శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 20, 2020 , 04:09:09

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

పదో తరగతి పరీక్షలు ప్రారంభం

  • 62మంది విద్యార్థులు గైర్హాజరు 
  • కేంద్రాల్లో తనిఖీ చేసిన డీఈఓ 
  • మాస్కులతో హాజరైన విద్యార్థులు

నల్లగొండ విద్యావిభాగం : జిల్లావ్యాప్తంగా పదోతరగతి పరీక్షలు గురువారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ భయంతో అన్ని పరీక్షకేంద్రాల వద్ద విద్యార్థులు ప్రత్యేక మాస్కులతో హాజరయ్యారు. మొత్తం 96 పరీక్షకేంద్రాలు ఏర్పాటుచేయగా తొలిరోజు జరిగిన తెలుగు పేపర్‌-1 పరీక్షకు 20,571మంది విద్యార్థులకు 20,509మంది హాజరయ్యారు.  ఒక్క పర్యాయం ఫెయిలైన విద్యార్థులు 12మందికి 10మంది హాజరయ్యారు. పరీక్షకేంద్రాల వద్ద విద్యార్థులు తల్లిదండ్రులతో సందడి చేశారు. తొలిరోజుకావడంతో  దేవాలయాలకు వెళ్లి పూజలు చేశారు. పరీక్షకేంద్రానికి సమయానికి చేరుకోవాలని కొందరు పరుగులుతీశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మనోధైర్యం నింపి పరీక్ష కేంద్రంలోకి పంపించారు. కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతోపాటు 144సెక్షన్‌ అమలుచేశారు. సమీపంలో ఉన్న జిరాక్స్‌ సెంటర్లను మూసివేశారు. పరీక్షల ప్రత్యేక పరిశీలకులుగా ఉమ్మడి నల్లగొండజిల్లాకు విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ రోహిణి నియామకమైనప్పటికి తొలిరోజు ఆమె నల్లగొండ జిల్లాలో పర్యటించలేదు. 

పరీక్ష కేంద్రాలను తనిఖీచేసిన డీఈఓ భిక్షపతి..

నల్లగొండలోని డైట్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల, శ్రీచైతన్య స్కూల్‌, దోమలపల్లిలోని జడ్పీ స్కూల్‌, మునుగోడులోని సెయింట్‌ జోసెఫ్‌, గట్టుపల్‌లోని జడ్పీ స్కూల్‌ పరీక్ష కేంద్రాలను డీఈఓ బి.భిక్షపతి తనిఖీచేశారు. పరీక్షలను పటిష్టంగా నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. డీఈఓతోపాటు జిల్లావ్యాప్తంగా ఫ్లయింగ్‌ స్కాడ్స్‌ 28పరీక్ష కేంద్రాలను తనిఖీచేసినట్లు జిల్లా పరీక్ష  విభాగం అసిస్టెంట్‌ కమిషనర్‌ విజయభారతి తెలిపారు.

విద్యార్థుల ఇబ్బందులు..

విద్యార్థుల హాల్‌టికెట్ల నెంబర్లు ఏ రూమ్‌లో ఉన్నాయో చూసుకునేందుకు పరీక్ష కేంద్రాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలి. కాని నల్లగొండ డీవీకే రోడ్డులోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలతోపాటు పలు పాఠశాలల వద్ద చిన్నచిన్న కాగితాలపై నెంబర్లు వేసి గోడకు అంటించడంతో వాటిని చూసుకునేందుకు విద్యార్థులు ఇబ్బందిపడ్డారు.  

కరోనా మాస్కులతో విద్యార్థులు..

కరోనా వైరస్‌ నేపథ్యంలో దాదాపు అన్ని పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ప్రత్యేక మాస్కుల ధరించి కన్పించారు. అయితే విద్యార్థులు గుంపులు కాకుండా వెంటవెంటనే పరీక్ష హాళ్లలోకి ఆయా పరీక్షకేంద్రాల నిర్వాహకులు లోపలికి పంపించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సొంత వాహనాలపై పరీక్ష కేంద్రాలకు తీసుకొచ్చి పరీక్ష అనంతరం తీసుకెళ్లారు.

పోలీసుల ఆల్‌ది బెస్ట్‌..

నల్లగొండలోని వన్‌టౌన్‌, టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నిర్వహించిన పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు విద్యార్థులను స్వాగతించారు. ఆల్‌ది బెస్ట్‌ చెబుతూ ప్లకార్డులను చూపి శుభాకాంక్షలు తెలిపారు. అటు విధి నిర్వహణ, ఇటు సామాజిక సేవలో ఉన్న పోలీసులను ప్రజలు అభినందించారు.


logo