ఆదివారం 12 జూలై 2020
Nalgonda - Jun 03, 2020 , 02:34:10

పోరాడి సాధించుకున్న తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు

పోరాడి సాధించుకున్న తెలంగాణలో సంక్షేమ, అభివృద్ధి పథకాలు

  • సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి
  • బత్తాయి, నిమ్మ మార్కెట్‌, మెడికల్‌ కాలేజీలు, పవర్‌ ప్లాంట్‌ జిల్లాకు గొప్ప వరాలు 
  • తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి
  • నల్లగొండ కలెక్టరేట్‌లో జెండావిష్కరణ

నల్లగొండ : పోరాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో సర్వతోముఖాభివృద్ధి జరుగుతోందని.. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి పథకాలతో ఆరేళ్లలో అద్భుతమైన ఫలితాలు సాధించామని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన మంగళవారం కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకు ముందు క్లాక్‌టవర్‌ సెంటర్‌లో అమరవీరుల స్తూపానికి జడ్పీ చైర్మన్‌, స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి నివాళులర్పించారు. ఆ తర్వాత శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా గుత్తా మాట్లాడుతూ దేశంలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. వృథాగా సముద్రంలోకి వెళ్తున్న గోదావరి జలాలను వినియోగించుకునేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 120 టీఎంసీల నీటిని నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. నల్లగొండలో ఫ్లోరైడ్‌ మహమ్మారి పోయిందని, పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల, ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గ పనులు రూ.కోట్లు వెచ్చించి నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసరా పింఛన్లతోపాటు కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్‌ లాంటి సంక్షేమ పథకాలు రాష్ర్టానికి మంచి పేరు తెచ్చాయన్నారు. 24 గంటల కరెంట్‌, రైతు బంధు, రైతు బీమా పథకాలు అన్నదాతలకు ఎంతో అండగా నిలిచాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడ్డ ఆరు నెలల్లోనే 24 గంటల కరెంట్‌ ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డిలను ప్రజలు ఎప్పటికీ మరువబోరన్నారు.నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో మెడికల్‌ కళాశాలలతోపాటు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎయిమ్స్‌ ఏర్పాటు చేయడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు మరింత పేరొచ్చిందన్నారు. యాదాద్రి ఆలయాన్ని సుందరంగా తీర్చిదిద్దడానికి రూ.వెయ్యి కోట్లు సర్కార్‌ కేటాయించిందన్నారు.

దామరచర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, జిల్లా కేంద్రంలో బత్తాయి మార్కెట్‌, నకిరేకల్‌లో నిమ్మ మార్కెట్‌తో రైతులకు ఎంతో మేలు జరుగుతోందన్నారు. జిల్లాలో పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. కరోనాను అరికట్టడంలో పారిశుధ్య కార్మికుడి నుంచి కలెక్టర్‌ స్థాయి వరకు సమర్థవంతంగా పని చేసిన జిల్లా యంత్రాంగానికి గుత్తా ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, నోముల నర్సింహయ్య, నల్లమోతు భాస్కర్‌రావు, ఎమ్మెల్సీలు తేరా చిన్నపరెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఐఏఎస్‌ ప్రతిమాసింగ్‌, అదనపు ఎస్పీ నర్మద, ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి పాల్గొన్నారు. 


logo