్‌ ఐపీఎస్‌ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతుంది. ఐఏఎస్‌ కావాలనే సంకల్పంతో  మళ్లీ సివిల్స్‌ రాయగా మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో ఆమెకు 46వ ర్యాంకు వచ్చింది. ధాత్రిరెడ్డి టాఫ్‌ ర్యాంకు సాధించడం పట్ల కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మొదటి నుంచీ ముందంజే..  

చదువులో ధాత్రిరెడ్డిది ఎల్లప్పుడూ ముందంజనే. హైదరాబాద్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌లో 1నుంచి 10వ తరగతి వరకు చదివింది. ఇంటర్‌ సెయింట్‌ పాట్రిక్స్‌ కళాశాలలో చదవి ఎంపీసీలో ఉత్తమ ప్రతిభ కనబర్చింది. దీంతో ఐఐటీ ఎంట్రెన్స్‌కు ఎంపికైంది. ఉత్తమ ప్రతిభ కనబర్చి ఖరగ్‌పూర్‌ ఐఐటీలో సీటు సాధించి 2015-16లో బీటెక్‌ పూర్తి చేసింది. తర్వాత ముంబైలో జర్మనీకి చెందిన డయాచ్చి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులో ఉద్యోగం చేస్తూ ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమైంది.  గత ఏడాది ఫలితాల్లో 233 ర్యాంకు సాధించింది. ఉద్యోగం చేసుకుంటూ తల్లిదండ్రులు, స్నేహితుల ప్రోత్సహంతో మళ్లీ సొంతంగా ప్రిపేరై 46వ ర్యాంకు సాధించింది.  పాఠశాల స్థాయిలో  కరాటేలో  బ్లాక్‌ బెల్ట్‌ సాధించింది. ఆమె తండ్రి బోర్‌వెల్స్‌ నడిపిస్తుండగా, తల్లి గృహిణి. తమ్ముడు సాయిగ్రీష్మన్‌రెడ్డి ముంబై ఐఐటీలో చదువుతున్నాడు.  

హుజూర్‌నగర్‌ : 2019 అక్టోబర్‌లో జరిగిన సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో హుజూర్‌నగర్‌ పట్టణానికి చెందిన పిన్నాని సందీప్‌కుమార్‌ 244వ ర్యాంక్‌ సాధించాడు. సందీప్‌ సివిల్స్‌లో మెరుగైన ర్యాంక్‌ సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిన్నవయసులోనే అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సందీప్‌ను ఆయన తల్లిదండ్రులు, పట్టణవాసులు అభినందిస్తున్నారు.   

పట్టణానికి చెందిన పిన్నాని కోటేశ్వర్‌రావు, ప్రభావతి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు సంపత్‌, చిన్నవాడు సందీప్‌కుమార్‌. కోటేశ్వర్‌రావుది పెన్‌పహాడ్‌ మండలం దూపాడు స్వగ్రామం. హుజూర్‌నగర్‌కు చెందిన ప్రభావతితో వివాహం జరిగిన తర్వాత హుజూర్‌నగర్‌కు వచ్చి పట్టణంలో మానస టైప్‌ ఇనిస్టిట్యూట్‌ నెలకొల్పాడు. టైపింగ్‌ పాఠాలను నేర్పుతూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. ఆ తర్వాత కొద్దికాలానికి కోటేశ్వర్‌రావుకు విద్యుత్‌శాఖలో జేఏఓగా, అదే శాఖలో ప్రభావతికి సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు వచ్చాయి.   

సందీప్‌ విద్యాభ్యాసం.. 

సందీప్‌ విద్యాభ్యాసం1 నుంచి 8వ తరగతి వరకు హుజూర్‌నగర్‌లోని విజ్ఞాన్‌ పాఠశాలలో, 9 నుంచి 10వ తరగతి వరకు కోదాడలోని గౌతమ్‌ మోడల్‌ స్కూల్‌లో చదివాడు. ఇంటర్‌ హైదరాబాద్‌లోని నయానగర్‌లో, ఇంజినీరింగ్‌ జేబీఐటీలో పూర్తి చేశాడు. ఇంజినీరింగ్‌ పూర్తికాగానే ఢిల్లీలోని ఖాన్‌ స్టడీ గ్రూప్‌లో సివిల్స్‌ కోసం కోచింగ్‌ తీసుకున్నాడు.  

