మీకు ఏ వయసు దగ్గర ఆగిపోవాలని ఉంది? నచ్చినవి తింటూ, దోస్తులతో ఆడుకునే తొమ్మిదేండ్ల దగ్గరా? యవ్వనం తొణికిసలాడే ఇరవయ్యేండ్ల దగ్గరా? రెండూ కాదు, మనిషి ముప్పైనుంచి నలభై ఐదేండ్ల మధ్యలోనే మహా సంతోషంగా, చాలా సంతృప్తిగా ఉంటాడని తాజా అధ్యయనంలో తేలింది. గత నాలుగేండ్లుగా క్లేర్ మెహతా అనే సైకాలజీ ప్రొఫెసర్ ఈ విషయంపై పరిశోధన చేశారు. వందమందితో మొదలుపెట్టిన అధ్యయనం చివరికి 700 మందితో పూర్తయింది. అందులో టీనేజ్ పిల్లలనుంచి అరవయ్యేండ్ల వృద్ధులవరకూ ఉన్నారు. అందులో పాల్గొన్నవాళ్లంతా తమ బాధ్యతలు, కష్టాలు, సుఖసంతోషాల గురించి వివరంగా చెప్పారు. వాటన్నిటినీ లెక్కలోకి తీసుకుని అంతిమంగా ‘36 ఏండ్ల’ వయసులో మనిషి ప్రశాంతంగా ఉంటాడని తేల్చారు. అప్పటికి జీవితంలో ఇల్లు, పెండ్లి, పిల్లలు, బీమా మొదలైనవన్నీ సమకూరడం, భవిష్యత్‌పై చింత లేకుండా.. ఒక సెక్యూర్డ్ భావన రావడం వల్లే అంత సంతోషంగా ఉన్నామని అధ్యయనంలో పాల్గొన్నవారిలో అధికశాతం మంది చెప్పారట.