శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 21, 2020 , 02:28:09

కరోనాను కట్టడి చేద్ధాం..

కరోనాను కట్టడి చేద్ధాం..

 • ప్రయాణాలు, ఫంక్షన్లు రద్దు చేసుకున్న ప్రముఖులు
 • షేక్‌ హ్యాండ్లు బంద్‌.. ఆరు అడుగుల దూరం తప్పనిసరి
 • బయటి పనులన్నింటికి  ఇంట్లోంచి ఒక్కరు మాత్రమే.. 
 • పరిశుభ్రంగా మారిన తర్వాతే కుటుంబీకుల వద్దకు..
 • ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలంటున్న నిపుణులు

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ వ్యాపించకుండా ఆదిలోనే జాగ్రత్తలు చేపట్టడంలో జిల్లా వాసులు ముందున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా సామాన్య ప్రజలతోపాటు ప్రముఖులు సైతం తమ వ్యక్తిగతంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కలెక్టర్‌, ఎస్పీ,  ఎమ్మెల్యేలు, రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు.. ప్రతి ఒక్కరూ జన సమూహాలకు దూరంగా ఉంటున్నారు. ఫంక్షన్లకు అస్సలు హాజరుకావడం లేదు. తప్పనిసరి అయితే తప్ప 99శాతం ప్రయాణాలు పెట్టుకోవడం లేదు. కరచాలనం చేయడం మానేశారు. ఇతర వ్యక్తులకు దూరంగా ఉండే మాట్లాడుతున్నారు. తమ కుటుంబ సభ్యులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉద్యోగరీత్యా తప్పక బయటికి వచ్చినా ఇంటికి వెళ్లగానే కాళ్లు చేతులు కడుక్కోవడంతోపాటు బట్టలు మార్చుకున్న తర్వాతే ఇంట్లో వాళ్లను కలుస్తున్నరు. తాము మాత్రమే పాటించకుండా ప్రతి ఒక్కరూ తమకు తెలిసిన వాళ్లందరికీ ఈ విషయాలు చెప్పాలని ప్రముఖులు కోరుతున్నారు.

నీలగిరి/నల్లగొండ విద్యావిభాగం : జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా నియంత్రించేందుకు జిల్లా యంత్రాంగం తరపున పటిష్ట చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ తెలిపారు. శుక్రవారం ఆయన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, వెంకటేశ్వర ఫార్మసీ కళాశాల, ఎస్‌ఆర్‌టీఎస్‌లో ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాల, ఎంజీయూలో హాస్టల్‌ తరగతి గదులను ఆయన పరిశీలించారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలలో ఎన్ని గదులు ఉన్నాయి, ఎన్ని టాయిలెట్స్‌ ఉన్నాయి, ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారు, బిల్డింగ్‌ ప్లాన్‌ తదితర విషయాలను సంబంధిత అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ , కేంద్ర రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మార్గదర్శకత్వాన్ని అనుసరించి పట్టణానికి దూరంగా గాలి, వెలుతురు, ఇతర సౌకర్యాలు పరిశీలించి కరోనా క్వారంటైన్‌ కేంద్రం ఏర్పాటుకు వీలుగా అధికారులతో చర్చించారు. గురుకుల, యూనివర్సిటీ విద్యార్థులకు ఈ నెల 31వరకు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాకు విదేశాల నుంచి వచ్చిన వారి గురించి స్వచ్ఛందంగా ముందుకురావాలని కుటుంబసభ్యులు, ప్రజలు సమాచారం అందించి కరోనా నియంత్రణకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ పట్ల ఎవరు ఉదాసీనంగా ఉండరాదని, వ్యక్తిగతంగా పరిశుభ్రంగా సామాజిక దూరం పాటించాలన్నారు. ప్రజలు గుమికూడరాదని ఇప్పటికే ముందస్తు చర్యల్లో భాగంగా సామూహిక కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఉత్సవాలు అనుమతివ్వబడవన్నారు. విద్యాసంస్థలు, సినిమాహాళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, జిమ్స్‌, క్రీడామైదానాలు, పార్కులు, మ్యూజియంలు మూసివేసినట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిపై అధికారులు గట్టి నిఘా ఉంచాలని పోలీస్‌, రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సమన్వయంతో అన్నిచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లాలో కేంద్ర దవాఖానలో 20బెడ్లు, కామినేనిలో 60, సాగర్‌, దేవరకొండ, మిర్యాలగూడలో 10పడకల చొప్పున ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట డీఎంహెచ్‌ కొండల్‌రావు, సాంఘీక సంక్షేమశాఖ డీడీ రాజ్‌కుమార్‌, ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ దేవ్‌సింగ్‌, మైనార్టీ అధికారి వెంకటేశ్వర్లు, గురుకులాల కోఆర్డినేటర్‌ కుర్షిత్‌ పాల్గొన్నారు. 

