బుధవారం 21 అక్టోబర్ 2020
Nalgonda - Aug 03, 2020 , 00:09:07

విద్యుదాఘాతంతో మహిళా రైతు దుర్మరణం

విద్యుదాఘాతంతో మహిళా రైతు దుర్మరణం

  • తొమ్మిదేండ్ల కిందట రోడ్డు ప్రమాదంలో భర్త మృతి 
  • అనాథలైన ఇద్దరు చిన్నారులు

మునుగోడు : తొమ్మిదేళ్ల కిందట రోడ్డు ప్రమాదం ఆ చిన్నారులకు నాన్నను దూరం చేయగా.. ఇప్పుడు విద్యుదాఘాతం అమ్మనూ కానరాని లోకాలకు తీసుకెళ్లింది. హృదయవిదారకరమైన ఈ దుర్ఘటన మునుగోడు మండల పరిధిలోని ఇప్పర్తిలో ఆదివారం జరిగింది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పర్తికి చెందిన చీమల వెంకన్న తొమ్మిదేండ్ల కిందట రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. నాటి నుంచి అతని భార్య చీమల హేమలత(34) తమ 4 ఎకరాల భూమిలో పత్తి, వరి పంటను సాగుచేస్తోంది. తండ్రి లేని లోటు రాకుండా కుమారుడు రాకేశ్‌(14), కుమార్తె గీతాంజలి(13)లను చదివించుకుంటుంది. రోజువారీ పనుల్లో భాగంగా ఉదయం పొలం వద్ద బోరుమోటర్‌ ఆన్‌ చేసేందుకు వెళ్లింది. మోటర్‌కు ఎర్త్‌ రావడంతో విద్యుదాఘాతంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. సుమారు 10.30గంటల సమయంలో పక్క పొలం రైతులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతురాలి మరిది చీమల రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారుల దీనస్థితిని చూసి పలువురు గ్రామస్తులు కంటతడి పెట్టారు. ప్రస్తుతం నానమ్మ, బాబాయిలే ఆ చిన్నారులకు ఆధారం.


logo