సోమవారం 13 జూలై 2020
Nalgonda - Jun 01, 2020 , 02:28:03

లాభసాటి వ్యవసాయం కోసమే..నియంత్రిత సాగు

లాభసాటి వ్యవసాయం కోసమే..నియంత్రిత సాగు

  • డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలి 
  • అంతర పంటలపై దృష్టిపెట్టాలి
  • నూతన విధానాన్ని స్వాగతిస్తున్న జిల్లా రైతాంగం 
  • విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి   

నకిరేకల్‌, నల్లగొండ, చండూరులో రైతు అవగాహన సదస్సులుఆశించిన పంట దిగుబడి రావాలన్నా, మార్కెట్‌లో మంచి ధర పొందాలన్నా, రైతులు ఆర్థికంగా ఎదగాలన్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించిన నియంత్రిత సాగు విధానమే ఉత్తమమని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం నకిరేకల్‌, నల్లగొండ,చండూరులో నూతన సాగు విధానంపై నిర్వహించిన నియోజకవర్గస్థాయి అవగాహన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు. తెలంగాణలో అన్ని రకాల వసతులున్నప్పటికీ గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో రైతులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారన్నారు. నియంత్రిత సాగుపై జిల్లా రైతులు సుముఖంగా ఉన్నారని, ప్రభుత్వం సూచించిన పంటలు వేసి లబ్ధిపొందాలని కోరారు.  వరిలో సన్న రకంతోపాటు పత్తి సాగు చేస్తే అధిక లాభాలొచ్చే అవకాశాలున్నాయని, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితి సభ్యులుదీనిపై రైతులను చైతన్య పర్చాలనిసూచించారు. పంటల వివరాలను ఆన్‌లైన్లో నమోదు చేసుకుని ప్రభుత్వ సహాయ, సహకారాలు పొందాలన్నారు. 

నల్లగొండ : ఈ వానకాలం సీజన్‌ నుంచి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం సూచన మేరకు అమలు చేయనున్న నియంత్రిత సాగు విధానాన్ని రైతాంగం పూర్తి స్థాయిలో స్వాగతిస్తోందని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో నియంత్రిత సాగు ప్రణాళికపై జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలో ఇప్పటికే వరితో పాటు పత్తి, కంది పంటలు సాగవుతున్నాయని, ఈసారి సర్కారు సూచన మేరకు గతానికి మించి సాగు చేసేందుకు రైతాంగం సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. వరిలో సన్నాలకంటే దొడ్డురకం కొంత ఎక్కువగా సాగు చేస్తున్నారని, అయితే డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని సన్నరకం ధాన్యం సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. సన్న రకం ధాన్యం సాగు చేసినా వాటిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తుందని, మిల్లర్లు సైతం ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ఈ సీజన్‌లో 10.67 లక్షల ఎకరాల్లో ఆయా పంటలు సాగు కానుండగా అందులో 2.32 లక్షల ఎకరాల్లో సన్న రకాలు, 90 వేల ఎరకాల్లో దొడ్డు రకాలు,7.10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అనేక సబ్సిడీ పథకాలతో పాటు  దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో రూ.17వేల కోట్లతో రుణ మాఫీ చేసిందని, ఇప్పటికే తొలి దఫాగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసామని చెప్పారు.  ప్రభుత్వం ఈ సీజన్‌ నుంచి నియంత్రిత సాగు ప్రణాళికను ప్రకటించగానే రైతులు దానిపైనే దృష్టి సారించి సాగు చేసే విధంగా ఆసక్తి చూపుతున్నారని డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు.  

డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలి

నకిరేకల్‌ : మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలను రైతులు పండించి ఆర్థికంగా ఎదుగాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. వానకాలం నియంత్రిత సాగు, పంటల కార్యాచరణ ప్రణాళిక నకిరేకల్‌ నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశం ఆదివారం పట్టణంలోని సువర్ణ గార్డెన్‌ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించారు. సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిమాండ్‌ ఉన్న పంటలను పండిస్తే మాత్రమే రైతులు తమ ఉత్పత్తులకు ధర నిర్ణయించడం సాధ్యమని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సర్వేలు చేయించి నియంత్రిత సాగు విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారని పేర్కొన్నారు. కార్యక్రమంలో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జడ్పీ చైర్మన్లు బండ నరేందర్‌రెడ్డి, ఎలిమినేటి సందీప్‌రెడ్డి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పూజర్ల శంభయ్య, డీసీసీబీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి, ఏసీరెడ్డి దయాకర్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ రామచంద్రునాయక్‌, వ్యవసాయ అధికారులు శ్రీధర్‌రెడ్డి, అనురాధ, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, చిట్యాల మున్సిపల్‌ చైర్మన్‌ కోమటిరెడ్డి చిన్నవెంకట్‌రెడ్డి, ఎంపీపీలు బచ్చుపల్లి శ్రీదేవి, జెల్లా ముత్తిలింగయ్య, సూదిరెడ్డి నరేందర్‌రెడ్డి, కొలను సునీత, కన్నెబోయిన జ్యోతి, జడ్పీటీసీలు మాద ధనలక్ష్మి, తరాల బలరాం, సుంకరి ధనమ్మ, పున్న లక్ష్మి పీఏసీఎస్‌ చైర్మన్లు పాల్గొన్నారు.  

లాభసాటి వ్యవసాయానికే..

చండూరు : లాభసాటి వ్యవసాయం కోసమే ప్రభుత్వం నియంత్రిత సాగు విధానాన్ని అమలు చేస్తోందని, రైతులు దానిని పాటించి లాభాలను చవిచూడాలని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అధ్యక్షతన ఆదివారం చండూరు మున్సిపాలిటీ పరిధిలోని అంగడిపేటలో ఏర్పాటు చేసిన నియంత్రిత సాగు పద్ధతిపై కార్యాచరణ ప్రణాళిక నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో పాటు జడ్పీటీసీలు నారబోయిన స్వరూపారాణి, కర్నాటి వెంకటేశం, ఎంపీపీలు పల్లె కళ్యాణి, ఏడుదొడ్ల శ్వేతారవీందర్‌రెడ్డి, కర్నాటి స్వామి, తాడూరి వెంకట్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.


logo