బుధవారం 03 జూన్ 2020
Nalgonda - Mar 30, 2020 , 01:47:59

గడపదాటని జనం

గడపదాటని జనం

  • జిల్లా అంతటా ఏడోరోజు కొనసాగిన లాక్‌డౌన్‌
  • అత్యవసరాలకు మాత్రమే బయటకు వస్తున్న ప్రజలు
  • నిత్యావసరాలకు ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు
  • లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై పోలీసుల కఠిన చర్యలు
  • రాత్రివేళలో పూర్తి స్థాయిలో అమలవుతున్న కర్ఫ్యూ 

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: లాక్‌డౌన్‌ ఏడో రోజు సైతం జిల్లా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. వ్యవసాయ పనులు, అత్యవసరాలు తప్ప ఇతర పనులేవీ కొనసాగలేదు. నిత్యావసరాలు, అత్యవసరాలకు తప్ప ఆదివారం రోజు ప్రజలు ఎక్కడా రోడ్డెక్కలేదు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ సహా అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లోను సైతం పారిశుధ్య పనులు కొనసాగాయి. కరోనా వైరస్‌ వ్యాపించకుండా సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని జిల్లాలో పలు చోట్ల పిచికారీ చేశారు. అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు లాక్‌డౌన్‌ పర్యవేక్షిస్త్తూనే... నిత్యావసరాల, కూరగాయలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేపడుతున్నారు. మరో వైపు ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు మినహాయిస్తే ఆ తర్వాత జనం ఎక్కడా రోడ్ల వైపు రావడం లేదు. రాత్రి పూట పోలీసులు పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ ప్రబలకుండా ఇళ్లలో ఉండాలని ఎట్టి పరిస్థితులలో బయటకు రావద్దని ప్రభుత్వం చేస్తున్న విజ్ఞప్తికి ప్రజలు పూర్తి మద్దతుగా నిలుస్తున్నారు. 

జిల్లా అంతటా నిర్మానుష్యం...

లాక్‌డౌన్‌కు ప్రజల మద్దతు పూర్తి స్థాయిలో ఉండటంతో పాటు ఆదివారం అయినప్పటికీ ఉదయం నిత్యావసర సరుకులు తీసుకుని ఇంటికి వెళ్లినటువంటి ప్రజలు మళ్లీ రోడ్డెక్కలేదు. అద్దంకి నార్కట్‌పల్లి రహదారితో పాటు ఎన్‌హెచ్‌65 సైతం నిర్మానుష్యంగా మారాయి. ఎస్పీ రంగనాథ్‌ ఈ రెండు జాతీయ రహదారులపై పర్యటించి చెక్‌పోస్టులను తనిఖీ చేసి నిఘా విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. అదే విధంగా నందికొండలో ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, మిర్యాలగూడలో భాస్కర్‌రావు పర్యటించగా దేవరకొండలో ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, నల్లగొండలో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, నకిరేకల్‌లో చిరుమర్తి లింగయ్య హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పట్టణ వ్యాప్తంగా పిచికారీ చేయించారు. logo