శుక్రవారం 29 మే 2020
Nalgonda - May 24, 2020 , 01:06:03

ఏరువాక ప్రణాళిక సిద్ధం

ఏరువాక ప్రణాళిక సిద్ధం

 వానకాలం నియంత్రిత సాగుకు శ్రీకారం

సబ్సిడీ విత్తనాలు, ఎరువులు రెడీ..

సర్కార్‌ సూచన మేరకు పంటల సాగు

వరిలో సన్నరకం ధాన్యానికి పెద్దపీట

పత్తి, కంది సహా పప్పు ధాన్యాలపై దృష్టి

వ్యవసాయంలో మరో విప్లవాత్మక మార్పునకు తెలంగాణ సర్కారు దృఢ నిశ్చయంతో ఉన్నది. కృష్ణా, గోదావరి, మూసీ నదీ జలాలు పుష్కలంగా లభిస్తున్న తరుణంలో పంట మార్పిడి దిశగా నియంత్రిత సాగు విధానాన్ని అమలుచేయాలని భావిస్తున్నది. గిరాకీ ఉన్న పంటల్నే పండించడం, డిమాండ్‌ ఉన్నప్పుడే పంటను మార్కెట్‌కు తేవడం.. నియంత్రిత వ్యవసాయం సారాంశం! వ్యవసాయానికి పెట్టుబడి సాయం మొదలు విత్తనాల్లో సబ్సిడీ, ఎరువుల్లో రాయితీ సమకూర్చుతున్న ప్రభుత్వం... రైతులు మూస విధానం వీడి మంచి ఆదాయం పొందేలా మేధోమధనం జరిపింది. ఈ మేరకు జిల్లా నేలలకు అనువైన పంటలు వేసి లాభాలు గడించేలా ప్రణాళిక రూపొందించింది. ఒకే రకమైన పంటలసాగుతో ధరలు తగ్గి రైతులు నష్ట పోతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు‘నియంత్రిత సాగు’ను వ్యవసాయాధి కారులు 

ప్రోత్సహిస్తున్నారు. 

- సూర్యాపేట, నమస్తే తెలంగాణ/నల్లగొండ

 నల్లగొండలో పత్తి...  సూర్యాపేటలో వరి...

ప్రభుత్వం పంట మార్పిడి పద్ధతికి ప్రాధాన్యమిస్తూ నియంత్రిత సాగు విధానం ప్రకటించింది. నూతన లెక్కల ప్రకారం సూర్యాపేట జిల్లాలో గతేడాదికంటే వరి సాగు పెరుగగా.. నల్లగొండ జిల్లాలో సుమారు రెండు లక్షల ఎకరాలకు కుదించారు. పత్తి సాగు సూర్యాపేటలో గతేడాది 1.04లక్షల ఎకరాలు కాగా.. ఈ ఏడాది రెండులక్షలకు పెరిగింది. నల్లగొండ జిల్లాలో 7లక్షల ఎకరాల్లో పత్తిసాగుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

సూర్యాపేట, నమస్తే తెలంగాణ : వానకాలం పంటల యాక్షన్‌ప్లాన్‌ వ్యవసాయాధికారులు సిద్ధం చేశారు. జూన్‌ తొలి వారంలో తొలకరి జల్లులు పడిన వెంటనే దుక్కులు దున్నేందుకు రైతాంగం సిద్ధమవుతుండగా వ్యవసాయశాఖ కూడా తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించింది. పంటల విస్తీర్ణం అంచనాలను ప్రకటించారు. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో 15,96,118 ఎకరాల్లో వివిధ పంటల సాగు అంచనా వేసింది. నల్లగొండలో 10, 67,318ఎకరాలు, సూర్యాపేటలో 5,28, 800ఎకరాలు సాగుకు అనుకూలమైన నేలలుగా గుర్తించింది.

మూస పద్ధతికి వీడ్కోలు... పంట మార్పిడికి అడుగులు...

రైతులంతా ఒకే రకమైన పంట సాగు చేయడం వల్ల మద్దతు ధర దక్కడం లేదు. దీంతో డిమాండ్‌కు అనుగుణంగా పంటల మార్పిడి అవసరాన్ని గుర్తించిన ప్రభుత్వం.. నియంత్రిత సాగు విధానం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ మంత్రులు, జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయశాఖ, రైతులతో సమీక్షలు చేసిన అనంతరం ఏ రకమైన భూముల్లో ఏయే రకమైన పంటలు వేయాలనే విషయమై రూపకల్పన చేశారు. ఈ సారి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పంటలు 5,28,800 ఎకరాల్లో సాగయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. గతేడాది ఇదే సీజన్‌లో 3,40,190ఎకరాల్లో పంటలు సాగు చేయగా ఈ ఏడాది మరో 1,88,610ఎకరాల విస్తీర్ణం పెరుగనుంది. జిల్లాలో కృష్ణా, గోదావరి, మూసీ మూడు నదుల ద్వారా సాగునీరు లభిస్తుండగా నీటి లభ్యత, భూముల తీరును బట్టి జిల్లాలో అత్యధికంగా వరి తరువాత పత్తితో పాటు పెసర, కంది, వేరుశనగా ఇతర పంటలు కొంత ఉన్నాయి. 

