మంగళవారం 27 అక్టోబర్ 2020
Nalgonda - Aug 04, 2020 , 09:24:28

ఇరువురిని బలిగొన్న పగ

ఇరువురిని బలిగొన్న పగ

  • l   హజారిగూడెంలో అన్నదమ్ముల దారుణ హత్య
  • l   కత్తులతో విచక్షణా రహితంగా పొడిచిన దుండగులు
  • l   వివాహేతర సంబంధమే హత్యలకు ఆజ్యం పోసిందంటున్న స్థానికులు
  • l   మృతుల్లో ఒకరు ఇటీవలే బెయిల్‌పై జైలు నుంచి విడుదల

హాలియా, తిరుమలగిరి(సాగర్‌) : క్షణికావేశంలో మానవులు మృగాళ్లా మారుతున్నారు. ఆధిపత్య పోరు, అక్రమ సంబంధాలతో నైతిక విలువలకు తిలోదకాలు వదిలి కర్కశత్వంతో కత్తులు దూస్తున్నారు. అమ్మానాన్న, అక్కాచెల్లి, అన్నాతమ్ముడు బంధాలు మరిచి పగలు ప్రతీకారాలతో ప్రాణాలు తీస్తున్నారు. భార్యభర్తలు సఖ్యతతో సమస్యలు పరిష్కరించుకోకుంటే పగలూ ప్రతీకారాలకు నిండు ప్రాణాలు ఎలా బలైతాయో తెలుపడానికి ఈ ఘటనే ఉదాహరణ...

అసలు ఏం జరిగింది..?

నల్లగొండ జిల్లాలోని అనుముల మండలం హజారిగూడెం గ్రామంలో సోమవారం ఉదయం 3గంటలకు జానపాటి సత్యనారాయణ(35), జానపాటి ఆంజనేయులు(32) అన్నదమ్ములిద్దరూ దారుణహత్యకు గురయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హజారిగూడేనికి చెందిన జానపాటి ఇస్తారి, రాములమ్మ దంపతులకు కూతురు పార్వతమ్మ, కుమారులు జానపాటి సత్యనారాయణ, హరి, ఆంజనేయులు సంతానం. వీరందరికీ వివాహాలు కావడంతో వేరువేరుగా వివిధ వృత్తులో స్థిరపడ్డారు. ఈ నేపథ్యంలో జానపాటి హరి, సమత దంపతులకు వ్యక్తిగత కారణాల రీత్యా అంతఃకలహాలు మొదలయ్యాయి. హాలియా పట్టణానికి చెందిన రేవంత్‌ అనే యువకుడితో సమతకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హరి వారిరువురిని పలుసార్లు మందలించాడు. రేవంత్‌ తీరుపై అతడి తల్లిదండ్రులకు సైతం హరి ఫిర్యాదు చేశాడు. గతేడాది పోలీసుస్టేషన్‌లో ఈ విషయమై పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చినప్పటికీ వారిలో మార్పు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో హజారిగూడెం స్టేజీ వద్ద రేవంత్‌ హత్యకు గురయ్యాడు. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న హరి, ఆంజనేయులు, మరికొంతమంది నల్లగొండ జిల్లా జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. 

ప్రతీకార హత్య..?

 పాతకక్షల కారణంగానే హత్యలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున 3గంటలకు హజారిగూడెంలోని ఇంటివద్ద ఆరుబయట నిద్రిస్తున్న సత్యనారాయణపై కొంతమంది వేటకొడవళ్లతో దాడిచేశారు. దీంతో సత్యనారాయణ ఒక్కసారిగా అరవగా పక్కఇంట్లో నిద్రిస్తున్న తమ్ముడు ఆంజనేయులు బయటకు వచ్చి చూస్తుండగా దుండగులు ఒక్కసారిగా అతడిపై కూడా దాడి చేయడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. ఈ దారుణాన్ని తల్లి రాములమ్మ చూసి తల్లడిల్లిపోయింది. ఆమె రోదనను విని చుట్టుపక్కల వారు వచ్చేసరికి నిందితులు పారిపోయారు. 

హత్యతో ఆయనకు సంబంధం ఉందా..?

రేవంత్‌ను హతమార్చిన ఘటనలో హరి, ఆంజనేయులు దోషులుగా శిక్ష అనుభవిస్తున్నారు. కానీ సత్యనారాయణకు ఎలాంటి సంబంధం లేదని స్థానికులు చెబుతున్నారు. సత్యనారాయణ ఎలక్ట్రిషన్‌ గుత్తేదారుడిగా జీవనం సాగిస్తూ అందరితో కలివిడిగా ఉండేవాడు. ఈయనకు ఒక కుమారుడు, భార్య ఉన్నారు.   

రాఖీ కట్టడానికి రా అమ్మా..

ఆదివారం సాయంత్రం 4గంటలకు ఒక్కగానొక కూతురు పార్వతమ్మకు తల్లి రాములమ్మ ఫోన్‌ చేసింది. తమ్ముళ్లకు రాఖీ కట్టడానికి రా అమ్మా అంటూ మాట్లాడింది. వస్తానని మాటిచ్చిన పార్వతమ్మ.. సోమవారం ఉదయం తన తమ్ముళ్ల హత్య వార్త విని గుండెలవిసేలా ఏడ్చింది. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దంటూ కన్నీటి పర్యంతమైంది. ఈ ఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది. 

పోలీసులు పట్టించుకోలేదు

రేవంత్‌ హత్య కేసులో నిర్దోషిని అయినప్పటికీ జైలు జీవితం గడిపి జూన్‌ 20న బెయిల్‌పై విడుదలయ్యాను.  మా కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే అన్నదమ్ములను కోల్పోయాను. ఇప్పటికైనా పోలీసులు స్పందించి మాకు రక్షణ కల్పించాలి. దోషులను కఠినంగా శిక్షించాలి.

- జానపాటి హరి

కేసు దర్యాప్తు చేస్తున్నాం..

  సమాచారం అందగానే హజారిగూడేనికి చేరుకొని పరిస్థితి సమీక్షించాం. గతంలో జరిగిన రేవంత్‌ హత్యకు ఇది ప్రతీకార ఘటనగా ప్రాథమిక విచారణలో తేలింది. వివరాలు తెలియాల్సి ఉంది. పంచనామాలు నిర్వహించి శవ పరీక్షల నిమిత్తం మృతదేహాలను నాగార్జునసాగర్‌ కమలానెహ్రూ ఏరియా దవాఖానాకు తరలించాం. దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. 

- వై. వెంకటేశ్వరావు, డీఎస్పీ, మిర్యాలగూడ


logo