మంగళవారం 07 జూలై 2020
Nalgonda - Jun 06, 2020 , 02:20:04

ఫర్టిలైజర్‌ దుకాణాలపై రైడ్‌

ఫర్టిలైజర్‌ దుకాణాలపై రైడ్‌

  • జిల్లా వ్యాప్తంగా ఏకకాలంలో తనిఖీలు
  • సర్కార్‌ ఆదేశాలతో నకిలీ విత్తనాల పట్టివేత
  • డిండిలో బిల్లులు లేని 476పత్తి ప్యాకెట్లు స్వాధీనం

నల్లగొండ/ సూర్యాపేట : నకిలీ విత్తనాలను పట్టుకునేందుకు ప్రభుత్వ ఆదేశాలతో శుక్రవారం వ్యవసాయ, పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఏకకాలంలో ఫర్టిలైజర్ల దుకాణాల్లో తనిఖీ నిర్వహించా రు. నల్లగొండ,సూర్యాపేట జిల్లాల్లో వ్యవసాయ మండల, విస్తరణాధికారులు, సీఐలు, ఎస్‌ఐలు   పాల్గొన్నారు. ఫర్టిలైజర్‌ దుకాణాల్లో నకిలీ విత్తనాలు ఉన్నాయా.. అనే కోణంలో రికార్డులు పరిశీలించి, స్టాక్‌ వివరాలు తెలుసుకున్నారు. ప్రధానంగా పత్తి ప్యాకెట్లనే పరిశీలించి బిల్లులు, లేబుళ్లు సైతం పరిశీలించారు.  రాష్ట్రంలో నకిలీ పత్తి విత్తనాలు సాగు చేసి రైతులు నష్టపోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం తనిఖీలు చేయమని ఆదేశించడంతో  నల్లగొండ, సూర్యాపేట జిల్లా వ్యా ప్తంగా తనిఖీలు చేపట్టామని ఆయా జిల్లాల వ్యవసాయాధికారులు శ్రీధర్‌రెడ్డి, జ్యోతిర్మయి తెలిపారు.

కొత్త తండాలో పత్తి విత్తనాలు సీజ్‌

డిండి : మండలంలోని కొత్త తండాలో పాత్లావత్‌ రమేశ్‌ లైసెన్స్‌ లేకుండా, రైతులకు రసీదులు ఇవ్వకుండా బ్రాండెడ్‌ పత్తి విత్తనాలు విక్రయిస్తుండగా ఏఓ నాగేశ్వర్‌రావు, ఎస్‌ఐ కూర్మయ్య దాడి చేసి 476 పత్తి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.3.5లక్షలు ఉంటుందని తెలిపారు. రమేశ్‌ దేవరకొండలోని ఓ లైసెన్స్‌డ్‌ ఫర్టిలైజర్‌ దుకాణం నుంచి పత్తి విత్తనాలు కొనుగోలు చేసినట్లు చెప్పారు. పెద్ద మొత్తంలో విత్తనాలు అక్రమంగా నిల్వ ఉంచడంతో రమేశ్‌పై సెక్షన్‌ 6(ఏ) కింద కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


logo