సోమవారం 25 మే 2020
Nalgonda - Mar 31, 2020 , 03:12:04

మొబైల్‌ రైతు బజార్ల ఏర్పాటు

మొబైల్‌ రైతు బజార్ల ఏర్పాటు

నల్లగొండ, నమస్తే తెలంగాణ : బత్తాయి, నిమ్మ రైతులు తమ పంటను అమ్ముకోవడానికి మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ తెలిపారు. సోమవారం ఆయన ఎస్పీ రంగనాథ్‌, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి రైతులు, వ్యాపారులు, కమీషన్‌ ఏజెంట్లతో సమావేశమయ్యారు. జిల్లాలో బత్తాయి 44వేల మెట్రిక్‌ టన్నులు, నిమ్మ మరో 52వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రానున్నట్లు తెలిపారు. మన పండ్లు మనమే తినాలన్న సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేసి పండ్ల విక్రయానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముందుగా నల్లగొండ, తర్వాత మిర్యాలగూడలోని ఈ పండ్ల విక్రయాలు చేపట్టేలా ఉద్యాన, మార్కెటింగ్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎస్పీ రంగనాథ్‌ మాట్లాడుతూ కూలీల రవాణాకు పాస్‌లు జారీ చేస్తామన్నారు. మన రాష్ట్రంలో అవసరాలు తీరిన తర్వాతే ఇతర రాష్ర్టాలకు ఎగుమతి చేయాలని ట్రేడర్లకు సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు వి.చంద్రశేఖర్‌, రాహుల్‌శర్మ, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఉద్యానశాఖ అధికారి సంగీత లక్ష్మి, మార్కెటింగ్‌ ఏడీ అలీం, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు రామచంద్రనాయక్‌ పాల్గొన్నారు. 

నల్లగొండలో 9 మొబైల్‌ రైతు బజార్లు... జిల్లా కేంద్రంలో బత్తాయి విక్రయానికి 9మొబైల్‌ రైతు బజార్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టన్ను రూ. 23వేలు ధర పలుకుతున్న తరుణంలో రిటైల్‌గా కిలో రూ.23కు విక్రయించాల్సిందిగా అధికారులు ట్రేడర్లకు సూచించారు. ఎన్జీ కళాశాల, వీటీకాలనీ, చర్లపల్లి బైపాస్‌, ప్రభుత్వ బాలికల, బాలుర జూనియర్‌ కళాశాలలు, సావర్కర్‌నగర్‌, సెయింట్‌ ఆల్ఫెన్స్‌ పాఠశాల, వైఎస్‌ఆర్‌ విగ్రహం, కలెక్టరేట్‌ ప్రాంతాల్లో విక్రయించనున్నారు. 

కొనుగోలు కేంద్రాల్లో వసతులు కల్పించాలి..

వరి ధాన్యం కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఆదేశించారు. సోమవారం ఉదయాదిత్యభవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 566 రెవెన్యూ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తూనిక యంత్రాలు, తేమ యంత్రాలు, గన్నీ బ్యాగుల లభ్యత, టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. రైతు బంధు మండలబాధ్యులు, ఏఓలు, ఏఈఓలు హార్వెస్టర్లను, స్పేర్స్‌ అందుబాటులో ఉండేలా షాపు యజమానులను సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు తరువాత రవాణాకు ఇబ్బందులు కలుగకుండా ప్లాన్‌ చేసుకోవాలని ఎస్పీ రంగనాథ్‌ సూచించారు. 

వలస కూలీలకు భోజనం ఏర్పాటు చేయాలి

జిల్లాలో వలస కూలీలు ఆకలితో ఇబ్బంది పడకుండా భోజనం, వసతి కల్పించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అధికారులకు సూచించారు. సోమవారం ఆర్డీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, తాసిల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇటుక బట్టీలు, మిల్లులు, ఇతర రంగాల యాజమాన్యాలు కూలీలకు రేషన్‌, వేతనం అందిస్తున్నారో లేదో పరిశీలించాలని, నిబంధనలు అతిక్రమిస్తే జాతీయ విపత్తు చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వలస కూలీల కోసం దాబాలు, హోటళ్లలో కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేసి టిఫిన్‌, రెండుసార్లు భోజనం ప్యాకెట్లు అందజేయాలని, ఫంక్షన్‌ హాళ్లను రిలీఫ్‌ సెంటర్లుగా ఏర్పాటు చేసి వసతి కల్పించాలన్నారు. ఎస్పీ రంగనాథ్‌ మాట్లాడుతూ కమ్యూనిటీ కిచెన్స్‌, రిలీఫ్‌ సెంటర్ల నిర్వహణకు అధికారులతో కలిసి పోలీసులు ఆహార ప్యాకెట్లు డెలివరీ చేసి సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.  


logo