కరోనా వైరస్‌ చేతులు, ముక్కు, కండ్లు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది.

80శాతం మందిలో సాధారణ ప్లూ, జ్వరం, ఒళ్లు నొప్పులు ఉండి వారం పదిహేను రోజుల్లో అన్నీ తగ్గిపోతాయి. 20శాతం మందిలోనే కొంచెం తీవ్రంగా ఉండొచ్చు. 

కరోనా ఎక్కువగా వృద్ధులు, బీపీ, షుగర్‌, క్యాన్సర్‌, గుండె, శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు, వ్యాధి నిరోధకత తక్కువ ఉన్నవారిపై ప్రభావం చూపిస్తుంది. యువతలో కూడా ఇన్‌ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. 

జ్వరంతో ఉన్నవారికి దూరంగా ఉండడంతో పాటు జ్వరంలా అనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. విదేశాల నుంచి వచ్చిన వారు దగ్గు, జలుబు, జ్వరంతో ఉంటే వారిని 14 రోజుల పాటు ప్రత్యేక గదిలో ఉంచడంతో పాటు వారిని కలవకపోవడం మంచిది. దగ్గు, జలుబు లాంటి లక్షణాలు అన్నీ కరోనా వైరస్‌కు సంబంధించినవి కావు. వాటిలో సాధారణ ఫ్లూలు కూడా ఉండచ్చు. సరైన మందులు వాడి విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. దగ్గు, తుమ్ములు వస్తుంటే వెంటనే ఖర్చీఫ్‌ అడ్డుపెట్టుకోవాలి. తుంపరలు ఎదుటివారిపై పడకుండా చూసుకోవాలి. 

 1. ముక్కు, నోరు, తలను చేతులతో తాకవద్దు. ఎక్కడికైనా బయటకు వెళ్లి వస్తే తప్పకుండా చేతులు కడుక్కోవాలి. శానిటైజర్లు వాడాలి. నీటితో శుభ్రం చేసుకునేటప్పుడు కనీసం 20సెకండ్ల పాటు చేతివేళ్లు, వేళ్ల సందులు, మోచేతి వరకు బాగా కడుక్కోవాలి. ఎవరినైనా కలిసేటప్పుడు షేక్‌హ్యాండ్‌ ఇవ్వకుండా నమస్కారంతో పలకరించడం మంచిది. 
 2. రోజూ సరిపడా నీటిని తాగాలి. పరిశుభ్ర ఆహారాన్ని తీసుకోవాలి. ఉడికీఉడకని ఆహారం, పచ్చి పదార్థాలు, పచ్చిపాలు, బయటి పదార్థాలకు వీలైనంత దూరంగా ఉండాలి. శీతల పానీయాలు, చల్లని నీరు, ఐస్‌ క్రీమ్‌లు తీసుకోవద్దు. చికెన్‌, మటన్‌, గుడ్డు వంటివి బాగా ఉడికించిన తర్వాతే తినాలి. 
 3. గృహిణులు ఇంట్లో ఎప్పుడూ పరిశుభ్ర వాతావరణం ఉండేలా చూసుకోవాలి. వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలి. ఎంగిలి పదార్థాలను తినకపోవడం మంచిది. 
 4. వీలైనంత మట్టుకు దూర ప్రయాణాలను మానుకోవడం మంచిది. రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు. ఉత్సవాలు, శుభకార్యాలను కొద్ది రోజుల పాటు వాయిదా వేసుకోవాలి. ఒకవేళ ముందే బుక్‌చేసుకున్న శుభకార్యాలకు ఎక్కువ మందిని పిలవకపోవడం ఉత్తమం. ఫంక్షన్లకు వెళ్లాల్సి వస్తే తగు జాగ్రత్తలు పాటించాలి. ముఖానికి మాస్కులు ధరించి వెళ్లాలి. 
 5. చాలామంది కరోనాపై ఏది నిజమో తెలుసుకోకుండానే మెసెజ్‌లు, వీడియోలు ఫార్వర్డ్‌ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై వెంటనే ఒక నిర్ణయానికి రావద్దు. 
 6. ఆఫీసులు, ఇతర ఉపాధి పనులు చేసే చోట ఉద్యోగులు తగు జాగ్రత్తలు పాటించాలి. వీలైనంత మట్టుకు ముఖానికి ఖర్చీఫ్‌ కట్టుకొని విధులకు హాజరుకావడం మచింది. విధుల సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే లోనికి వచ్చే ముందు చేతులను కడుక్కోవాలి. కొంత మంది ఒకే చోట విధులు నిర్వర్తించాల్సి వస్తే అక్కడి ప్రదేశాలు ఎప్పుటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఎవరికైనా జలుబు, దగ్గు లక్షణాలు ఉంటే ఇతరులకు దూరంగా ఉండాలి. 

