సోమవారం 13 జూలై 2020
Nalgonda - Jun 01, 2020 , 02:28:03

ప్రగతి నిరోధకులు మీరు..

ప్రగతి నిరోధకులు మీరు..

  • తన ప్రసంగాన్ని అడ్డుకున్న ఉత్తమ్‌కు సమాధానం చెప్పిన మంత్రి జగదీశ్‌రెడ్డి

నల్లగొండ : నియంత్రిత సాగు ప్రణాళికపై నల్లగొండలోని కలెక్టరేట్‌లో జరిగిన సమావేశంలో మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రసంగిస్తుండగా.. నల్లగొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడ్డు తగిలారు. మొదట ఉత్తమ్‌ సమావేశంలో ప్రసంగిస్తూ ప్రభుత్వాన్ని విమర్శించినా.. మంత్రి పూర్తిగా విని తర్వాత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పుకోచ్చారు. తెలంగాణ ప్రభుత్వం రూ. 17 వేల కోట్లతో రైతు రుణ మాఫీ చేపట్టినట్లు పేర్కొన్నారు. దాంతో ఎంపీ ఉత్తమ్‌ అడ్డుతగిలి రుణ మాఫీ చేయలేదని...అన్నీ తప్పుడు లెక్కలని అన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. 

ఈ క్రమంలో ఉత్తమ్‌పై మంత్రి నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో రుణ మాఫీపై సీఎం కేసీఆర్‌ స్పష్టంగా ప్రకటించి వివరిస్తున్న క్రమంలో మా దగ్గర వివరాలు లేవని కాంగ్రెస్‌ పార్టీ నేతలు అసెంబ్లీ నుంచి వెళ్లిపోయింది తెలియదా అని ప్రశ్నించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ బానిస మనస్తత్వాలకు అలవాటు పడ్డ కాంగ్రెస్‌ నేతలకు రైతులు బాగుపడటం ఇష్టం లేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలివి తక్కువగా మాట్లాడుతున్నాడని, రుణ మాఫీ జరుగలేదని అంటే ప్రజలు నవ్వుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కాంగ్రెస్‌ పార్టీకి ఇష్టం లేదని, అందుకే ఆ పార్టీ నాయకులు ప్రగతి నిరోధకుల్లా ప్రవర్తిస్తున్నారన్నారు. అభివృద్ధికి అవరోధాలు సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్‌ నేతలు సదస్సుల్లో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. నియంత్రిత సాగుపై ఉత్తమ్‌ తమ వైఖరి చెప్పాలని ఈ సందర్భంగా మంత్రి డిమాండ్‌ చేశారు. 


logo