మంగళవారం 26 మే 2020
Nalgonda - May 23, 2020 , 01:29:39

టీఆర్‌ఎస్‌ పాలనలో రైతే రాజు

టీఆర్‌ఎస్‌ పాలనలో రైతే రాజు

 మూస ధోరణి సాగుకు స్వస్తి పలుకాలి

 త్వరలో రైతులతో సాగు విధానంపై సమావేశాలు

కరోనా వ్యాక్సిన్‌ వచ్చే వరకు అప్రమత్తంగా ఉండాలి

విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి

పలు గ్రామాల్లో బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన

వ్యవసాయ రంగానికి 24గంటల ఉచిత కరెంట్‌, ఎరువులు, విత్తనాల్లో రాయితీలు, రైతుబంధుతో పంట పెట్టుబడి సాయం అందిస్తూ రైతు సంక్షేమమే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ సర్కారు అడుగులు వేస్తున్నదని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. వ్యవసాయాన్ని పండుగలా మార్చి లాభదాయక పంటలతో అన్నదాత ఇంట ఆనందం నింపాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమని పేర్కొన్నారు. మంత్రి శుక్రవారం ఎంపీ బడుగులతో కలిసి సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కరోనా మహమ్మారి వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భౌతిక దూరం, స్వీయనియంత్రణ తప్పకుండా పాటించాలని కోరారు.

-సూర్యాపేట రూరల్‌, ఆత్మకూర్‌.ఎస్‌ 

ఆత్మకూర్‌.ఎస్‌/సూర్యాపేటరూరల్‌/పెన్‌పహాడ్‌/ చివ్వెంల : వ్యవసాయాన్ని పండుగలా మార్చి రైతులకు అధిక లాభాలు వచ్చేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత్రిత పంటల విధానం అమలు చేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని భజనతండాలో రూ.కోటిన్నరతో, తెట్టెకుంటతండాలో రూ.2 కోట్ల 30లక్షలతో, గౌస్‌తండాలో రూ.కోటిన్నరతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసి మాట్లాడారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణుల సూచనలు, సలహాలతో సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ ఉన్న పంటలను సాగు చేసేలా తెలంగాణ రైతాంగాన్ని సంసిద్ధం చేస్తున్నారన్నారు. త్వరలోనే జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని రైతులకు దీనిపై రైతు బంధు సమితి ఆధ్వర్యంలో అవగాహన కల్పిస్తామని తెలిపారు. కరోనా వ్యాక్సిన్‌ వచ్చే వరకు ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే సూర్యాపేట మండలం బాలెంల ఆవాసం రేఖ్యానాయక్‌తండాలో రూ. 56లక్షలతో, పెన్‌పహాడ్‌ మండలం చిన్నగారకుంటతండాలో రూ.2కోట్లతో, చివ్వెంల మండలం పాచ్యనాయక్‌తండాలో చేపట్టిన బీటీ రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అంతకుముందు చివ్వెంలలో కొండ పద్మ, అక్కలదేవిగూడెంలోని కొంగర నాగలక్ష్మిలకు కల్యాణలక్ష్మి చెక్కులను మంత్రి అందజేశారు. చిన్నగారకుంటతండాలో ఇటీవల డోజర్‌ ప్రమాదంలో మృతి చెందిన మిర్యాలీ కుటుంబాన్ని, అలాగే దూపాడ్‌కు చెందిన సీఐ గోపగాని గుర్వయ్య తల్లి శాంతమ్మ అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని మంత్రి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ గుజ్జ దీపికాయుగంధర్‌రావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ వట్టె జానయ్యయాదవ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణ, ఎంపీపీలు మర్ల స్వర్ణలతాచంద్రారెడ్డి, బీరవోలు రవీందర్‌రెడ్డి, కుమారి బాబునాయక్‌, నెమ్మాది భిక్షం, జడ్పీటీసీలు జీడి భిక్షం, భూక్యా సంజీవనాయక్‌, అనితాఅంజయ్య, రైతు బంధు సమితి రాష్ట్ర సభ్యుడు గుడిపూడి వెంకటేశ్వర్‌రావు, వైస్‌ ఎంపీపీలు నేరెళ్ల వెంకన్న, జూలకంటి జీవన్‌రెడ్డి, రామసాని శ్రీనివాస్‌నాయుడు,  పీఏసీఎస్‌ చైర్మన్లు, రైతు బంధు సమితి కోఆర్డినేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


logo