శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 17, 2020 , 03:20:04

ఆందోళన వద్దు..

ఆందోళన వద్దు..

కరోనా వైరస్‌ వ్యాప్తిపై ప్రజలు ఆందోళనకు గురికావద్దని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. వైరస్‌ నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. విపత్కర పరిస్థితుల్ని సైతం ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నదని పేర్కొన్నారు. వైద్యాధికారులతో కలిసి సోమవారం జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌, ఐసీయూ వార్డులను ఆయన పరిశీలించారు.

  • ‘కరోనా’ నియంత్రణకు సర్కారు పకడ్బందీ చర్యలు

నీలగిరి: కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్ర దవాఖానలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్‌, ఐసీయూ వార్డులను ఆయన తనిఖీ చేశారు. ఆయా వార్డులలో ఏర్పాటు చేసిన పరికరాలు, బెడ్‌షీట్ల నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. దవాఖాన సూపరింటెండెంట్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా సీఎం కేసీఆర్‌ ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని దవాఖానల్లో ఐసోలేషన్‌ వార్డులు, అత్యవసర విభాగాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మన రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందేందుకు అవకాశం లేదని, ఒక వేళ అలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కునేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కావద్దని, ఏ మాత్రం అనుమానం ఉన్నా వెంటనే స్థానిక దవాఖానల్లో పరీక్ష చేయించుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ కొండల్‌రావు మాట్లాడుతూ జిల్లాలోని వైద్య సిబ్బందికి సెలవులు మంజూరు చేయలేదని, పారా మెడికల్‌ సిబ్బంది, డాక్టర్లు, వైద్య సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డీసీహెచ్‌ఎస్‌ మాతృ నాయక్‌ మాట్లాడుతూ కరోనా అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నందున జిల్లాలో కూడా అందుకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. దవాఖాన సూపరింటెండెంట్‌ నర్సింహ మాట్లాడుతూ దవాఖానలో ఐసీయూ, ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసి సిబ్బందిని సైతం అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. అనుమానితులంటే వెంటనే దవాఖానలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్లు పుల్లారావు, ప్రోగ్రాం ఆఫీసర్‌, ఉమా మహేశ్వరి, సిబ్బంది పాల్గొన్నారు.


logo