సోమవారం 06 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 20, 2020 , 04:29:42

ఆపదలో బంధువులా..

ఆపదలో బంధువులా..

 • మరణించిన రైతు కుటుంబాలకు అండగా రైతు బీమా
 • ఇంటి పెద్ద లోటును ఆర్థిక భరోసాతో పూడుస్తున్న కేసీఆర్‌ ప్రభుత్వం
 • రైతు చనిపోయిన పది రోజుల్లోనే ఇంటికి రూ.5లక్షలు
 • ఆపద్బాంధవుడిలా ఆసరాగా నిలుస్తున్న సర్కారు సాయం
 • జిల్లాలో ఇప్పటికే 493మంది కుటుంబాలకు బీమా డబ్బులు 

కష్టకాలంలో నేనున్నానంటూ.. ఆపదలో ఆదుకుంటానంటూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక రైతు బీమా పథకం  అకాల మరణం పొందిన అన్నదాతల కుటుంబాలకు ఆసరాగా నిలుస్తోంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రైతు కుటుంబీకులకు బీమా ద్వారా కొండంత ధీమా కల్పిస్తోంది. పోయిన మనిషిని తిరిగి తేలేకున్నా.. తాను ఉండి ఉంటే చేయగలిగే పనిలో కొంతైనా చేసి పెడుతూ ఆ రైతు కుటుంబానికి ఆపదలో బంధువులా ఆదుకుంటోంది. 2018 పంద్రాగస్టున ప్రారంభమైన ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటికే 493రైతుల కుటుంబాలకు రూ.5లక్షల బీమా సాయం అందింది. మరో 131మందికి సైతం నేడో, రేపో సాయం అందనుంది. ఒక్క రూపాయి చెల్లించకున్నా.. ప్రభుత్వమే బీమా డబ్బులు చెల్లించి.. రక్షణ కల్పించడమే కాదు.. రైతు చనిపోయిన పది రోజుల్లోపే బీమా డబ్బులు నేరుగా ఇంటికి వచ్చేలా ఏర్పాట్లు చేపట్టి రైతుల నీరాజనాలు అందుకుంటోంది.

నల్లగొండ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ : అనుకోకుండా మరణించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బీమా కొండంత అండగా నిలుస్తోంది. ఆపద కాలంలో నేనున్నానంటూ ఆదుకునే బంధువులా సర్కారు నుంచి రూ.5లక్షల సాయం బీమా రూపంలో రైతు కుటుంబాలకు అందుతోంది. సమైక్య పాలనలో రైతులు మరణిస్తే రూ.75వేలు ప్రభుత్వ సాయంగా అందేది. అది కూడా వందల మంది మరణిస్తే ఆయా కారణాలను వడపోసి.. పదుల సంఖ్యలో మాత్రమే సాయం చేసేది. ఆ పదుల మంది సైతం సాయం అందుకోవడానికి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగడమే కాకుండా.. ఆమ్యామ్యాలు సైతం సమర్పించుకోవాల్సి వచ్చేది. ఈ పరిస్థితిని మార్చేందుకు పూనుకున్న పెద్ద రైతు సీఎం కేసీఆర్‌.. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పథకానికి శ్రీకారం చుట్టారు. ఒక్క రూపాయి కూడా రైతు చెల్లించాల్సిన అవసరం లేకుండా.. 18నుంచి 60ఏండ్ల వయసున్న ప్రతి రైతుకు రూ.5లక్షల జీవిత బీమా కల్పిస్తూ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించే పథకం ప్రారంభించారు. 2018ఆగస్టు నెలలో ఈ పథకాన్ని మొదలుపెట్టగా.. రెండోసారి గతేడాది ఆగస్టులో ఒక్కో రైతుకు జీఎస్టీతో కలుపుకొని రూ.3556ప్రీమియంను 

ప్రభుత్వమే చెల్లించింది.

 • 493కుటుంబాలకు రైతు బీమా సాయం...

