శనివారం 11 జూలై 2020
Nalgonda - May 31, 2020 , 04:31:29

శ్రమను నమ్ముకుని ‘సాగు’తున్న గిరిజనం

 శ్రమను నమ్ముకుని ‘సాగు’తున్న గిరిజనం

  •  ‘జల సంరక్షణ’తో ఉపాధికి బాటలు 
  •  ఆర్థిక చేయూతనిచ్చిన నాబార్డు పనులు 
  •  కరోనా వేళ ప్రతి కుటుంబానికి ఆదాయం 

దేవరకొండ : మండల పరిధిలోని సపావట్‌, ధర్మతండాలను నాబార్డు ఎంపిక చేసుకొని జల సంరక్షణ పనులతో అక్కడి గిరిజనులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పిస్తోంది. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయి పంటల సాగు ప్రశ్నార్థకమైన తరుణంలో ఆ రెండు తండాల గిరిజనులు మూకుమ్మడిగా శ్రమదానికి పూనుకున్నారు. చేయి చేయి కలిపి ఫాంపాండ్‌ను నిర్మించారు. గిరిజనుల చైతన్య స్ఫూర్తిని చూసి నాబార్డు వారికి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది.

డబ్ల్యూడీఎఫ్‌ పథకం కింద యాక్షన్‌ ఫర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ ఆధ్వర్యంలో జల సంరక్షణకు సంబంధించిన పనులను కల్పించింది. గిరిజనులతోనే ఏర్పాటైన వాటర్‌ షెడ్‌ కమిటీలు ఉపాధి కల్పనకు బాటలు వేసుకుంటున్నాయి. వరద కట్టలు, స్టోన్‌ అవుట్‌లెట్లు, సంకెన్‌ పాండ్స్‌, ఫాంపాండ్స్‌, కందకాలు, రాతి కట్టడాలు వంటి పనులను గిరిజనులే చేస్తూ నిత్యం ఉపాధి పొందుతున్నారు. గతంలో గుట్టలపై నుంచి జాలువారిన నీరంతా దిగువకు వృథాగా పోయేది. దీనివల్ల భూమి కోతకు గురయ్యేది. ప్రస్తుతం ఈ పరిస్థితులు కనుమరుగై ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు సైతం గణనీయంగా పెరిగాయి. గుట్టల చుట్టూ వరద కట్టలు నిర్మించడంతో పాటు నేల కోతను నివారించేందుకు చేపట్టిన రాతి కట్టడాలు భూగర్భ జలాల పెంపునకు దోహదపడ్డాయి. గతేడాది మొదటి విడుతలో రూ.5 లక్షల మేర పనులు జరిగి గిరిజనులకు చేతినిండా పని దొరకగా.. ఈ ఏడాది మరో రూ.5 లక్షలతో జల సంరక్షణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 

కరోనాలో ఆదుకున్న జల సంరక్షణ పనులు 

సపావట్‌ తండా, ధర్మతండాల పరిధిలో సుమారు 180  గిరిజన కుటుంబాలున్నాయి. ఇందులో 75 కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వెళ్లాయి. లాక్‌డౌన్‌ కారణంగా వీరంతా సొంతూళ్లకు చేరుకోగా.. నాబార్డు ఆధ్వర్యంలో కొనసాగుతున్న జల సంరక్షణ పనులు వలస కూలీలకు కొండంత అండగా నిలిచాయి. వలస కుటుంబాలే సుమారు రూ. 4 లక్షల వరకు సంపాదించుకోగా.. ఒక్కో కుటుంబానికి రూ.3,800 వరకు గిట్టుబాటు అయ్యింది. ఒకప్పుడు నీటి కొరతతో పంటలు సాగు చేయడమే దండగ అనే పరిస్థితుల్లో ఇక్కడి గిరిజనులు ఉండగా.. భూగర్భ జలాలు పెరిగిన నేపథ్యంలో వివిధ రకాల పంటల సాగుతో పాటు కూరగాయల సాగుకు ఇక్కడి భూములు ఉపయుక్తంగా మారడంతో రైతులకు భరోసా కలుగుతోంది. 


logo