తొలిప్రయత్నంలోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపిక

2016లో మొదటిసారి సివిల్స్‌ రాయగా 732వ ర్యాంక్‌ సాధించి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యాడు.   ఉద్యోగానికి సెలవు పెట్టి రెండోసారి ప్రయత్నించగా ఐఏఎస్‌ ఇంటర్వ్యూ వరకు వచ్చి వెనుదిరిగాడు. మూడోసారి 2019 అక్టోబర్‌లో జరిగిన సివిల్స్‌లో 244వ ర్యాంక్‌ సాధించి ఐఏఎస్‌గా సెలెక్ట్‌ అయ్యాడు.  

7నుంచి 8గంటలు చదివేవాడిని .. 

ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ప్రిలిమ్స్‌ రెండు మూడు నెలలు ఉందనగా 10 నుంచి 12గంటలు, మెయిన్స్‌ పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో 10 నుంచి 11 గంటలు చదివేవాడినని, సగటును రోజుకు 7 నుంచి 8 గంటలు చదివినట్లు తెలిపాడు. ఇంటర్వ్యూ సమయంలో పెద్దగా పుస్తకాలతో పని ఉండదన్నాడు. హుజూర్‌నగర్‌ నేపథ్యం, కాలేజీ, జిల్లా, రాష్ట్ర నేపథ్యాలపై చదివినట్లు చెప్పాడు. న్యూస్‌పేపర్లో ప్రముఖులు రాసిన ఆర్టికల్స్‌ బాగా చదివేవాడినని పేర్కొన్నాడు.  

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలే ముఖ్యం..  

ప్రారంభంలో ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలనే చదివేవాడినని, ఆ తర్వాత పాలిటీకి లక్ష్మీకాంత్‌, హిస్టరీకి ఆర్‌ఎస్‌ శర్మ, స్ప్రెక్టమ్‌ సిరీస్‌, ఎకనామిక్స్‌కు శ్రీరాంసార్‌ పుస్తకాలు, జియోగ్రఫీకి ఆర్‌సీరెడ్డి రమణరాజు పుస్తకాలను ఎక్కువగా చదివేవాడినని సందీప్‌ తెలిపాడు.  