రద్దీ ప్రాంతాలకు వద్దు

అసలు ఈ వైరస్‌ గాలి ద్వారా వచ్చేది కాదు. అయినప్పటికీ జన సందోహానికి దూరంగా ఉండాలని, రద్దీ ప్రాంతాలకు వెళ్లకపోవడమే అత్యుత్తమమని నిపుణులు సూచించారు. ఎందుకంటే గుంపుగా ఉన్న వారిలో ఎవరికైనా కరోనా వైరస్‌ ఉంటే, వారు దగ్గినా, తుమ్మినా.. ఆ వచ్చే తుంపర్లలో కరోనా వైరస్‌ ఉంటుందని, అది మనపై పడితేనే ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇతరులకు కనీసం 2 మీటర్ల దూరంలో ఉండాలని తెలుపుతున్నారు.

మాస్కులతో రక్షణ

మాస్కులను ధరించడం వల్ల వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చని పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు. పలుచని మాస్కులు కాకుండా మేలి రకమైన, కాస్త మందపాటివి ధరించాలని సూచిస్తున్నారు. మాస్కులు అందుబాటులో లేకుంటే కనీసం ఖర్చీఫ్‌, లేకుంటే చీర కొంగులనైనా ముఖానికి అడ్డంగా పెట్టుకుంటే మంచిదని తెలుపుతున్నారు. అదేవిధంగా శుభ్రమైన న్యాప్కిన్లు వినియోగించి, ముఖాన్ని తుడుచుకో వాలని, చేతులతో ఇతరులను తాకకపోవడమే మంచిదని, కరచాలనం, ఆలింగనం ఇవ్వకపోవడం ఉత్తమని, తుమ్ములు, దగ్గులు వస్తే చేయికాకుండా, న్యాప్కిన్లు, టిష్యూలు వాడాలని చెబుతున్నారు. ముక్కు, కండ్ల ద్వారానే ఇది వ్యాప్తి చెందే అ వకాశం ఎక్కువగా ఉన్నందున, వాటిని చేతుల ద్వారా నలపకపోవడమే మంచిదని సూచిస్తున్నారు. 

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

వైరస్‌ వేగంగా వ్యాపిస్తుంది. నోటి నుంచి వచ్చే తుంపర్లే దీని వాహకాలు. మనం వాడే తలుపులు, గొల్లాలపై ఈ వైరస్‌ 48 గంటలు, కొన్నిసార్లు ఐదారు రోజులు  కూడా బతికి ఉండవచ్చు. వాటిని తాకి ముక్కు, కండ్లు ముట్టుకున్న వైరస్‌ సోకుతుంది. ఈ వైరస్‌ గాలిలో మూడు గంటలు, రాతి పలకలపై 4,  పేపర్లు, ఆట్టలపై 24, ప్లాస్టిక్‌, స్టీలు సామగ్రిపై 3 రోజులు బతికే అవకాశం ఉంది. 

జిల్లాలో 110 పడకలతో ఐసోలేషన్‌ వార్డులు... 