వ్యవసాయశాఖ సన్నాహాలు...

వానకాలం పంటల సాగు విస్తీర్ణంలో ఇప్పటికే కచ్చితమైన అంచనాలతో వ్యవసాయశాఖ సిద్ధమైంది. సబ్సిడీ విత్తనాలతో పాటు యూరియా, డీఏపీ, పొటాష్‌, కాంప్లెక్స్‌ ఎరువులు అవసరం మేరకు సమకూర్చే పనిలో నిమగ్నమైంది. సూర్యాపేట జిల్లాకు 71,535 మెట్రిక్‌ టన్నుల యూరియా, 23,481 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 30వేల కాంప్లెక్స్‌ ఎరువులు, 22వేల మెట్రిక్‌ టన్నుల ఎంఓపీ ఎరువులు అందుబాటులో ఉంచారు. విత్తనాలు, ఎరువులను ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, గ్రోమోర్‌ రిటైల్‌ కేంద్రాలతో పాటు ఇతర కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 

రైతుల తలరాత రైతులే రాసుకోవాలి..

‘అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అనే సామెత ఉన్నది. దీనిని మార్చాలి. రైతుల తలరాత రైతులే రాసుకోవాలి. తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తున్నది. రైతులను పైకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నది. తెలంగాణ రైతులకు అప్పులు ఉండవద్దు. సొంతంగా పెట్టుబడులు పెట్టుకునే శక్తి రావాలి. ప్రభుత్వం సూచించే పంటలను పండించాలి. లాభాలు పొందాలని రైతు సోదరులను కోరుతున్న. వరి మొత్తం వేయొద్దని కాదు గానీ ఏ రకం వేస్తే బాగుంటుందనేది ప్రభుత్వమే చెప్తుంది. పత్తి చేను పెంచుదాం. రైతులు లాభాలు ఆర్జించి, ధనవంతులు కావాలనేది ప్రభుత్వ ఉద్దేశం.

- ముఖ్యమంత్రి కేసీఆర్‌

సన్న, చిన్నకారు రైతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ ఉద్దేశం...

నల్లగొండ జిల్లాలో 10,67,318 ఎకరాల్లో పంటల సాగు నిర్దేశించినట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత వానకాలం 48శాతం సన్నరకాలు, 52శాతం దొడ్డు రకాలు రైతులు సాగు చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు వరిలో 72శాతంపైగా సన్నరకాలు (బీపీటీ-5204, సోనా ఆర్‌ఎన్‌ఆర్‌ 15048, ప్రైవేట్‌ సన్నరకాలు, చింట్లు, అంకుర్‌ సోనా), 28శాతం దొడ్డు రకాలు(ఎంటీయూ-1010, బతుకమ్మ)సాగు చేయాలన్నారు. పత్తిలో అంతర పంటగా కందిసాగు పెరిగేలా చూడాలని సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులను ఆయన ఆదేశించారు. సన్న రకాలు టీఎస్‌ సీడ్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రాయితీపై ప్రభుత్వమే సరఫరా చేస్తుందని స్పష్టం చేశారు. ఈ మేరకు మండల, గ్రామాల వారీగా అగ్రికల్చర్‌ కార్డు తయారు చేయాలని సూచించారు. ఏఎమ్మార్పీ పరిధిలో పత్తి, కంది, ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలన్నారు. పచ్చిరొట్ట ఎరువుల సాగును ప్రోత్సహించి 5000క్వింటాళ్ల జీలుగ, 400క్వింటాళ్ల జనుము విత్తనాలు మండల కేంద్రాల ద్వారా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయాలన్నారు. సమావేశంలో సహాయ వ్యవసాయ సంచాలకులు, మండల వ్యవసాయ అధికారులు, డీఏఓ, ఏడీఏలు హుస్సేన్‌బాబు, టెక్నికల్‌ గిరిప్రసాద్‌, కీర్తి తదితరులు పాల్గొన్నారు.

ప్రోత్సాహం కోసమే పంటల మార్పిడి...

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ అనేక రకాల ప్రోత్సాహకాలను అందిస్తోంది. రైతులను లాభాల్లోకి నడిపించేందుకే పంటల మార్పిడికి శ్రీకారం చుట్టింది. శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ సూచించిన పంటలనే రైతులు సాగుచేయాలి. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఏఏ ప్రాంతాల్లో ఎలాంటి రకాల భూములు ఉన్నాయి.. ఆయా భూముల్లో ఎలాంటి పంటలు వేయాలనేది నిర్ధారణకు వచ్చింది. పంటల మార్పిడిపై జిల్లా వ్యాప్తంగా క్షేత్రసమావేశాలుంటాయి. గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసి రైతులతో మాట్లాడిస్తూనే శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారులతో ప్రసంగాలు ఉండేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం.

- వినయ్‌కృష్ణారెడ్డి, కలెక్టర్‌, సూర్యాపేట 


logo