2018ఆగస్టు నుంచి ఇప్పటి వరకు నల్లగొండ జిల్లాలో 493మంది రైతు కుటుంబాలకు రైతు బీమా పరిహారం అందింది. జిల్లాలో మొత్తం 4,54,126మంది రైతులు ఉండగా.. వారిలో వయసు అర్హత కలిగిన 2,23,976 మందికి ప్రభుత్వం బీమా చెల్లించింది. మొత్తం ఇప్పటి వరకు 624మంది రైతులు మరణించగా.. వారిలో 493మంది కుటుంబాలకు ఇప్పటికే సాయం అందింది. మిగిలిన 131మందికి సైతం బీమా డబ్బులు అతి తొందర్లోనే ఎల్‌ఐసీ నుంచి అందనున్నాయి. రైతు చనిపోయిన పది రోజుల్లోపే బీమా సొమ్ము చాలా మందికి చేరుతోంది. స్థానికంగా అందుబాటులో వ్యవసాయ విస్తరణాధికారుల (ఏఈఓ) ద్వారా ఎల్‌ఐసీకి దరఖాస్తు చేసుకుంటే.. సాధ్యమైనంత తొందర్లో ఎల్‌ఐసీ బీమా డబ్బులు చెల్లిస్తోంది. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారికి రైతు బీమా సాయం ఆపదలో ఆదుకుంటోంది. బాధను దిగమింగుకునేలా.. భవితకు భరోసా కల్పించేలా చేయూతనిస్తోంది.

అప్పులు తీర్చి.. బరువు దింపుకున్నా

 • రైతుబీమా కొండంత బాసటగా నిలిచింది
 • పెద్దన్నలాంటి కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా


‘నమస్తే’తో రైతుబీమా లబ్ధిదారు తండ నాగమ్మపెన్‌పహాడ్‌: తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్తాపం చెంది ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయాం. ఉండటానికి గూడు లేక.. కుదుర్చుకున్న బిడ్డ పెండ్లి ఆగిపోతుందనే బెంగతో పుట్టెడు దుఃఖంతో కుమిలిపోతున్న సమయంలో రైతుబీమా ఆసరాగా నిలిచింది. పెద్దన్న కేసీఆర్‌ అందించిన రైతుబీమాతో నిశ్చితార్థం చేసుకున్న అబ్బాయితోనే బిడ్డ పెండ్లి చేసి, ఉండేందుకు చిన్నపాటి ఇల్లు, తెచ్చిన అప్పులు తీర్చుకొని పిల్లలతో ధీమాగా ఉంటున్నానని తండ నాగమ్మ ‘నమస్తే’తో ధీమాగా చెప్పింది. 

