ఆదివారం 24 జనవరి 2021
Nalgonda - Jun 25, 2020 , 02:10:30

మొక్కల పండుగకు సర్వం సిద్ధం

మొక్కల పండుగకు సర్వం సిద్ధం

  • నేడు ఆరో విడుత హరితహారం ప్రారంభం 
  • పది ప్రభుత్వ శాఖల భాగస్వామ్యం
  • రెండు నెలల పాటు మొక్కలు నాటింపు
  • ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ
  • ‘ఉపాధి హామీ’తో గుంతల తవ్వకం పూర్తి

‘తెలంగాణకు హరితహారం’ ఆరో విడుత కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. అటవీ శాతాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మొక్కల నాటింపు ప్రక్రియ రెండు నెలలపాటు నిరంతరాయంగా కొనసాగనుంది. పది శాఖల భాగస్వామ్యంతో మొక్కలు నాటడమే లక్ష్యంగా అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది. ప్రతి ఇంటికీ ఆరు మొక్కలను అందించనుండగా మరోవైపు ఉపాధి హామీ పథకం ద్వారా గుంతల తవ్వకం కూడా పూర్తయ్యింది. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కట్టంగూరు మండలం పామనుగుండ్లలో, విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా ఇమాంపేటలో హరితహారం ప్రారంభించనున్నారు.

- నల్లగొండ ప్రతినిధి, నమస్తే తెలంగాణ

ఆరో విడుత లక్ష్యం

నల్లగొండ                      1.07 కోట్లు

సూర్యాపేట       83.79 లక్షలు

 పట్టణాల ఆధునీకరణ, జనాభా పెరుగుదల నేపథ్యంలో అటవీ సంపద క్రమంగా క్షీణిస్తోంది. జిల్లాలో గణనీయంగా తగ్గిన అటవీశాతాన్ని 33 శాతానికి పెంచాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సూచనల మేరకు అధికారులు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఐదేళ్లుగా మొక్కలు నాటుతున్నారు. ప్రస్తుతం ఆరో దఫా నాటేందుకు సిద్ధమయ్యారు. 2014 ఆగస్టు 8న మొదటి దఫా హరితహారం కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ జిల్లాలోని చిట్యాలలో హైవే వెంట తొలి మొక్క నాటి ప్రారంభించారు. అదే స్ఫూర్తితో ప్రతి ఏటా మొక్కల నాటింపు కార్యక్రమం కొనసాగుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతి ఏటా 2.2 కోట్ల మొక్కలు నాటగా ఈ సారి నాటిన మొక్కల్లో 90 శాతం బతికించాలనే లక్ష్యంతో అధికారులు చర్యలు చేపట్టారు. పది శాఖల భాగస్వామ్యంతో 1.07 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా అందులో పంచాయతీరాజ్‌ శాఖ 43.56 లక్షల మొక్కలను నాటడంతో పాటు 24 లక్షల మొక్కలను ఇంటింటికీ పంపిణీ చేయనుంది. 

ఏర్పాట్లు పూర్తి...

ఆరో విడుత హరితహారం కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేటి నుంచి రెండు నెలల పాటు ఈ కార్యక్రమం కొనసాగనుండగా.. నేడు శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి కట్టంగూర్‌ మండలం పామనుగుండ్లలో మొక్క నాటి ప్రారంభించనున్నారు. గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం జిల్లాలోని 844 గ్రామ పంచాయతీల్లో నర్సరీలు ఏర్పాటు చేసి 63 లక్షల మొక్కలను పెంచుతోంది. అటవీ శాఖ యంత్రాంగం తమ నర్సరీల్లో మరో 20 లక్షల మొక్కలను పెంచింది. 

ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు 

గ్రామీణ ప్రాంతాల్లో కూడా హరితహారం కార్యక్రమాన్ని విరివిగా నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పంచాయతీ శాఖకే మొక్కల నాటింపు బాధ్యతను అప్పగించింది. డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో గ్రామాల్లో 844 నర్సరీల్లో పెంచిన 67.56 లక్షల మొక్కలను పంచాయతీ శాఖకు అప్పగించింది. జిల్లాలోని నాలుగు లక్షల కుటుంబాలకు ఇంటికి ఆరు మొక్కల చొప్పున 24 లక్షల మొక్కలను అందజేయనున్నారు. నర్సరీల్లో పెంచిన వాటిలో జామ, నిమ్మ, బొప్పాయి, మామిడి, మునగ లాంటి పండ్ల చెట్లతో పాటు దోమల నివారణకు ఉపయోగపడే కృష్ణతులసి మొక్కలను ఇండ్లల్లో పెంచేందుకు అందించనున్నారు. ప్రతి ఇంటి ఆరు బయట లేదా తోటలు, పొలాలు, చెలకల వద్ద నాటుకుని పరిరక్షించాలని ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించారు. టేకు మొక్కలు రైతులు పొలాల వద్ద నాటుకోవడానికి ఆసక్తి ఉంటే వారికి సైతం అందజేయనున్నారు. 

ఉపాధి నిధులతో గుంతలు 

హరితహారం మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకు ఉపాధిహామీ నిధులు వినియోగిస్తున్నారు. గుంతలు తీయడంతో పాటు మొక్క నాటిన తర్వాత పరిరక్షించేందుకు నీటి సరఫరా, వాచర్‌కు సైతం ఉపాధి నిధుల నుంచే చెల్లించేలా చర్యలు తీసుకోనున్నారు. ఈ నెల 20వ తేదీలోపే గుంతలు తీయాలని కలెక్టర్‌ ఆదేశించడంతో ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో 80 శాతం గుంతల తీత కార్యక్రమం పూర్తయింది. అవెన్యూ ప్లాంటేషన్‌లో భాగంగా 10.30 లక్షల మొక్కలు హైవేలపై నాటాల్సి ఉండగా అందులో 5 లక్షల గుంతలు తీశారు. 

హైవేలపై ఆరు ఫీట్ల మొక్కలు... 

రాష్ట్ర, జాతీయ హైవేలకు ఇరువైపులా ఆరు ఫీట్ల మొక్కలను నాటే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. కి.మీ.కు 400 మొక్కల చొప్పున సుమారు 300 కి.మీ. పరిధిలో 1.20 లక్షల పెద్ద మొక్కలను నాటనున్నారు. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు హైదరాబాద్‌, విజయవాడ రహదారి, అద్దంకి-నార్కట్‌పల్లి రహదారులపై 10.30 లక్షల మొక్కలు నాటే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ శాఖ యంత్రాంగం ఆరుఫీట్ల ఎత్తు ఉన్న 10 లక్షల మొక్కలు పంచాయతీరాజ్‌ శాఖ యంత్రాంగానికి స్వాధీనం చేసింది. హైవేలపై నాటిన మొక్కల్లో 90 శాతం బతికించేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.  జిల్లాలోని 7 మున్సిపాలిటీల్లో 9.05 లక్షల మొక్కలను నాటనున్నారు. ఇప్పటికే పురపాలక యంత్రాంగం మెప్మాల ద్వారా నర్సరీల్లో మొక్కలను పెంచింది. మరికొన్ని మున్సిపాలిటీలు ప్రైవేటు నర్సరీల నుంచి కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలో అటవీ శాఖ ఆధ్వర్యంలో రెండు లక్షల మొక్కలు, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖ ద్వారా 67.56లక్షల మొక్కలు, నీటి పారుదల విభాగం ద్వారా మూడు లక్షలు, వ్యవసాయ శాఖ ద్వారా 3.50లక్షలు, హార్టికల్చర్‌ ద్వారా 5లక్షలు, ఎక్సైజ్‌ శాఖ మూడు లక్షలు, మున్సిపల్‌ శాఖ ద్వారా 23.72లక్షల మొక్కలు, ఐసీడీఎస్‌ ద్వారా పదివేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టారు. అందుకు అనుగుణంగా ఆయా శాఖల అదికారులు, సిబ్బంది సిద్దమయ్యారు.


logo