బుధవారం 03 జూన్ 2020
Nalgonda - Apr 10, 2020 , 02:44:42

దాతల ఔదార్యం..

దాతల ఔదార్యం..

నిత్యావసర సరుకులు, మాస్కులు పంపిణీ చేసిన దాతలు, స్వచ్ఛంద సంస్థలు 

యాదగిరిగుట్ట, నమస్తేతెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు పడకుండా పలువురు దాతలు తమ ఔదార్యాన్ని చూపారు. ప్రజలంతా స్వీయనిర్బంధాన్ని పాటించారు. కూలీ పనులు చేసే వారికి, పారిశుధ్య కార్మికులకు అండగా నిలిచారు. ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలు, చౌటుప్పల్‌ డివిజన్‌ వ్యాప్తంగా గురువారం పలు గ్రామాల్లో పలువురు నిరుపేదలకు కూరగాయలు, నిత్యావసర వస్తువులు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేశారు. 

యాదగిరిగుట్ట మండలంలోని మల్లాపురం ఆటో కార్మికులు, గ్రామ పారిశుధ్య సిబ్బందికి టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు, సర్పంచ్‌ వెంకటయ్య నిత్యావసర సరుకులు, బియ్యాన్ని అందజేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో 100 మంది నిరుపేదలను అన్నదానం చేశామని ఆలయ ఈవో గీత తెలిపారు. లాక్‌డౌన్‌ ముగిసే వరకు అన్నదానం చేస్తామన్నారు. మల్లాపురం గ్రామంలో యాదగిరిగుట్ట పోలీసులు, చిందు కళాకారులు అవగాహన కల్పించారు. రాజాపేట మండలం సోమారం గ్రామానికి చెందిన పిలుట్ల చందు కళాబృందం కళాజాత నిర్వహించింది.  యాదగిరిగుట్ట పట్టణంలోని నివసిస్తున్న దొమ్మరి కులస్తులకు డీసీపీ నారాయణరెడ్డి ఒక్కో కుటుంబానికి 10 కిలోల బియ్యం పంపిణీ చేశారు. మొత్తం 50 కుటుంబాలకు 500 కేజీల బియ్యాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఏసీపీ కోట్ల నర్సింహారెడ్డి, సీఐ పాండురంగారెడ్డి, ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు. మాసాయిపేట గ్రామంలో పారిశుధ్య కార్మికులకు సర్పంచ్‌ వంటేరు సువర్ణ బియ్యం పంపిణీ చేశారు. 

రాజాపేట మండలం కేంద్రంలో వజ్రేందర్‌రావు 400 కుటుంబాలకు సబ్బులు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు అశోక్‌గౌడ్‌ కూరగాయలు అందజేశారు. రఘునాథపురంలో ఎడుగురు దాతలు 150 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 కిలోల బియ్యం, 3 కిలోల కూరగాయలు పంపిణీ చేశారు. చెక్‌పోస్టుల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులకు శ్రీనివాస్‌రెడ్డి భోజన వసతి కల్పించారు. రాజాపేట, బొందుగుల, రేణికుంట గ్రామాల్లో మదర్‌ డెయిరీ డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు బాలు ఫాగింగ్‌ మిషన్‌ను బహూకరించారు. 

తుర్కపల్లి మండల కేంద్రంలోని ఆటో కార్మికులకు బీర్ల ఫౌండేషన్‌ చైర్మన్‌ అయిలయ్య ఆధ్వర్యంలో కూరగాయలు, నిత్యావసర సరుకులను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అందజేశారు. తుర్కపల్లిలో చిందు కళాకారుల బృందం కరోనాపై అవగాహన కల్పించారు. వలస కూలీలకు గ్రామీణ వైద్యుడు కృష్ణ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర వస్తువులను ఎస్సై యాదగిరి అందజేశారు. వీరారెడ్డిపల్లి, దత్తాయిపల్లి తదితర గ్రామాల్లో సర్పంచులు వీధుల్లో హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు.