చౌటుప్పల్‌ : పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమీ ఉండదని నిరూపించాడు చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లికి చెందిన బడేటి సత్యప్రకాశ్‌గౌడ్‌. చిన్నప్పటి కల సివిల్స్‌ ర్యాంక్‌ను సాకారం చేసుకున్నాడు. ఐపీఎస్‌ అధికారిగా కావాలన్న తన కలను నిజం చేసుకున్నాడు. కష్టపడి చదివి తన లక్ష్యాన్ని మొదటి ప్రయత్నంలో సాధించాడు సత్యప్రకాశ్‌. 
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లికి చెందిన బడేటి అశోక్‌, వసంత దంపతుల కుమారుడు సత్యప్రకాశ్‌. అశోక్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌లో డీఈగా పనిచేస్తూ మన్సూరాబాద్‌లో ఉంటున్నాడు. చిన్నతనం నుంచే చదువులో చురుకుగా ఉండే సత్యప్రకాశ్‌  7వ తరగతి వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని సెయింట్‌ ఆల్ఫాన్సెస్‌ హైస్కూల్‌లో చదివాడు. హైదరాబాద్‌లోని ఆదిత్య ఐఐటీ కాన్సెప్ట్‌ స్కూల్‌లో 8 నుంచి 10తరగతులు పూర్తిచేశాడు. శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌, 2018లో ఐఐటీని పాట్నాలో పూర్తిచేసుకున్నాడు. అప్పటి నుంచి సివిల్స్‌కు ఇంట్లోనే ఉండి సన్నద్ధమై 2019లో సివిల్స్‌ మెయిన్స్‌ రాశాడు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో 218వ ర్యాంక్‌ సాధించి సత్తాచాటాడు. చిన్నప్పటి నుంచి తమతోపాటు కలిసి తిరిగిన సత్యప్రకాశ్‌ ఐపీఎస్‌గా ఎన్నిక కానుండడంపై కుటుంబ సభ్యులతోపాటు తంగడపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.   
మహిళ భద్రతకు ప్రాధాన్యం.. 
సివిల్స్‌లో 218వ ర్యాంక్‌ సాధించిన బడేటి సత్యప్రకాశ్‌గౌడ్‌ను ‘నమస్తేతెలంగాణ’ పలుకరించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పక్కా ప్రణాళికతో ప్రిపరేషన్‌ కొనసాగించడం వల్లే 218వ ర్యాంక్‌ సాధించినట్లు తెలిపాడు. రెండేళ్లు పడిన కష్టం ఈ ఫలితంతో మర్చిపోయానన్నారు.   ఐపీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మహిళలు, చిన్నపిల్లల భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తానని చెప్పారు. సైబర్‌ నేరాల నియంత్రణకు కృషి చేస్తాన్నారు. స్మార్ట్‌ పోలీసింగ్‌ వ్యవస్థ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. సమాజంలోని అసమానతలను రూపుమాపుతానని, అన్ని రంగాల్లో యువత రాణించేలా తనవంతు ప్రోత్సాహాన్ని అందిస్తానని పేర్కొన్నాడు. 
నల్లగొండ రూరల్‌ : సాదాసీదా జీవితం గడుపుతున్న ఓ కుటుంబంలోని వ్యక్తికి సివిల్స్‌లో ఉత్తమ ర్యాంక్‌ రావడంతో వారిది అంతుపట్టలేని ఆనందం. నల్లగొండ పట్టణంలోని క్రాంతినగర్‌లో నివాసం ఉండే రేణుకుంట్ల నరేందర్‌, సుజాత దంపతులకు ఇద్దరు సంతానం. వీరిలో  చిన్నవాడు శీతల్‌కుమార్‌. చిన్నప్పటి నుంచే ఇతని లక్ష్యం సివిల్స్‌ సాధించడం. పట్టుదలతో చదివి   ఎట్టకేలకు మంగళవారం విడులైన సివిల్స్‌ ఫలితాల్లో 417వ ర్యాంక్‌ సాధించాడు.  
 పట్టణంలోని ప్రకాశం బజార్‌లో టైలర్‌షాపు నడుపుతున్న నరేందర్‌ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాడు. శీతల్‌కుమార్‌ ప్రైమరీ విద్య అల్ఫా పాఠశాలలో చదువగా 7 నుంచి 10వరకు పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్‌ స్కూల్‌లో చదివి పదో తరగతిలో 86శాతం మార్కులు సాధించాడు. ఇంటర్మీడియట్‌ హైదరాబాద్‌లోని నారాయణ జూనియర్‌ కళాశాలలో 85శాతం, బీటెక్‌ వర్ధమాన్‌  కళాశాలలో ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు.  అనంతరం ఎంటెక్‌తోపాటు ఏంఏ పూర్తిచేశాడు.  
7వ ప్రయత్నంలో ఉత్తమ ర్యాంక్‌..
సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా ప్రిపరేషన్‌ ప్రారంభించిన శీతల్‌కుమార్‌ ఆరుసార్లు విఫలమయ్యాడు.  అయినప్పటికీ తల్లిదండ్రులు, బంధువుల ప్రోత్సాహంతో ప్రయత్నిస్తూనే ఈసారి ఉత్తమ ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం శీతల్‌కుమార్‌ ఆదిలాబాద్‌లోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్రలో ఉద్యోగం చేస్తున్నాడు.  


logo