గురువారం 09 జూలై 2020
Nalgonda - May 20, 2020 , 02:28:15

రయ్‌..రయ్‌

రయ్‌..రయ్‌

నల్లగొండ సిటీ : 58 రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులు మళ్లీ రోడ్డెక్కాయి. తెలంగాణ ప్రభుత్వం అనుమితివ్వడంతో ఉమ్మడి నల్లగొండలోని ఏడు డిపోల నుంచి మంగళవారం బస్సులు ప్రారంభమయ్యాయి. మాస్కులు ధరించిన ప్రయాణికులను మాత్రమే బస్సులోకి అనుమతించారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నారు. మొదటి రోజు కావడంతో ఆశించిన మేరకు ప్రయాణికులు రాకపోవడంతో కొన్ని మెయిన్‌ రూట్లకు మాత్రమే బస్సులను నడిపినట్లు అధికారులు తెలిపారు. 

నల్లగొండ జిల్లా నుంచి 150 బస్సులు..

నల్లగొండ జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 150 బస్సులు నడిచాయి. నల్లగొండ డిపో నుంచి 52, దేవరకొండ 42, నార్కట్‌పల్లి 20, మిర్యాలగూడ నుంచి 36 బస్సులు నడిపారు. జిల్లాలో 2,500 మంది ఉద్యోగులు, సిబ్బందికి 2,000 మంది హాజరయ్యారు. నాలుగు డిపోల పరిధిలో ప్రతి రోజు రూ.50 లక్షల ఆదాయం వస్తుండగా ప్రస్తుతం రద్దీ లేని కారణంగా సుమారు రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. 

మిర్యాలగూడ అర్బన్‌ : మిర్యాలగూడ డిపోలో తొలిరోజు 36 బస్సులను డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌ నాగశ్రీ అందుబాటులోకి తీసుకొచ్చారు. మిర్యాలగూడ డిపో నుంచి హయత్‌నగర్‌ వరకు ప్రతి అర్ధగంటకు ఒక బస్సు, దేవరకొండకు 5, వాడపల్లికి 3, నల్లగొండకు 5, కోదాడకు 5 బస్సులు నడుపుతున్నామని ఆమె తెలిపారు. 

దేవరకొండ : దేవరకొండ ఆర్టీసీ డిపో పరిధిలో 42 బస్సులను నడిపినట్లు డిపో మేనేజర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. హైదరాబాద్‌, నల్లగొండ, మిర్యాలగూడ, అచ్చంపేట, కల్వకుర్తి రూట్లలో బస్సులు తిప్పారు. మొదటి రోజు బస్సుల్లో 10 మందికి మించి ప్రయాణికులు కనబడలేదు. 

సూర్యాపేట జిల్లాలో నడిచిన 94 బస్సులు 

సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట జిల్లాలో 94 బస్సులను ప్రారంభించారు. సూర్యాపేట డిపోలో 113 బస్సులకు 59 బస్సులు, కోదాడ డిపోలో 90 బస్సులకు 35 బస్సులను తొలిరోజు నడిపించారు. గతంలో మాదిరిగానే జిల్లాలోని అన్ని రూట్లకు బస్సులను ప్రారంభించారు. మిర్యాలగూడ, కోదాడ, తుంగతుర్తి, తిరుమలగిరి, జనగాం, వరంగల్‌, నల్లగొండ, హైదరాబాద్‌కు బస్సులు నడుపుతున్నారు. సూర్యాపేట డిపోలో 459 మంది ఉద్యోగులకు 445 మంది, కోదాడ డిపోలో 215 ఉద్యోగులకు 210 మంది హాజరయ్యారు. డీఎం శివరామకృష్ణ, సీఐ అంజనేయులు ఆర్టీసీ సిబ్బందికి సూచనలు చేశారు. 

యాదగిరి గుట్ట డిపో నుంచి 30 బస్సులు

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట డిపోలో 110 బస్సులకు 30 ఆర్టీసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. డిపో పరిధిలో 430 మంది సిబ్బంది ఉండగా మొదటిరోజు 100 మంది విధుల్లోకి వచ్చారు. జిల్లాలోని మోత్కూరు, ఆత్మకూరు(ఎం), రాజాపేట, ఆలేరు, తిరుమలగిరితోపాటు నల్లగొండ, చేర్యాల, సికింద్రాబాద్‌, ఉప్పల్‌ ఎక్స్‌రోడ్డు వరకు బస్సులు నడిచాయి.


logo