మోటకొండూర్‌ మండలంలోని కాటేపల్లి గ్రామంలో బీర్ల పౌండేషన్‌ ఆధ్వర్యంలో మాస్కులు, శానిటైజర్లను కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మదారుగౌడ్‌ పంపిణీ చేశారు. వర్టూరు గ్రామంలో పలువురు విలేకరులు ఇచ్చిన నిత్యావసర వస్తువులను టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు రాందాసుగౌడ్‌ అందజేశారు.

బొమ్మలరామారం మండల కేంద్రంలో బీర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అందజేశారు.  

ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంతోపాటు కొరటికల్‌, తుక్కాపూర్‌, పుల్లాయిగూడెం గ్రామాల్లో ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అందజేసిన సోడియం హైపోక్లోరైట్‌ను సర్పంచులు నగేశ్‌, రాజు, సత్తయ్యగౌడ్‌, గిరిజ, ఎంపీటీసీ కవిత పిచికారీ చేశారు. మండల కేంద్రంలో పారిశుధ్య కార్మికులకు రామలింగేశ్వరస్వామి ఆలయ కమిటీ చైర్మన్‌ దశరథ గౌడ్‌ మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మండలంలోని పోతిరెడ్డిపల్లిలో సర్పంచ్‌ మాధవి సొంత ఖర్చులతో కొనుగోలు చేసిన మాస్కులు, శానిటైజర్లను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశారు. బీజేపీ పార్లమెంటరీ కన్వీనర్‌ మురళీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు మండల కేంద్రంలో కూరగాయలు పంపిణీ చేశారు. 

ఆలేరు పట్టణం, తుర్కపల్లి మండలంలోని పల్లెపహాడ్‌ సర్పంచ్‌ మోహన్‌రెడ్డి అందజేసిన సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని ఆడిషనల్‌ కలెక్టర్‌ కీమ్యానాయక్‌ పిచికారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ను ప్రజలందరూ పాటించాలన్నారు కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ హన్మంతు, చైర్మన్‌ శంకరయ్య, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆలేరు మండలంలోని గొలనుకొండ గ్రామంలో బీర్ల ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిరుపేదలను నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. 

చౌటుప్పల్‌ డివిజన్‌లో..

చౌటుప్పల్‌, నమస్తేతెలంగాణ: చౌటుప్పల్‌ మున్సిపాలిటీ కేంద్రంలోని 16వ వార్డులోని నిరుపేదలకు కేఆర్‌ విజిటేబుల్‌ మర్చంట్‌ వారు కొడాలి దిలీప్‌కుమార్‌, నాగార్జున సమకూర్చిన నిత్యావసర సరుకులను  మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు  పంపిణీ చేశారు.  మున్సిపాలిటీ కేంద్రంలోని చేనేత సంఘం ఆవరణలో హైదరాబాద్‌కు చెందిన భావన మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 50 మంది చేనేత కార్మికులకు 10కేజీల బియ్యం, నిత్యావసర సామగ్రిని మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు పంపిణీ చేశారు.  మండలంలోని లక్కారం గ్రామానికి చెందిన మద్దె లక్ష్మారెడ్డి తన తోటలోని బత్తాయి  పండ్లను గ్రామ ప్రజలందరికీ ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ రాందుర్గారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ బత్తుల శ్రీశైలం పాల్గొన్నారు.

మోత్కూరు మండలం పాటిమట్లలో  ప్రముఖ పారిశ్రామికవేత్త రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి ప్రజలకు  కూరగాయలు, మాస్కులు ,పండ్లు , నిత్యావసరాలు పంపిణీ చేశారు. 

సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని పుట్టపాకలో దిశా ఫౌండేషన్‌ సహకారంతో సీపీఎం  ఆధ్వర్యంలో గ్రామస్తులకు రూ. 50 వేల విలువగల  నిత్యావసర సరుకులు, రూ.30 వేల విలువగల మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఏసీపీ సత్తయ్య హాజరై పంపిణీ చేశారు.  సీఐ శ్రీనివాస్‌, ఎస్సై నాగరాజు, సర్పంచు భాస్కర్‌, ఎంపీటీసీ మర్రి వసంత, ఉపసర్పంచు చంద్రశేఖర్‌  పాల్గొన్నారు.  మండల కేంద్రంలో హైదరాబాద్‌కు చెందిన నక్క వెంకటమ్మ, యాదగిరి యాదవ్‌ ఎడ్యుకేషనల్‌ స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ నక్క శ్రీనివాస్‌యాదవ్‌ ఆధ్వర్యంలో పోలీసులు, ఎంఆర్‌సీ సిబ్బందితోపాటు జర్నలిస్టులకు  నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు .స్థానిక పోలీస్‌స్టేషన్‌లో మజీద్‌ కమిటీ ఆధ్వర్యంలో పోలీసులు, వైద్యులు, జర్నలిస్టులకు అన్నదానం చేశారు.  కార్యక్రమంలో ఎంపీపీ ఉమాదేవి, మండల విద్యాధికారి నాగవర్ధన్‌రెడ్డి, ఎంపీటీసీ గాలయ్యయదవ్‌, ఉపాధ్యాయుడు నగేష్‌యాదవ్‌, కృష్ణయ్యయాదవ్‌, డాక్టర్‌ వెంకటేశం, జావేద్‌,  రహీంషరీఫ్‌ పాల్గొన్నారు.

రామన్నపేట మండల కేంద్రంతోపాటు వివిధ గ్రామాల్లో రేషన్‌ కార్డు లేని వారిని, వలస కార్మికులను తహసీల్దార్‌ గుర్తించి, దాతల సహకారంతో నిత్యావసర సరుకులను అందజేశారు. దాతల సహకారంతో నిత్యావసర సరుకులు, 12 కిలోల బియ్యాన్ని స్థానిక సర్పంచ్‌ శిరీష, ఎంపీటీసీలు రేహాన్‌, హర్షిణి అందజేశారు. మండల కేంద్రంలో ఎంపీటీసీలు హర్షిణి, సుధీర్‌బాబు, వార్డు సభ్యురాలు ప్రమీల నిత్యావసర వస్తువులు, కూరగాయలు పంపిణీ చేశారు. స్థానిక చెక్‌పోస్టు వద్ద పోలీసులకు శ్రీహిందూ కళాశాల డైరెక్టర్‌ భాస్కర్‌రావు అన్నదానం చేశారు. ఎంబీసీ మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్‌ 150 మాస్క్‌లు అందజేశారు.

భువనగిరి నియోజకవర్గంలో..

భువనగిరి, నమస్తే తెలంగాఆణ : భువనగిరి నియోజకవర్గంలోని భువనగిరి, బీబీనగర్‌, వలిగొండ, భూదాన్‌పోచంపల్లి మండలాల్లో దాతల సహకారంతో గురువారం అన్నదానం చేశారు. సత్యసాయి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో భువనగిరిలోని  డాల్ఫిన్‌ హోటల్‌ వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని భువనగిరి ఆర్డీవో భూపాల్‌రెడ్డి, 17వ వార్డు కౌన్సిలర్‌ చెన్న స్వాతిమహేశ్‌ ప్రారంభించారు. పట్టణంలోని రాయగిరిలోని సహృదయ అనాథ వృద్ధాశ్రమంలో  హోటల్‌ వివేరా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని  మున్సిపల్‌ చైర్మన్‌ ఆంజనేయులు, వైస్‌ చైర్మన్‌ చింతల కిష్టయ్య, ఏసీపీ భుజంగరావు, సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సైలు రాఘవేందర్‌గౌడ్‌, శంకర్‌  ప్రారంభించారు. వలిగొండ మండలం అక్కంపల్లిలో ఇటుక బట్టీల కార్మికులకు జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. బీబీనగర్‌ మండలం  గూడూరు టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన అన్నదానంలో పోలీసులు పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న 40 మంది పారిశుధ్య కార్మికులకు పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు రమేశ్‌ చీరలు, దుప్పట్లు అందజేశారు. పోచంపల్లి పట్టణం ఇందిరానగర్‌ కాలనీలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి శివకృష్ణ సుమారు 150 మందికి కూరగాయలతోపాటు నిత్యావసర సరుకులను అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ చక్రపాణి తదితరులు పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లి బీసీ కాలనీలోని సుమారు 200 కుటుంబాలకు టీఆర్‌ఎస్‌ నాయకుడు కిరణ్‌కుమార్‌ కూరగాయలు అందజేశారు.


logo