నా పేరు తండ నాగమ్మ. మాది పెన్‌పహాడ్‌ గ్రామం. నా భర్త తండ వెంకన్న న్యుమోనియాతో బాధపడుతుండేవాడు. ఈ క్రమంలోనే తన బిడ్డ పావని నిశ్చితార్థం జరిగింది. మాకున్న 1.20ఎకరాల భూమిని సేద్యం చేసుకుంటూ కులవృత్తిని నమ్ముకొని కల్లు గీస్తుండేవాళ్లం. తెలంగాణ ప్రభుత్వం రాకముందు నుంచే వ్యవసాయ పెట్టుబడికి గ్రామంలో అప్పులు చేశాం. తెచ్చిన అప్పుకు వడ్డీ పుట్టలాగా పెరిగింది. నా భర్త జబ్బుకు చేసిన ఖర్చులు, తెచ్చిన అప్పులు పెరుగడంతో నిద్రలేమి రాత్రులు గడిపి మనస్తాపం చెందిన నా భర్త.. పొలం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటికి పెద్ద దిక్కును కోల్పోవడంతో చిన్న పిల్లలైన ఇద్దరు కొడుకులు, నిశ్చితార్థం జరిగిన బిడ్డ పెండ్లి ఆగిపోతుందని భావించి నేను మనోధైర్యం కోల్పోయాను. ఒకానొక దశలో కటుంబమంతా చనిపోవాలని నిర్ణయించుకున్నాం. ఈక్రమంలో గ్రామంలోని కులస్తులు ధైర్యం చెప్పి రైతుబీమాకు దరఖాస్తు చేయమన్నారు. దరఖాస్తు చేసిన నెలరోజుల్లోనే పెద్దన్న సీఎం కేసీఆర్‌ మా కుటుంబానికి రూ.5లక్షలు మంజూరు చేసి ఆదుకుండు. బిడ్డకు అనుకున్నంత కట్నం ఇచ్చి, చిన్నపాటి రేకుల ఇల్లు కట్టుకున్నా. చేసిన అప్పులు తీర్చుకున్నా. పిల్లలను చదివించుకుంటూ ప్రస్తుతం వారితో సంతోషంగా ఉంటున్నా. మా కుటుంబానికి మరో జీవితం అందించి వెలుగులు నింపిన సీఎం కేసీఆర్‌ ఫొటోకు ప్రతి రోజూ దండం పెట్టుకుంటున్నా. రైతుబీమాతో మా కుటుంబాన్ని ఆదుకున్న సీఎం కేసీఆర్‌ సార్‌కు ఎల్లకాలం రుణపడి ఉంటాం.  

తెలంగాణ సర్కారుకు రుణపడి ఉంటాం

 • రైతుబీమా లబ్ధిదారురాలు వల్లమల్ల లలిత

వేములపల్లి : నాపేరు వల్లమల్ల లలిత. మాది వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామం. మేము వ్యవసాయం, వ్యవసాయ కూలి చేస్తూ జీవనం గడిపేవాళ్లం. మాకు ప్రభాకర్‌, అనుఖ్‌ అనే ఇద్దరు కుమారులు. తడకమళ్ల గ్రామ శివారులో 30గుంటల వ్యవసాయ భూమి ఉంది. నా భర్త వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్‌ నడుపుతుండేవాడు. నేను కూలి చేస్తూ ఇద్దరి పిల్లలను చదివించుకుంటూ ఇంటి అవసరాలు వెళ్లదీసుకునేవాళ్లం. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో అప్పుల్లో కూరుకుపోయాం. దిగులుతో నా భర్త రామస్వామి జబ్బున పడ్డాడు. ఒకవైపు అప్పుల బాధలు, మరోవైపు అనారోగ్య సమస్యల దిగులుతో 2019 జూలైలో నా భర్త మరణించాడు. అంతకు ముందే తెలంగాణ ప్రభుత్వం రైతుబీమా పేరుతో ఎల్‌ఐసీ బాండ్‌ ఇచ్చారు. స్థానిక నాయకుల సహకారంతో ఎమ్మెల్యే భాస్కర్‌రావు చొరవతో ఆయన మరణించిన 15రోజుల్లోనే బీమా డబ్బులు రూ.5లక్షలు నాఖాతాలో జమ అయ్యాయి.  ఆ డబ్బులోంచి అప్పులు తీర్చగా మిగిలిన డబ్బుతో రెండు పాడి బర్రెలను కొనుగోలు చేసి పాల విక్రయంతో స్వయం ఉపాధి పొందుతూ జీవనం సాగిస్తున్నాం. సీఎం కేసీఆర్‌ సార్‌ రైతుబీమా పథకం ప్రవేశపెట్టకుంటే మాకున్న 30గుంటల భూమి అమ్మినా అప్పులు తీరేవి కావు. కేసీఆర్‌ సారు రైతు కుటుంబాల పట్ల పెద్ద కొడుకై కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయిన కుటుంబాల్లో వెలుగులు నింపుతుండు. నేను, నా ఇద్దరు కొడుకులు బతికున్నంత కాలం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం. 