వైరస్‌ ప్రజలను కలవరపెడుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. జిల్లా కేంద్రంతోపాటు నార్కట్‌పల్లి కామినేని, దేవరకొండ, మిర్యాలగూడ, నాగార్జునసాగర్‌ ఏరియా దవాఖానల్లో మొత్తం 110 పడకలతో ఐసోలేషన్‌ వార్డులను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసింది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో 20 పడకలతో ఐసోలేషన్‌ వారు,్డ పది పడకలతో ఐసీయూను అందుబాటులోకి తెచ్చారు. అలాగే అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రతిమ, చల్మెడ వైద్యశాలల్లో 50 చొప్పున పడకలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో పాటు అత్యవసర చికిత్స అందజేసేందుకు రాప్యిడ్‌ రెస్పాన్స్‌ బృందాలను రంగంలోకి దింపారు .       

ఇప్పటికీ 64 మందికి ఐసోలేషన్‌...

ఇటివల జిల్లా నుంచి విదేశాలకు వెళ్లి వచ్చిన వారు సుమారు 64 మంది ఉన్నట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. వారిలో ఇప్పటికే 21 మందికి ఐసోలేషన్‌ నిర్వహించగా వారికి ఏలాంటి లక్షణాలు లేకపోవడంతో అరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. గత 10 రోజులుగా 30 మందికి వైద్యాధికారులు ఐసోలేషన్‌ నిర్వహిస్తుండగా శుక్రవారం ఒకరోజే సుమారు 13 మంది విదేశాలకు వెళ్లివచ్చిన వారిని గుర్తించి ఇంటి వద్దే ఉంచి ఐసోలేషన్‌ నిర్వహిస్తూ బయటకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పిల్లలపై జాగ్రత్తలు

 1. పిల్లల చేతులను వీలైనప్పుడల్లా శానిటైజర్‌తో శుభ్రం చేయాలి. ఏసీలాంటి చల్లని ప్రదేశాలకు దూరంగా ఉంచాలి. చల్లని నీటిని తాగించవద్దు. గది, శరీర వాతావరణం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. 
 2. పిల్లలు అదేపనిగా కళ్లు, ముక్కు, నోటిని చేతులతో నలుసుకోకుండా చూడాలి. నోటిలో వేళ్లు పెట్టుకోవద్దని ఎప్పటికప్పుడు హెచ్చరించాలి. 
 3. బయటకు వెళ్లాల్సి వస్తే పిల్లల ముఖానికి పలుచని గుడ్డలాంటిది కట్టాలి. బయట ఆడుకుంటున్నా మాస్కులు, ఖర్చీఫ్‌లను ధరింపజేయాలి. ఎక్కువ మంది ఉన్న చోట ఉండకుండా చూసుకోవాలి. పెద్దలు కూడా బయటకు వెళ్లి వస్తే వెంటనే పిల్లలను తాకకుండా నీటితో చేతులు, కాళ్లు శుభ్రం చేసుకున్న తర్వాతే దగ్గరకు తీసుకోవాలి. 
 4. పిల్లలకు ఇచ్చే ఆహారంలో సీ విటమిన్‌ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి. వారి బట్టలను వీలైతే రోజుకు రెండు సార్లు మార్చి వేయడం మంచిది. వెంటవెంటనే ఉతికి ఆరబెట్టుకోవాలి.
 5. దగ్గు, తుమ్ములు, జలుబు లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలి.

వాడపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీస్‌ క్యాంపు

దామరచర్ల : కరోనా వైరస్‌ను నియంత్రిండంలో భాగంగా మండలంలోని వాడపల్లి సరిహద్దులోని చెక్‌పోస్టు వద్ద శుక్రవారం పోలీసులు క్యాంపు ఏర్పాటు చేశారు. తెలంగాణ-ఆంధ్రా రాష్ట్రాల సరిహద్దు కావడంతో ఆంధ్రా నుంచి వచ్చి వెళ్లే వాహనాలను తనిఖీ చేసి, ఇతర రాష్ర్టాల నుంచి, దేశాల నుంచి వచ్చే వారి వివరాలను సేకరిస్తున్నారు. అనుమానితులకు మెడికల్‌ చెకప్‌లు చేస్తున్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ రూరల్‌ సీఐ రమేష్‌బాబు, వాడపల్లి ఎస్‌ఐ నర్సింహరావు, ఏఎంవీఐ ఉషారాణి, పోలీసులు పాల్గొన్నారు.


logo