శనివారం 04 జూలై 2020
Nalgonda - Jul 01, 2020 , 03:32:04

హరితహారంలో లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి

హరితహారంలో లక్ష్యానికి   అనుగుణంగా మొక్కలు నాటాలి

  కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

నల్లగొండ : జిల్లావ్యాప్తంగా ఆరోవిడుత హరితహారంలో ప్రభుత్వశాఖలు కేటాయించిన లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. ఆయన మంగళవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మట్లాడుతూ ప్రస్తుతం వర్షాలు పడుతున్నందున రైతులను ప్రోత్సహించి మొక్కలు నాటుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయశాఖ యంత్రాంగం డివిజన్‌కు ఐదులక్షల చొప్పున మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు పొలంగట్ల వద్ద మొక్కలను నాటుకునేలా ప్రోత్సాహించాలన్నారు. సన్న, చిన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు నీటి సౌకర్యం ఉంటే వారు యూకలిప్టస్‌, మలబార్‌, పండ్ల మొక్కలు నాటుకునేలా అవగాహన కల్పించాలన్నారు. ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖల వారు మూడులక్షల పండ్ల మొక్కలను, రెండులక్షల టేకు మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు. నాటిన మొక్కలకు జియో ట్యాగింగ్‌ చేసి వాటి వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరచాలన్నారు. ఎక్సైజ్‌శాఖ ద్వారా మూడు లక్షలు గీత కార్మిక సొసైటీల్లో, చెరువు గట్లపైన ఈత, ఖర్జూర మొక్కలు నాటాలని సూచించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ వీరబ్రహ్మాచారి, డీఆర్డీఓ శేఖర్‌ రెడ్డి, జేడీఏ శ్రీధర్‌రెడ్డి, ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మి, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ హిమశ్రీ తదితరులు పాల్గొన్నారు. 


logo