సోమవారం 30 నవంబర్ 2020
Nalgonda - Aug 04, 2020 , 09:24:30

చివరి భూములకూ నీరందేలా.

చివరి భూములకూ నీరందేలా.

  • l సాగర్‌ మేజర్‌, మైనర్‌ కాల్వల్లో పూడిక తీత 
  • l ఉపాధి నిధులతో చేపట్టిన ప్రభుత్వం
  • l రూ.1.45కోట్ల వ్యయంతో 160పనులు.

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో చివరి భూములకు సైతం సమృద్ధిగా నీరందేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మేజర్‌, మైనర్‌ కాల్వల్లో పూడిక తీత, చెట్ల తొలగింపు పనులను ప్రారంభించింది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాలో 160పనులు గుర్తించగా రూ.1.45కోట్లు కేటాయించింది. నల్లగొండ జిల్లాలోని ఎనిమిది మండలాల్లో 147.9కి.మీ, సూర్యాపేట జిల్లాలోని 13మండలాల్లో 39.13కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లో నీటి విడుదలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. పనుల్లో వేగం పెంచారు.

- మిర్యాలగూడ

మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఎడమకాల్వ ఆయకట్టు పరిధిలో చివరి భూములకూ నీరు అందేలా కాల్వల పూడికతీత పనులు చేపట్టనున్నారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు మేజరు, మైనరు కాల్వల పూడికతీత పనులు చేపట్టేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం నిధులను కాల్వల అభివృద్ధి పనులకు మళ్లించారు. ఉమ్మడిజిల్లా పరిధిలో రూ.కోటి 45లక్షల 38వేలు నిధులు కేటాయించారు.

ఉమ్మడిజిల్లా పరిధిలో 160పనులు గుర్తింపు 

జాతీయ ఉపాధిహామీ నిధులతో  సాగర్‌ కాల్వల పూడికతీత పనులు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించింది. ఈ నిధులతో నల్లగొండ జిల్లాలో 124పనులు, సూర్యాపేట జిల్లాలో 36పనులను గుర్తించి నిధులు కేటాయించారు. మేజరు, మైనరు కాల్వలు ఏటా పూడికతో నిండి చివరి భూములకు సాగునీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కాల్వ చివరి భూములకు సాగునీరు అందక పంటలు ఎండి రైతులు నష్ట పోతున్నారు. రైతుల శ్రేయస్సు కోసం సీఎం కేసీఆర్‌ కాల్వల పూడికతీత పనులకు ఉపాధినిధులు కేటాయించి కాల్వల అభివృద్ధికి బాటలువేశారు.

రూ.1.45 కోట్లతో పూడికతీత పనులు

నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులో నల్లగొండ జిల్లా పరిధిలో తిరుమలగిరిసాగర్‌, అనుముల, నిడమనూరు, త్రిపురారం, అడవిదేవులపల్లి, మిర్యాలగూడ, దామరచర్ల, వేములపల్లి మండలాల పరిధిలో మేజరు, మైనరు కాల్వలు పూడికతీతకు మొత్తం 124పనులు గుర్తించారు. ఈ పనుల్లో భాగంగా 147.911కిలోమీటర్లు మేర కాల్వల పూడికతీత పనులు చేపడుతున్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలో నేరేడుచర్ల, గరిడేపల్లి, పాలకవీడు, పెన్‌పహాడ్‌, హుజూర్‌నగర్‌, మట్టంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం, చిలుకూరు, కోదాడ, నడిగూడెం, అనంతగిరి, మునగాల మండలాల పరిధిలో మొత్తం 36 పనులను గుర్తించారు. ఈ పనుల్లో భాగంగా 39.13 కిలోమీటర్లు మేర కాల్వల పూడికతీత పనులు చేపడుతున్నారు. పూడికతీత పనులు పూర్తయితే చివరి భూములకు సులువుగా సాగునీరు అందనుంది. 

  చివరి భూములకూ సాగునీరు 

సాగర్‌ ఆయకట్టు రైతులకు మేలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం జాతీయ ఉపాధిహామీ పనులను కాల్వల పూడికతీతకు మళ్లించారు. దీంతో ఎడమకాల్వ పరిధిలో ఉన్న మేజరు, మైనరు కాల్వల్లో పేరుకుపోయిన పూడిక తొలగించే పనులు జరుగుతున్నాయి. పూడికతీత వలన చివరి భూములకు సాగునీరు తేలికగా అందుతుంది.  

           - విజయభాస్కర్‌, ఎన్‌ఎస్‌పీ ఎస్‌ఈ, మిర్యాలగూడ