సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Mar 17, 2020 , 03:27:12

సొంతింటి కల సాకారం దిశగా..

సొంతింటి కల సాకారం దిశగా..

నిరుపేదల సొంతింటి కల సాకారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఇప్పటికే డబుల్‌బెడ్రూం కాలనీల నిర్మాణం చేపట్టిన సర్కారు.. స్థలం ఉన్నవారు సైతం ఇల్లు నిర్మించుకొనేలా ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు తాజా బడ్జెట్‌లో పెద్ద మొత్తంలో కేటాయింపులు చేయగా.. అతి త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నట్లు సమాచారం. తొలిదశలో రాష్ట్ర వ్యాప్తంగా లక్ష వ్యక్తిగత ఇండ్లకు శ్రీకారం చుట్టగా.. జిల్లాలో నియోజకవర్గానికి వెయ్యిచొప్పున ఆరువేల ఇండ్లు మంజూరుకానున్నాయి. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5లక్షలు విడుతల వారీగా అందజేయడమా..? లేదంటే లబ్ధిదారుల స్థలంలో ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వడమా..? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో వేగం పెరిగింది. అంతర్గత (ఇన్‌ఫ్రా) పనులు పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకు అందజేయనున్నారు.

  • బడ్జెట్‌లో పెద్దమొత్తంలో కేటాయింపులు
  • స్థలం ఉన్న వారికి రూ.5లక్షల ఆర్థిక సాయం
  • తొలి దశలో జిల్లాకు ఆరు వేల ఇండ్లు మంజూరు?
  • అతి త్వరలో మార్గదర్శకాల రూపకల్పన
  • డబుల్‌ బెడ్రూం ఇండ్ల నిర్మాణం మరింత వేగం..

నల్లగొండ, నమస్తేతెలంగాణ : పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబుల్‌ బెడ్‌రూం నిర్మాణం చేపట్టింది. ప్రజల కోరిక మేరకు సొంత జాగ ఉన్నవారికి సైతం ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయానికి సిద్ధమైంది. రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించిన సర్కారుహామీ అమలు దిశగా అడుగులు వేస్తూ బడ్జెట్‌లో నిధులు కేటాయించింది. పట్టణాలు, గ్రామాల్లో సభలు నిర్వహించి ప్రజాప్రతినిధులు, అధికారుల సమక్షంలో అర్హులను ఎంపిక చేయనున్నారు. ఇదిలాఉండగా జిల్లా వ్యాప్తంగా డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం పూర్తయిన ప్రాంతాల్లో అంతర్గత(ఇన్‌ఫ్రా) పనులు సైతం పూర్తి చేసి త్వరలో లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు చేపడుతోంది. 

నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లు..!

రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో లక్ష ఇండ్లను ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్‌ మినహా ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి ఇండ్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో సొంత జాగ కలిగిన లబ్ధిదారులు ఇల్లు నిర్మించుకోవచ్చు. జిల్లాలో నల్లగొండ, దేవరకొండ, మునుగోడు,నకిరేకల్‌,నాగార్జునసాగర్‌, మిర్యాలగూడ నియోజకవర్గాలకు వేయిచొప్పున ఇండ్లు మంజూరుకానున్న నేపథ్యంలో రిజర్వేషన్‌ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు సమాచారం. మున్సిపాలిటీల్లో ఎస్సీలకు16శాతం,ఎస్టీలకు 7శాతం, మైనార్టీలకు 12శాతం రిజర్వేషన్‌ ఇవ్వనుండగా మిగిలిన 65శాతం బీసీ, ఇతర వర్గాలకు వర్తింపజేయనున్నారు. గ్రామీణప్రాంతాల్లో 50శాతం ఎస్సీ, ఎస్టీ, 7శాతం మైనార్టీ వర్గాలకు ఇవ్వనుండగా, మిగిలిన 43శాతం బీసీ, ఇతరులకు ఎంపిక చేయనున్నారు. 

డబుల్‌ బెడ్రూం కాలనీల్లో ఇన్‌ఫ్రాకు ఏర్పాట్లు.. 

జిల్లాలో డబుల్‌బెడ్రూం ఇండ్ల పనులు ప్రగతి పథంలో కొనసాగుతున్నాయి. నిర్మాణం పూర్తయిన కాలనీల్లో డ్రెయినేజీ, వీధిలైట్లు, తాగునీటి సౌకర్యం, రోడ్ల నిర్మాణం తదితర అంతర్గత పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రజారోగ్యశాఖ ద్వారా నిధుల కేటాయింపునకు కలెక్టర్‌ ఇటీవల ఎమ్మెల్యేలతో సమావేశమై చర్చించారు. 

సొంత జాగ ఉంటే ఆర్థిక సాయం.. 

జాగ ఉన్నవాళ్లు సైతం సొంతంగా ఇల్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందజేయనుంది. ఈ పథకం కింద బడ్జెట్‌లో నిధులు కేటాయించగా త్వరలో విధి విధానాలు రావాల్సి ఉంది. డబుల్‌బెడ్రూం కాలనీల్లో అంతర్గత పనులు పూర్తిచేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. 

- రాజ్‌కుమార్‌, హౌజింగ్‌ పీడీ


logo