మంగళవారం 26 మే 2020
Nalgonda - May 24, 2020 , 01:05:58

సేవలకు గుర్తింపు..

సేవలకు గుర్తింపు..

 కరోనా నియంత్రణలో పోలీస్‌, 

వైద్య, పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివి 

వారి శ్రమను గుర్తించి ప్రోత్సాహకం 

అందించిన తెలంగాణ ప్రభుత్వం

మూలవేతనంలో 10 శాతం అదనంగా అందజేత   

ఏప్రిల్‌, మే నెలలో విడుదల

తిరుమలగిరి : కరోనా వైరస్‌ నిర్మూలనలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ను మార్చి 23 నుంచి అమలు చేస్తున్నది. ఈ క్రమంలో లాక్‌డౌన్‌ పకడ్బందీగా అమలయ్యేలా పోలీసులు చూస్తుండగా..వైద్యసిబ్బంది, పారిశుధ్య కార్మికులు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. కుటుంబాలకు దూరం గా ఉండి విధులు నిర్వర్తిస్తున్న వీరికి తెలంగాణ ప్రభుత్వం తగిన ప్రోత్సాహకం అందించింది. వారి మూల వేతనంలో పదిశాతం అదనంగా ఇచ్చింది. ఏప్రిల్‌, మే నెల వేతనంలో వాటిని అందించడంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు, వైద్య, ఆరోగ్య పారిశుధ్య సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

కరోనా కట్టడిలో 

పోలీసుల పాత్ర కీలకం

కరోనాను నియంత్రించడంలో పోలీసుల పాత్ర కీలకమని చెప్పవచ్చు. ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రాకుండా అడ్డుకోవడం, రెడ్‌జోన్లలో బారికేడ్లు ఏర్పాటు చేయడం, రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయడం, బ్యాంకులు, కిరాణాషాపులు, కూరగాయల మార్కెట్ల వద్ద ప్రజలు భౌతిక దూరం పాటించేలా, మాస్కులు ధరించేలా చర్యలు తీసుకోవడం వంటివి నిరంతరం చేశారు. అలాగే జిల్లాలోని రాష్ట్ర సరిహద్దుల్లో పకడ్బందీగా తనిఖీలు నిర్వహించి వలస ప్రజలను రాకుండా కట్టడి చేశారు. 

వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి..

కనిపించే దేవుళ్లు వైద్యులు అంటారు. దేవుడు ప్రాణం పోస్తే వైద్యుడు ప్రజల ఆరోగ్యం కాపాడుతాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతుండగా వైద్యులు, ఆరోగ్య సిబ్బంది మాత్రం తమ ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు కూడా చేయని విధంగా కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు చికిత్స అందిస్తూ వారిలో మనోధైర్యం నింపుతున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా కంటైన్మెంట్‌ జోన్లలో ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి కొత్త కేసులు రాకుండా జాగ్రత్తలు చేపట్టారు. ప్రభుత్వ, హోంక్వారంటైన్లలో ఉన్న కరోనా అనుమానిత వ్యక్తులు కోలుకుని ఇంటికి చేరేలా సఫలీకృతులయ్యారు. 

పారిశుధ్య కార్మికుల సేవలు ఎనలేనివి..

కరోనా నేపథ్యంలో పారిశుధ్య కార్మికులు ప్రజాశ్రేయస్సుకే అంకితమయ్యారు. తెల్లవారుజాము నుంచే విధుల్లో పాల్గొంటూ గ్రామాలు, పట్టణాల్లో పారిశుధ్య చర్యలు చేపట్టారు. చెత్తాచెదారం తొలగిస్తూ సోడియం హైపోక్లోరైట్‌, బ్లీచింగ్‌ తదితర రసాయనాలను పిచికారీ చేస్తున్నారు. రెడ్‌ జోన్‌ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాల అందజేతలోనూ చేయూతనిచ్చారు.  

రెండు నెలలు..10 శాతం అదనంగా..   

సూర్యాపేట జిల్లాలో 28 పోలీస్‌ స్టేషన్లు ఉండగా ఒకరు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలు, 9 మంది సీఐలు, 45మంది ఎస్‌ఐలు, 620 మంది సివిల్‌, 210 ఏఆర్‌ కానిస్టేబుళ్లు విధులు నిర్వహిస్తున్నారు. అలాగే ఏరియా దవాఖానలు, పీహెచ్‌సీలలో 90 మంది డాక్టర్లు, సూపర్‌వైజర్లు, 360మంది ఏఎన్‌ఎంలు, 1042మంది ఆశ వర్కర్లు ఉన్నారు. ఐదు మున్సిపాలిటీలు, 475 గ్రామ పంచాయతీల్లో 1718 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో వారి సేవలకుగాను ప్రభుత్వం మూల వేతనంలో అదనంగా 10 శాతం ప్రోత్సాహకం అందించింది. గత నెల ఏప్రిల్‌లో వాటిని అప్పటికే ఇవ్వగా ఈ నెల సైతం వారి వేతనంలో జమ చేసింది. 

మా సేవలను గుర్తించినందుకు సంతోషంగా ఉంది

కరోనా వైరస్‌ కట్టడిలో మేము అహర్నిశలు కృషి చేశాం. శాంతి భద్రతలను కాపాడటంలో ప్రతి పోలీసు బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించారు. కరోనా కష్టకాలంలో మేం చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండేలా తెలంగాణ ప్రభుత్వం పోలీసులకు మూల వేతనంలో 10 శాతం ప్రోత్సాహకం అందించడం హర్షణీయం. 

- డేనియల్‌ కుమార్‌, ఎస్‌ఐ, తిరుమలగిరి 

ప్రజా సేవ చేసినందుకు గర్వంగా ఉంది

కంటైన్మెంట్‌ ఏరియాలో ప్రజలకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తెలిపాం. విదేశాలు, వలసొచ్చిన కార్మికులను గుర్తించి స్టాంపింగ్‌ వేసి క్వారంటైన్‌కు తరలించాం. కరోనా నియంత్రణకు తాము ప్రజలకు సేవ చేసినందుకు గర్వంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం మాకు గుర్తింపుగా ప్రోత్సాహకం ఇవ్వడం గొప్ప విషయం. 

-డాక్టర్‌ ప్రశాంత్‌బాబు, తిరుమలగిరి పీహెచ్‌సీ


logo