బుధవారం 08 జూలై 2020
Nalgonda - May 25, 2020 , 03:08:54

నేడు ‘ఈదుల్‌ ఫిత్ర’

 నేడు ‘ఈదుల్‌ ఫిత్ర’

  • ముగిసిన ఉపవాస దీక్షలు 
  • లాక్‌డౌన్‌తో ఇండ్లల్లోనే రంజాన్‌ వేడుకలు

 పవిత్ర మాసంలో పాటించే ఉపవాస దీక్షలు ఆదివారంతో ముగిశాయి. సాయంత్రం షవ్వాల్‌ నెలవంక దర్శనమివ్వగా.. సోమవారం ఈదుల్‌ ఫిత్‌ పండుగను జరుపుకునేందుకు సిద్ధమయ్యారు.  రంజాన్‌ సంద ర్భంగా ఈద్‌గాలో సామూహిక ప్రార్థనలు చేయాల్సి ఉండగా..  కరోనా కారణంగా ఈ సారి పండుగ వేడుకలతో పాటు నమాజ్‌ కూడా ఇండ్లల్లోనే చేస్తున్నారు.  

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం ఆదివారంతో ముగిసింది. దీంతో ఉపవాస దీక్షలు సైతం ముగించి సోమవారం ఈదుల్‌ ఫిత్‌ పండుగను జరుపుకుంటున్నారు. రంజాన్‌ మాసాంతం చేసిన ఉపవాసాలు పరిసమాప్తం చేసిన సందర్భంగా పేదలకు తప్పనిసరిగా చేసే దానాన్ని ‘ఫిత్‌'్ర అంటారు. దీంతోనే రంజాన్‌ పండుగకు ‘ఈదుల్‌ ఫిత్‌'్ర అని పేరు వచ్చింది. నెలంతా మంచి పనులు, ఉపవా దీక్షలు పూర్తి చేయడానికి అవకాశం కల్పించిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుతూ రెండు రకాల ఈద్‌ నమాజ్‌ చేస్తారు.

ప్రత్యేక వంటకం షీర్‌ఖుర్మా 

పండుగ రోజున వేకువ జామునే ఫజర్‌ నమాజ్‌ ఆదరిస్తారు. రంజాన్‌ రోజున ప్రతి ఇంట్లో ప్రత్యేక వంటకం షీర్‌ఖుర్మా(సేమియాలు)ను తయారు చేస్తారు. నూతన వస్ర్తాలు ధరించి అత్తరు అద్దుకొని, షీర్‌ఖుర్మాను ఆరగించిన అనంతరం పండుగ ప్రత్యేక నమాజ్‌కు  ముస్లింలంతా సామూహికంగా వెళ్తారు. కానీ కరోనా వైరస్‌ కారణంగా ఈ సంవత్సరం పండుగ వేడుకలను ఇండ్లల్లోనే నిర్వహించుకుంటున్నారు. అయితే ప్రతి సంవత్సరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ రంజాన్‌ శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ. కానీ ఈ సంవత్సరం భౌతిక దూరం పాటిస్తున్న నేపథ్యంలో ముస్లింలు పండుగ వాట్సప్‌, మెసేజ్‌, వీడియో కాల్స్‌ ద్వారా శుభాకాంక్షలను తెలుపుకుంటున్నారు.

ఫిత్రా తప్పని సరి

పండుగ శుభ సందర్భంలో పేదలు సైతం ఆనందంగా గడపడానికి ప్రతీ ముస్లిం ఫిత్రా తప్పక ఇవ్వాలి. ఫిత్రా అంటే స్థానిక కొలమానం ప్రకారం గోధుమలు, ఖర్జూరాలు లేదా అంతే విలువను పేదలకు దానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం ఒక ఫిత్రాను రూ.70గా నిర్ణయించారు. ఈద్‌ నమాజ్‌కు వెళ్లే ముందే దీనిని పేదలకు అందించాలి. ప్రతి ముస్లిం(స్త్రీ, పురుషుడు) ఫిత్రా చెల్లించాల్సి ఉంటుంది.

జకాత్‌.. పేదల ఆర్థిక హక్కు

ఇస్లాం సౌధానికుండే ఐదు మూలస్తంభాల్లో ‘జకాత్‌' ఒకటి. ధనికులు ఏడాదికోసారి తమ సంపదలో రెండున్నర శా తం పేదలకు దానం చేయడాన్ని ‘జకాత్‌' అంటారు. ఖురాన్‌లో కూడా 32చోట్ల జకా త్‌ ప్రస్తావన ఉంది. అందుకే దీనికి ముస్లింలు ఎంతో ప్రాధా న్యత ఇస్తారు.

కలెక్టర్‌ శుభాకాంక్షలు

నల్లగొండ : రంజాన్‌ పండుగను పురస్కరించుకొని జిల్లాలోని ముస్లింలకు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదివారం ఒక ప్రకటనలో రంజాన్‌ శుభాకాంక్షలు తెలిపారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌గా అభివర్ణించారు.   స్వీయ నియంత్రణ, భౌతిక దూరం పాటిస్తూ పండుగ జరుపుకోవాలని, కరోనా మహమ్మారి నుంచి అందరూ బయట పడేందుకు అల్లాను ప్రార్థించాలని కోరారు. 


logo