గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 10, 2020 , 01:00:57

ఒలింగా.. ఓలింగా..

ఒలింగా.. ఓలింగా..

నిడమనూరు : చేతిలో కటార్లు చేతబూని, గజ్జెల లాగులు ధరించిన యాదవుల సంప్రదాయ నృత్యాలు, శివసత్తుల పూనకాల నడుమ లింగనామ స్మరణతో మండల పరిధిలోని లింగమంతులస్వామి గట్టు మార్మోగింది. లింగమంతులస్వామి ఉత్సవాల్లో భాగంగా మూడోరోజైన సోమవారం తెల్లవారుజామున యాదవులు సంప్రదాయబద్దంగా నృత్యాలు, డప్పు చప్పుళ్ల నడుమ యలమంచమ్మకు బోనాలు సమర్పించారు.  లింగమంతుల స్వామి, మాణిక్యాలదేవి కల్యాణోత్సవాన్ని యాదవ అర్చకులు సంప్రదాయ రీతిలో ఘనంగా జరిపించారు. కల్యాణోత్సవాన్ని తిలకించేందుకుజిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చారు. దీంతో గట్టు జనసంద్రంగా మారింది. గట్టుపైన యలమంచమ్మకు యాటలను సమర్పించడంతో గట్టు ఆసాంతం రక్తంతో తడిసిపోయింది. సుమారు 30వేల మంది స్వామివారిని దర్శించుకున్నారు. నిడమనూరు ఎంపీపీ బొల్లం జయమ్మ, ఎమ్మెల్యే నర్సింహయ్య తనయుడు నోముల భగత్‌యాదవ్‌, నిడమనూరు వ్యవసాయ మార్కెట్‌చైర్మన్‌ కామర్ల జానయ్య స్వామివారిని దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. శ్రీకృష్ణ వ్యాయామ కళాశాల ఆధ్వర్యంలో 30వేల మంది భక్తులకు పులిహోర పంపిణీ చేశారు.

ట్రాఫిక్‌ రద్దీ..

లింగమంతుల గట్టు పరిసరాల్లో ఎటుచూసినా ట్రాఫిక్‌ రద్దీ కనిపించింది. భక్తులు వంటలు చేసేందుకు టెంట్లు ఏర్పాటు చేసుకోవడంతో సుమారు 2కిలోమీటర్ల మేర గట్టుపై నుంచి ఎటుచూసినా టెంట్లు దర్శనమిచ్చాయి. లింగమంతులస్వామి తమను చల్లగా చూడాలంటూ వేడుకుంటూ యాటలు సమర్పించిన భక్తులు పెద్దఎత్తున సామూహిక విందు భోజనాలు ఏర్పాటుచేశారు.  పెద్దఎత్తున భక్తులు తరలిరావడంతో సుమారు రెండుగంటల పాటు ట్రాఫిక్‌ స్తంభించింది. చిన్నా, పెద్దా తేడా లేకుండా గట్టు ఆవరణలో ఏర్పాటు చేసిన దుకాణాల్లో దుస్తులు, ఆట వస్తువులు, తినుబండారాలు, పళ్ల రసాలు, మిఠాయిలు కొనుగోలు చేస్తూ భక్తులు సందడి చేశారు. హాలియా సీఐ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. 

తాగునీరు లేక ఇబ్బందులు..

ఉత్సవాలకు హాజరయ్యే భక్తుల సౌకర్యార్ధం వసతుల కల్పనలో ఆలయ కమిటీ చైర్మన్‌ మసిసముక్కు లక్ష్మయ్యయాదవ్‌ విఫలమయ్యారు. మండు టెండలో గట్టు వద్దకు స్వామి దర్శనార్ధం వచ్చిన భక్తులు తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అదేవిధంగా కొబ్బరికాయల విక్రయ హక్కులు పొందిన గుత్తేదారు కొబ్బరికాయను రూ.50లకు విక్రయించడంతో భక్తులకు పట్టపగలే చుక్కలు కనిపించాయి.  

స్వామిని దర్శించుకున్న ఎంపీ బడుగుల

లింగమంతుల స్వామిని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌ దర్శించుకున్నారు. పార్టీ శ్రేణులతో కలిసి గట్టు వద్దకు చేరుకున్న ఆయన మెట్ల మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. అనుచరులతో కలిసి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల ఆరాధ్య దైవమైన లింగమంతులస్వామి కళౠ్యణోత్సవం ఆధ్యాత్మికతకు, సంప్రదాయానికి నెలవన్నారు. అత్యంత చారిత్మ్రాత్మక లింగమంతుల స్వామి గట్టు అభివృద్ధికి దృష్టి సారిస్తామన్నారు. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఆలయాల పునరుద్ధరణకు చర్యలు చేపడుతుందన్నారు. అనంతరం సమీప బంధువు, టీఆర్‌ఎస్‌ నాయకుడు మన్నెం రంజిత్‌యాదవ్‌ ఏర్పాటు చేసిన విందు భోజనానికి హాజరయ్యారు. ఆయనను జిల్లా పరిషత్‌ వైస్‌చైర్మన్‌ ఇరిగి పెద్దులు, డీసీసీబీ డైరెక్టర్‌ విరిగినేని అంజయ్య, మన్నెం రంజిత్‌యాదవ్‌, బొల్లం రవియాదవ్‌, మాజీ ఎంపీటీసీ మన్నెం వెంకన్నయాదవ్‌, సర్పంచ్‌ అలుగుబెల్లి మమతకోటిరెడ్డిలు శాలువాతో సత్కరించారు.


logo
>>>>>>