శనివారం 28 మార్చి 2020
Nalgonda - Mar 20, 2020 , 04:04:36

వీడనున్న అక్రమాల గుట్టు

వీడనున్న అక్రమాల గుట్టు

 • చందంపేటలో అటవీ భూములకు పట్టాలు
 • గతంలోనే పలువురు అధికారులపై వేటు
 • మరింత లోతుగా విచారణకు ప్రభుత్వం సిద్ధం
 • తాజాగా ఐదుగురు తాసిల్దార్లతో కమిటీ ఏర్పాటు
 • చందంపేట మండలంలో అటవీ భూముల అక్రమ పట్టాల 
 • వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధ
 • మైంది. గతంలోనే విచారణ నిర్వహించడంతో పెద్ద 
 • ఎత్తున అక్రమాలు వెలుగుచూశాయి. నలుగురు 
 • తాసిల్దార్లు, ఐదుగురు వీఆర్వోలు, జూనియర్‌ అసి
 • స్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ను సస్పెండ్‌ చేయ
 • డంతో పాటు వారిపై క్రిమినల్‌ కేసులు నమోద
 • య్యాయి. తాజాగా మరింత లోతుగా విచారణ 
 • జరిపి పూర్తిస్థాయిలో అక్రమాలను బట్టబయలు 
 • చేసేందుకు రంగం సిద్ధమైంది. దీంతో అర్హులకు 
 • సైతం న్యాయం జరిగే దిశగా అవసరమైన చర్యలు చేపట్టింది.

దేవరకొండ, నమస్తేతెలంగాణ/చందంపేట : నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో అక్రమ పట్టాల వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గతంలోనే ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది. తాజాగా మరింత లోతుగా విచారణ జరిపి పూర్తిస్థాయిలో అక్రమాలను బట్టబయలు చేసేందుకు సమాయత్తమైంది. గతంలో చేసిన రెవెన్యూ భూ ప్రక్షాళనలో కొంత మంది రైతులకు అన్యాయం జరగడంతో ఆ తప్పిదాలను సరిచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోంది. చందంపేట మండలంలో అటవీ, రెవిన్యూ భూములకు సంబంధించిన పట్టాల జారీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకోగా.. గతేడాది జిల్లా అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నమస్తే తెలంగాణ వరుస కథనాలను ప్రచురించింది. తేది.30.07.2019న ‘భలే మంచి చౌక బేరం’.. ఎకరా రూ.20వేలే శీర్షికన కథనాలు వెలువడ్డాయి. తేది.9.8.2019న ‘అడవిని అమ్మేశారు’ శీర్షికన మరో కథనం ప్రచురితమైంది. ఈ కథనాల ఆధారంగా ప్రభుత్వ యంత్రాంగం విచారణ చేపట్టింది. ముఖ్యంగా కంబాలపల్లి, పొగిళ్ల, చిత్రియాల, చందంపేట అచ్చంపేట పట్టి, రేకుల గడ్డ, రేకుల వలయం గ్రామాల పరిధిలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించిన అధికారులు సీరియస్‌గా తీసుకొని విచారణ నిర్వహించారు. అప్పటి కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌ పూర్తిస్థాయిలో విచారణకు ఆదేశించగా.. వివిధ మండలాలకు చెందిన తాసీల్దార్లు, ఆర్‌ఐలు, వీఆర్వోలతో ఆ ఆరు గ్రామాల్లో సమగ్రంగా విచారణ జరిపి అక్రమ  పట్టాల గుట్టును రట్టు చేశారు. ఇదే క్రమంలో అక్రమాలకు బాధ్యులుగా గుర్తించిన నలుగురు తాసీల్దార్లు, ఐదుగురు వీఆర్వోలు, జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ను సస్పెండ్‌ చేయడంతో పాటు వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. అప్పట్లో చేపట్టిన విచారణలో 6 గ్రామాల పరిధిలో 3,518 మంది రైతులకు చెందిన 13,959 ఎకరాలు అక్రమ పట్టాలని అధికారులు గుర్తించారు. అలాగే రైతు బంధు కింద ఆయా భూములకు చెందాల్సిన రూ.7కోట్ల చెక్కులను నిలిపివేయించారు.దాదాపు 96 మంది రైతులకు సంబంధించి రూ.4లక్షల రికవరీ కోసం నోటీసులు కూడా జారీ చేశారు. అయితే పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అక్రమాలు మరింతగా బయటపడే అవకాశం ఉందని గ్రహించిన ప్రభుత్వం మలివిడుత విచారణ జరుపుతోంది. 

ఐదుగురు తాసీల్దార్లతో కమిటీ..

ఆ ఆరు గ్రామాలలో వెలుగుజూసిన అక్రమాల నేపథ్యంలో పూర్తిస్థాయి విచారణ జరిపేందుకు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ ఐదుగురు తాసీల్దార్లతో కమిటీని ఏర్పాటు చేశారు. తాసీల్దార్‌ నేతృత్వంలో ఒక ఆర్‌ఐ, వీఆర్వోలతో కూడిన బృందం ఒక్కో గ్రామంలో విచారణ చేపట్టనుంది. ఈ సారి జరిపే విచారణలో జల్లెడ పట్టి పూర్తిస్థాయిలో అక్రమాలను నిగ్గు తేల్చనున్నారు. దేవరకొండ నియోజకవర్గంలోని గుర్రంపోడు, మర్రిగూడ, చింతపల్లి, చందంపేట, నేరెడుగొమ్ము మండలాలకు చెందిన తాసీల్దార్లతో ఇప్పటికే కమిటీ ఏర్పాటు కాగా.. ఆరు గ్రామాలకు సంబంధించిన రికార్డులను ఈ కమిటీ స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే రంగంలోని దిగిన కమిటీ రహస్యంగా రికార్డులను పరిశీలించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. గతంలో చేపట్టిన విచారణ సందర్బంగా వాస్తవిక భూములను కలిగిఉన్న రైతుల వివరాలు రికార్డుల నుంచి తొలగింపుకు గురయ్యాయి. సంబంధిత రైతులు ప్రభుత్వం అందిస్తున్న రైతు బంధుతోపాటు ఇతర ప్రభుత్వ పథకాలకు కూడా దూరమయ్యారు. దీనిపై బాధిత రైతుల నుంచి జిల్లా అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో మలివిడుత జరుపుతున్న విచారణలో ఆ రైతులకు న్యాయం చేసే దిశగా కమిటీ చర్యలు తీసుకోనుంది. 

పూర్తిస్థాయిలో అక్రమాలను గుర్తించేందుకే..

ఆర్డీఓగా బాధ్యతలు స్వీకరించి రెండు రోజులే అయ్యింది. గతంలో జరిగిన విషయాలు పూర్తిస్థాయిలో తెలియదు. అయితే పూర్తిస్థాయిలో అక్రమాలను గుర్తించేందుకే కలెక్టర్‌ కమిటీని వేశారు. కమిటీ ఇప్పటికే రికార్డులను స్వాధీనం చేసుకుంది. ఈ విచారణలో వాస్తవంగా భూములు కలిగిఉన్న రైతులకు న్యాయం జరుగుతుంది.

- వాసుచంద్ర, ఇన్‌చార్జి ఆర్డీఓ, దేవరకొండ


logo