ఆదివారం 12 జూలై 2020
Nalgonda - Jun 03, 2020 , 01:43:21

సర్కారు బాటలో ‘సాగు’తాం

సర్కారు బాటలో ‘సాగు’తాం

  •  విద్యుత్‌ శాఖ మంత్రి  గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

ఆత్మకూర్‌.ఎస్‌ : నియంత్రిత సాగు విధానాన్ని ఆచరించి లాభాల బాటలో సాగుతామని  మండలంలోని నంద్యాలవారిగూడెం రైతులు ఒక్కతాటిపైకి వచ్చి విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి సమక్షంలో ప్రతిజ్ఞ చేశారు. మంగళవారం మండల పరిధిలోని నంద్యాలవారిగూడెంలో నియంత్రిత సాగుపై మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చి వారి సందేహాలను నివృత్తి చేశారు.

ముఖాముఖి ఇలా కొనసాగింది..

మంత్రి జగదీశ్‌రెడ్డి : వరి సాగు చేయడానికి ఒక ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నారు.?

నంద్యాల సుధాకర్‌రెడ్డి (రైతు) : రూ.20  నుంచి 30వేల వరకు పెట్టుబడి పెడుతున్నాం సార్‌.

మంత్రి : ఇక్కడ ఎక్కువగా ఏం సాగు చేస్తారు.

రైతు : మల్బరీ ఎక్కువగా సాగు చేసేటోళ్లం.. కానీ ఇప్పుడు తగ్గింది.

మంత్రి : మరి ఈసారి ఏం వేయాలనుకుంటున్నారు.

రైతు : ఆరుతడి పంటలేద్దామనుకుంటున్నాం సార్‌.

మంత్రి : అంతర పంటల మాటేమిటి.

రైతు : కంది, వేరుశనగ వేస్తాం.  

మంత్రి : పంటలు మార్చాలని అనుకుంటున్నారా..? 

రైతు : పత్తికి వేరుశనగ వేయాలనుకుంటున్నాం.

మంత్రి : కందికి నీళ్లు కడుతున్నారా..

రైతు : లేదు సార్‌...వానొస్తేనే నీళ్లు..

మంత్రి : ఇక్కడ పంట కాల్వలున్నాయా..? 

రైతు : కాల్వలు లేవు సారూ.. బోర్ల ద్వారానే వ్యవసాయం చేస్తున్నాం.

మంత్రి : ఎందుకు కాల్వలు తీస్తే పూడి పోయినయా..పోడు చేసిందంతా లెక్క కరెక్ట్‌గా ఉందా..అప్పుడు తీసినట్లే ఇప్పుడు తీస్తే లెక్క కుదురుతుందా. అధికారులను పంపిస్తా. యథావిధిగా కాల్వలు తవ్వాలి.

ఇలా రైతు బిడ్డగా.. వ్యవసాయంపై ఉన్న అనుభవంతో మంత్రి జగదీశ్‌రెడ్డి రైతులతో నియంత్రిత సాగుపై జరిపిన సంభాషణ ఆద్యంతం ఆసక్తి రేపింది. ఈ విధానంపై రైతుల్లో అవగాహన పెంపొందించేందుకు మొదట జిల్లా, తర్వాత నియోజకవర్గ స్థాయిలో సదస్సులు నిర్వహిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి తాజాగా గ్రామాల్లో రైతులతో నేరుగా ముఖాముఖి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పంటల మార్పిడితో డిమాండ్‌ ఉన్న పంటలు పండించి ఆ ఉత్పత్తులకు రైతులే గిట్టుబాటు ధర నిర్ణయించుకోవచ్చన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కందికి రంది లేదని, సోయాబీన్‌కు మంచి డిమాండ్‌ ఉందని రైతులకు వివరించారు. ఆయిల్‌పామ్‌ వంటి పంటల వైపు రైతులు దృష్టి సారిస్తే అందుకు అనుగుణంగా ఆయిల్‌ తయారు చేసే కర్మాగారం పెట్టించడం సులభమేనని తెలిపారు. చౌట భూముల్లోనూ లాభదాయక పంట లు ఏ రకంగా పండించవచ్చో ఉదాహరణలతో సహా రైతులకు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పం కూడా అదేనని, అందుకు రైతులను సంఘటితం చేసేందుకే అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ వానకాలంలో ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని మరో 15 రోజుల్లో నీరు విడుదల ఉంటుందని ప్రకటించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

అభివృద్ధిని చూసి టీఆర్‌ఎస్‌లో చేరికలు 

ఆత్మకూర్‌.ఎస్‌ : సూర్యాపేట నియోజకవర్గంలో విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులై మండలంలోని నంద్యాలవారిగూడెంలో సుమారు 70 కుటుంబాలు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరాయి. పార్టీలో చేరిన వారికి గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల, టీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ వేమిరెడ్డి నర్సిం హారెడ్డి, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జీడి భిక్షం, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొణతం సత్యనారాయణరెడ్డి, వైస్‌ చైర్మన్‌ బోల్లె జానయ్య, సర్పంచ్‌ తంగెళ్ల వీరారెడ్డి, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, మర్ల చంద్రారెడ్డి, తూడి నర్సింహారావు, రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు.


logo