మంగళవారం 26 మే 2020
Nalgonda - May 23, 2020 , 01:29:40

అవసరానికి అక్షయపాత్ర

అవసరానికి అక్షయపాత్ర

ఆపత్కాలంలో బియ్యం వితరణ

చిట్యాల : లాక్‌డౌన్‌లో ఏ ఒక్కరూ పస్తులుండొద్దు.. ప్రతి పేద కుటుంబం ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో చిట్యాల మున్సిపాలిటీలో చేపట్టిన వినూత్న కార్యక్రమం ‘అక్షయ పాత్ర’. చిట్యాల మండలంలో దాదాపు 2200మంది వలస కూలీలను గుర్తించిన అధికారులు 260క్వింటాళ్ల బియ్యం, ప్రతి కుటుంబానికి రూ.500 నగదు అందజేశారు. దాతల సహకారంతో నిత్యావసరాలు సైతం పంపిణీ చేశారు. ఈ క్రమంలో పలు కారణాలతో సాయం పొందలేని కుటుంబాలకు సైతం బియ్యం అందజేయాలనే ఉద్దేశంతో తాసిల్దార్‌ ‘అక్షయపాత్ర’ ఆలోచన చేశారు.ప్రతి రేషన్‌షాపు వద్ద డ్రమ్మును ఏర్పాటు చేయించి బియ్యం అవసరం లేని కార్డుదారులు వాటిని దానం చేసేలా చొరవ తీసుకోవాలని డీలర్లను కోరారు. ఆపత్కాలంలో స్పందించిన ప్రజలు తమ అవసరాలు పోను పెద్ద ఎత్తున బియ్యం దానం చేశారు. ‘ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది.. 17రోజుల్లోనే మండల వ్యాప్తం గా 133క్వింటాళ్ల బియ్యం సమకూరాయి.. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చేతుల మీదు గా ఈ నెల 23న పేదలకు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం’అని తాసిల్దార్‌ కృష్ణారెడ్డి తెలిపారు. ‘అక్షయపాత్ర’ను కొనసాగించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారని ఆయన వెల్లడించారు.


logo