కేసీఆర్‌ సార్‌ రుణం తీర్చుకోలేనిది

 • ఆపదలో ఆదుకున్న దేవుడు ముఖ్యమంత్రి 
 • రైతుబీమా డబ్బుతో అప్పులు తీర్చిన, ఆడపిల్ల పెళ్లికి కొన్ని దాచిన

చిట్యాల: రైతుబీమాతో మా లాంటి పేద రైతులను ఆదుకున్న సీఎం కేసీఆర్‌ సార్‌ రుణం తీర్చుకోలేనిది. ఆపదలో దేవుడిలా ఆదుకున్నాడు. నా భర్త పేరున వచ్చిన రూ.5లక్షల బీమా సొమ్ముతో అప్పులు తీర్చుకున్నా. ఆడపిల్ల పెళ్లికి కొన్ని పైసలు దాచుకున్నా. అమ్మానాన్న, అత్తామామ లేని నాకు ఈ పైసలు కొండంత ధైర్యానిచ్చాయి. రైతుబీమా డబ్బుతో తన సమస్యలన్నీ తీరాయని, అరెకరం భూమి కూడా సరిగా లేని నా భర్తను రైతుగా గుర్తించి ముఖ్యమంత్రి ఆదుకున్నాడని బోడ లక్ష్మమ్మ ‘నమస్తే’కు తన మనోగతాన్ని తెలిపింది. మండలంలోని గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన బోడ ఎల్లయ్య 5నెలల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. బోడ ఎల్లయ్యది పేద కుటుంబం. మాటలు రాని ఎల్లయ్య తనకున్న కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూనే కూలి చేసుకొని జీవించేవాడు. అతనికి భార్య లక్ష్మమ్మ, ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఎల్లయ్య బతికుండగానే అప్పులు చేసి ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడు. ఎల్లయ్య అనారోగ్యంతో మరణించడంతో ఆయన కుటుంబానికి తీరని కష్టాలు వచ్చాయి. ఎల్లయ్య మరణించిన నెలకే రైతుబీమా కింద లక్ష్మమ్మకు రూ. 5లక్షలు మంజూరయ్యాయి. దీంతో లక్ష్మమ్మకు కొండంత ధైర్యం వచ్చింది. వచ్చిన డబ్బుతో ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ల సమయంలో చేసిన అప్పులను తీర్చడంతోపాటు మరో అమ్మాయి పెళ్లి కోసం కొన్ని డబ్బులను బ్యాంకులో డిపాజిట్‌ చేసినట్లు లక్ష్మమ్మ తెలిపింది. రూ.5లక్షలు అందజేసి ఆదుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపింది. 

దేవుడిలా ఆదుకున్న సీఎం కేసీఆర్‌: యల్మకంటి రేణుక

నాగారం : నా పేరు యల్మకంటి రేణుక. మాది వర్ధమానుకోట గ్రామం. మాకున్న మూడెకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవించేవాళ్లం. ఈక్రమంలో మా కుటుంబ పెద్దదిక్కు, నా భర్త యల్మకంటి యల్లయ్య అనారోగ్యంతో చనిపోయాడు. మాకు ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె వివాహానికి అప్పులు చేశాను. ఇంటి పెద్దదిక్కును కోల్పోవడంతో రోడ్డును పడాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితిలో రైతుబీమా మా కుటుంబాన్ని ఎంతగానో ఆదుకుంది. వ్యవసాయంతోపాటు కూలి చేసుకొని జీవితాన్ని నెట్టుకొస్తున్న మా కుటుంబానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన రైతుబీమా కింద రూ.5లక్షలు అందజేశారు. ఈ డబ్బుతో అప్పులు తీర్చాను. మిగతా డబ్బులతో కుటుంబ అవసరాలతోపాటు  ఇద్దరు పిల్లలను చదివిస్తున్నాను. రూ.5లక్షలు అందజేసి మాకుటుంబాన్ని దేవుడిలా ఆదుకున్న   సీఎం కేసీఆర్‌ సార్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం.  


logo