శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 21, 2020 , 02:32:24

అప్రమత్తం..

అప్రమత్తం..

  • 12మంది విదేశీయులు హైదరాబాద్‌కు తరలింపు
  • విదేశాలకు వెళ్లొచ్చిన జిల్లావాసులు ఇంటికే పరిమితం
  • వైద్య, రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో 
  • మూడు ప్రత్యేక బృందాల ఏర్పాటు

సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు ముమ్మరం చేసింది. వైద్య, రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది. 12మంది వియత్నాం దేశీయులు జిల్లా కేంద్రంలో బస చేశారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి వారిని హైదరాబాద్‌ తరలించి పరీక్షలు చేయించారు. కరోనా లక్షణాలు లేవని ధ్రువీకరించిన అనంతరం ఐసోలేషన్‌ కేంద్రాల్లో పర్యవేక్షిస్తున్నారు. ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని జిల్లాకు వచ్చిన 64మందిని సైతం ఇండ్లకే పరిమితం చేశారు.

నీలగిరి : జిల్లాలో కరోనా వైరస్‌ నియంత్రణ చర్యలు ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వైద్య, రెవెన్యూ, పోలీస్‌ అధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తోంది. 12మంది వియత్నాం దేశీయులు జిల్లా కేంద్రంలో బస చేశారనే సమాచారంతో గురువారం అర్ధరాత్రి వారిని ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌ ఫీవర్‌ దవాఖానకు తరలించారు. కరోనా వ్యాధి లక్షణాలు లేనప్పటికీ ఐసోలేషన్‌ కేంద్రాల్లో ఉంచినట్లు సమాచారం. వారు బసచేసిన ప్రాంతాల్లో శానిటేషన్‌ చేపట్టిన అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేశారు. మరోవైపు ఇటీవల విదేశీ పర్యటన ముగించుకుని జిల్లాకు వచ్చిన 64మందిని ఇండ్లకే పరిమితం చేశారు.

మార్చి 4న ఢిల్లీ నుంచి రాక..

వియత్నాం పర్యాటకులు 10మంది ఇద్దరు చిన్నారులతో కలిసి మార్చి 4న ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయల్దేరారు. 9న నల్లగొండకు చేరుకున్నారు. వీరితోపాటు మరో ఇద్దరు మొత్తం 14 మంది జైలుఖానా సమీపంలో బసచేశారు. కరోనా బాధిత ఇండోనేషియా దేశస్తులు కరీంనగర్‌లో పర్యటించారనే సమాచారం సామాజిక మాధ్యమాల్లో తెలుసుకున్న ప్రజలు.. జైలుఖానా సమీపంలో కొత్తగా బసచేసిన వారిని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో డీఎంహెచ్‌ఓ, డీసీహెచ్‌ఎస్‌, డీఎస్పీ ఆధ్వర్యంలో బృందాలు అక్కడి వెళ్లి వారికి పరీక్షలు నిర్వహించారు. కరోనా లక్షణాలు లేనప్పటికీ ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్‌ తరలించారు. 

మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు...

జిల్లా నుండి విదేశాలకు వెళ్లోచ్చిన వారిని గుర్తించి వారిని వైద్యపరీక్షలు చేసేందుకు గాను జిల్లా యంత్రాంగం డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, రెవెన్యూ అధికారి, పోలీస్‌ ఉన్నతాధికారితో కలిపి మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ప్రతి డివిజన్‌కు ఒక బృందాన్ని కేటాయించారు. వీరు విదేశాలకు వెళ్లిన వారిని గుర్తించడం వారి ఇంటికి వెళ్లి అరోగ్య పరిస్ధితిని తెలుసుకోని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. వారిలో కరోనా లక్షణాలు ఉంటే వెంటనే గాంధీ దవాఖానకు తరలించేలా ఆదేశాలు జారీ చేశారు. వారిని 14 రోజులపాటు ఇంటి వద్దనే ఉంచి ఐసోలేషన్‌ కార్యక్రమాలు చేపడుతున్నారు. 

పట్టణంలో పూర్తిస్థాయిలో శానిటేషన్‌...

ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. 12రోజులపాటు విదేశీయులు తిరిగిన ప్రాంతాలను గుర్తించి శానిటేషన్‌ చేపట్టింది. అన్ని ప్రార్థన మందిరాలు, పదో తరగతి పరీక్షలు జరిగే కేంద్రాలు, జన సమూహ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి జరుగకుండా చర్యలు తీసుకుంది. మురుగు ప్రాంతాల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించారు. 

ఇప్పటికీ 64 మందికి ఐసోలేషన్‌...

జిల్లా నుంచి ఇటీవల విదేశాలకు వెళ్లొచ్చిన 64మందిని గుర్తించిన ప్రత్యేక బృందాలు వారికి పరీక్షలు నిర్వహిస్తున్నాయి. 10రోజులుగా 30మందికి వైద్యాధికారులు ఐసోలేషన్‌ నిర్వహిస్తుండగా, శుక్రవారం ఒకరోజే 13మందికి పరీక్షలు చేసి కరోనా లేదని ఇంటి వద్దే ఉంచి బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, కరోనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం, పోలీసులు చేపట్టిన కార్యక్రమాలకు సహకరించాలని ఎస్పీ ఏవీ రంగనాథ్‌ ఒక ప్రకటనలో కోరారు.

కరోనా నివారణకు సహకరించాలి

సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల పై ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కరోనా వ్యాప్తిచెందకుండా ప్రభుత్వం, పోలీసుల చేస్తున్న కృషికి సహకరించాలి. నల్లగొండ పట్టణంలోని జైలుఖానా సమీపంలో వియత్నాం దేశానికి చెందిన 12 మందిని అదుపులోకి తీసుకున్నాం. వారికి కరోనా లక్షణాలు లేకపోవడంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఫీవర్‌ దవాఖానకు తరలించాం. సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు. 

- ఏవీ.రంగనాథ్‌, ఎస్పీ, నల్గొండlogo