శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 09, 2020 , 01:09:20

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

మహిళలు అన్నిరంగాల్లో రాణించాలి

నల్లగొండ, నమస్తే తెలంగాణ: మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తేనే అందరికీ స్ఫూర్తినిచ్చినట్లవుతుందని జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. నల్లగొండలోని టీటీడీసీలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం మహిళలను దృష్టిలో ఉంచుకుని నిధులు ఇస్తున్నందున సద్వినియోగం చేసుకుని సాధికారత దిశగా ముందుకుసాగాలని సూచించారు. స్త్రీ నిధి డబ్బులు వృథా చేయకుండా వాటిని సద్వినియోగం చేసుకున్నప్పుడు, కుటుంబం అన్నిరకాలుగా బాగుపడుతుందన్నారు. ప్రధానంగా స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం అధిక నిధులు ఇచ్చి మహిళల ఆర్ధిక స్వావలంబన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డితో కలిసి రూ. 136.29 కోట్లకు సంబంధించిన స్త్రీ నిధి చెక్కులను అందజేశారు. అదేవిధంగా స్త్రీ నిధిలో ప్రతిభ కనబర్చిన మహిళా సంఘాలకు అవార్డులతోపాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఇక ఉద్యోగుల విషయంలోను ప్రతిభ కనబర్చినవారికి అవార్డులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా మండల, గ్రామ సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.


logo