మంగళవారం 26 మే 2020
Nalgonda - May 23, 2020 , 01:29:42

ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

ఆలయ పునర్నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి

 వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఈఓ గీత 

 ఆధారశిల మొదలు మహానాసి వరకు కృష్ణశిలతో నిర్మితమవుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పనుల్లో వేగం పెంచాలని ‘యాడా’ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈఓ గీత పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన పనుల తీరుపై శుక్రవారం చీఫ్‌ ఆర్కిటెక్ట్‌లు, స్తపతులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రాజగోపురాలు, గర్భగుడిపై 42అడుగుల దివ్య విమాన నిర్మాణ క్రతువు పరిపూర్ణమైందని తెలిపారు. 

 - యాదగిరిగుట్ట 

యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ రాజగోపురాలు, ప్రధానాలయం, గర్భగుడి నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని యాడా వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆలయ ఈఓ గీత తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌లో యాదాద్రి పనుల పురోగతిపై శుక్రవారం చీఫ్‌ ఆర్కిటెక్టులు, స్ట్రక్టర్లు, స్తపతులతో కలిసి వారు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. యాదాద్రిలో అనుకున్న విధంగా అన్ని దిక్కుల్లో ఆరు రాజగోపురాలు, గర్భగుడిపై దివ్య విమానం ఆవిష్కృతమయ్యాయని పేర్కొన్నారు. మొదటి ప్రాకారంలో తూర్పువైపున త్రితల రాజగోపురం(ప్రవేశ మార్గం), పడమర దిశలో ఐదంతస్తుల గోపురం(బయటకు వెళ్లేందుకు) రూపుదిద్దుకున్నాయన్నారు. రెండో ప్రాకారానికి పశ్చిమాన ఏడంతస్తుల మహా రాజగోపురం, తూర్పు, ఉత్తర, దక్షిణ దిశల్లో ఐదంతస్తుల రాజగోపురాలు నిర్మించినట్లు తెలిపారు. స్వయంభువులు కొలువై ఉన్న గర్భగుడిపై 42 అడుగుల ఎత్తున దివ్య విమాన గోపుర నిర్మాణం కూడా పూర్తయ్యిందని తెలిపారు. దక్షిణాదిలో ఎక్కడా లేని విధంగా గోపురాలన్నీ సంపూర్ణంగా కృష్ణశిలతో తీర్చిదిద్దామని, శిల్ప సంప్రదాయం, కళల గురించి, భవిష్యత్తు తరాలకు తెలియజెప్పేలా ఆలయ విస్తరణ పనులు చేపట్టినట్లు చెప్పారు. వారి వెంట చీఫ్‌ ఆర్కిటెక్ట్‌ మధు, ఆర్కిటెక్ట్‌ ఆనందసాయి, స్ట్రక్టర్‌ ఇంజినీర్లు లక్ష్మీనారాయణ, వెంకటేశ్వర్లు, స్తపతులు సంజయ్‌, మొగిలి, రామ్మూర్తి, వైటీడీఏ ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ వసంతనాయక్‌, ఉప స్తపతులు చిరంజీవి, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు.  


logo