శనివారం 11 జూలై 2020
Nalgonda - May 31, 2020 , 04:29:11

వేసవిలోనూ నిండుగా...

వేసవిలోనూ నిండుగా...

  •  ‘మిషన్‌కాకతీయ’తో  200చెరువులు, కుంటలు పునరుద్ధరణ
  • వానకాలం సాగుకు పుష్కలంగా నీరు 
  •  సాగుకు సన్నద్ధమవుతున్న  రైతన్న 

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్‌ కాకతీయ పథకం సత్ఫలితానిస్తోంది. సీమా్రంధ పాలనలో పూర్తిగా ధ్వంసమైన వందలాది చెరువులకు మహర్దశ పట్టింది. మిషన్‌కాకతీయ పథకం ద్వారా నాగార్జునసాగర్‌ ఆయకట్టు, నాన్‌ ఆయకట్టు మండలాల పరిధిలోని చెరువులు, కుంటలను సుమారు రూ.200కోట్లతో పునరుద్ధరించారు. దీంతో మండు వేసవిలోనూ జలకళను సంతరించుకున్నాయి.

- హాలియా  

సాగర్‌ ఎడమకాల్వ ఆయకట్టులోని అనుముల, తిరుమలగిరి(సాగర్‌), నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడ్‌, నాన్‌ ఆయకట్టు ప్రాంతాల్లో సుమారు 200కు పైగా చెరువులు ఉన్నాయి. ప్రభుత్వం మిషన్‌కాకతీయలో భాగంగా మట్టిపూడిక తీయించడంతో  వేసవిలో నిండుకుండను తలపిస్తున్నాయి. ఈ ఏడాది రోహిణి, ఆరుద్ర కార్తెల్లోనే ముందస్తుగా సాగును ప్రారంభించేందుకు రైతాంగం సన్నద్ధమవుతోంది. నారు పోసేందుకు మడులను సైతం సిద్ధం చేస్తున్నారు. 

ముందస్తు ప్రణాళికలు

జిల్లాలోని సాగర్‌ ఆయకట్టులో చెరువులను ఎడమకాల్వ, నాన్‌ ఆయకట్టు ప్రాంతంలోని చెరువులన్నింటిని ఏఎమ్మార్పీ, లోలెవల్‌కెనాల్‌(వరదకాల్వ) ద్వారా పూర్తిస్థాయిలో ప్రభుత్వం నింపుతోంది. జిల్లాలోని అన్ని చెరువుల కింద వానకాలంలో ముందస్తు సాగుపై ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. సుమారు లక్ష ఎకరాల్లో వరిసేద్యం జరిగే అవకాశం ఉంది. గతంలో కంటే ఈసారి పంట సాగు 5 రెట్లు పెరిగే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ అంచనా. 

ఆరుద్ర కార్తెలోనే నారుపోస్తా

చెరువు కింద నాకు ఎకరంన్నర భూమి ఉంది. చెరువు నిండా నీరు ఉండటంతో ఈ ఏడాది ఆరుద్ర కార్తెలోనే ముం దస్తుగా నారు పోసేందు కు మడిని దమ్ముచేశా. సీఎం కేసీఆర్‌ సార్‌ చెప్పిన విధంగానే సన్నరకం వరి సాగు చేస్తా.    

- రాయనబోయిన రామలింగయ్య, రైతు, పేరూరు


logo