సోమవారం 13 జూలై 2020
Nalgonda - Jun 02, 2020 , 00:48:17

జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ

జిల్లాలో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ

36మంది క్వారంటైన్‌కు తరలింపు..  

 జిల్లాలో మరో ఇద్దరికి కరోనా సోకింది. తిప్పర్తి మండలం 

పజ్జూరుకు చెందిన ఓ యువకుడు అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతుండగా బయటపడింది. సదరు వ్యక్తి మూడ్రోజుల కిందట జిల్లాకేంద్రంలో పరీక్షలకు వెళ్లినట్టు తెలియగా ముగ్గురు వైద్యులతో పాటు కుటుంబ సభ్యులను మొత్తం 22మందిని క్వారంటైన్‌ చేసి నమూనాలు సేకరించారు. అదే విధంగా కనగల్‌ మండలం మారేపల్లి గౌరారం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి హైదరాబాద్‌లో వైరస్‌ సోకింది. అతడితో సన్నిహితంగా మెలిగిన గ్రామంలోని 14మందిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. 

తిప్పర్తి : నల్లగొండజిల్లా తిప్పర్తి మండలం పజ్జూరు గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ అనూష, తాసిల్దార్‌ కృష్ణయ్య తెలిపారు. సదరు వ్యక్తి వారంరోజులుగా జ్వరం, ఆయాసంతో బాధపడుతున్నాడు. శనివారం చికిత్సకోసం నల్లగొండలోని ప్రైవేటు దవాఖానకు, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు దవాఖానకు వెళ్లగా పరీక్ష చేసిన వైద్యులు కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. దీంతో అతన్ని చికిత్స కోసం గాంధీ దవాఖానకు తరలించారు. సోమవారం తాసిల్దార్‌ కృష్ణయ్య, ఎంపీడీఓ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ మోయిజ్‌ , శాలిగౌరారం సీఐ నాగదుర్గప్రసాద్‌, ఎస్సై సత్యనారాయణ ఇతరశాఖల అధికారులు గ్రామాన్ని సందర్శించారు. ఆ వ్యక్తి కుటుంబసభ్యులతోసహా 22మంది రక్త నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌కు పంపించారు. రిపోర్టు వచ్చేంత వరకు అందరూ హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.  

ఎం. గౌరారం వాసికి..

కనగల్‌ : మండలంలోని ఎం. గౌరారం గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి డాక్టర్‌ వర్ధిని, ఎంపీడీఓ సోమసుందర్‌రెడ్డి సోమవారం విలేకరులకు తెలిపారు. అతను హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ అక్కడే నివాసముంటున్నాడు. మే 25న సదరు వ్యక్తి బంధువు చనిపోవడంతో అతను గ్రామానికి వచ్చాడు. అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం రాత్రి తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాడు. ఇటీవల అనారోగ్యానికి గురై హైదరాబాద్‌ అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న క్రమంలో టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. అతను గ్రామానికి వచ్చినప్పుడు వెంట ఉన్న 14మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని డాక్టర్‌ వర్ధిని ఆదేశించారు. గ్రామస్తులు జాగ్రత్త వహించాలని సూచించారు. 

ఆంధ్రా సరిహద్దులో వలస కూలీల పడిగాపులు

నందికొండ : ఆంధ్రరాష్ట్రంలోకి వలస కార్మికులను, ప్రయాణికులను అనుమతించకపోవడంతో పైలాన్‌కాలనీలోని సరిహద్దు చెక్‌పోస్ట్‌ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఆంధ్రా నుంచి తెలంగాణలోకి వస్తున్న వారి ఆధార్‌కార్డులు పరిశీలించి, ఆరోగ్యపరీక్షలు నిర్వహించి అనుమతిస్తున్నారు. కానీ ఆంధ్రా అధికారులు కేవలం వారి రాష్ర్టానికి చెందిన వారిని మాత్రమే అనుమతిస్తూ తెలంగాణ, ఇతర రాష్ర్టాల వారికి పాస్‌లు ఉన్నా అనుమతించక దాచేపల్లి మీదుగా వెళ్లాలని సూచిస్తున్నారు. కేవలం 10కి.మీ దూరంలో ఉన్న మాచర్లకు పోలీసులు వెళ్లనీయకపోవడంతో 150కి.మీ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందని పలువురు పేర్కొంటున్నారు. నిజామాబాద్‌ నుంచి నెల్లూరు వెళ్తున్న సుమారు 30మంది సోమవారం చెక్‌పోస్ట్‌ వద్దకు చేరుకొని ఆంధ్రా పోలీసుల అనుమతి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. 


logo