సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Mar 08, 2020 , 01:49:35

వసంతోత్సవం

వసంతోత్సవం

చండూరు, నమస్తే తెలంగాణ/ నల్లగొండ కల్చరల్‌ /నేరేడుచర్ల : హోలీ పండుగను కులమతాలకతీతంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. హోలీని రంగుల పండుగ లేక కాముడి పండుగ అంటారు. కొంత మంది గిరిజనులు ఈ పండగ సందర్భంగా వారం రోజుల ముందు  నుంచి దుకాణాలు, తెలిసిన వారి ఇండ్ల వద్దకు వెళ్లి డబ్బులు అడుగుతుంటారు. ఈ విధంగా వచ్చిన డబ్బలను అందరు పంచుకొని హోలీ రోజు సంబురాలు జరుపుకుంటారు. మనదేశంలోనే కాక బంగ్లాదేశ్‌, నేపాల్‌, కౌలాలంపూర్‌ తదితర ప్రాంతాల్లో ఈ వేడుకలు  ఘనంగా జరుపుకుంటారు. 


హోలీ చరిత్ర 

హోలీ పండుగ ద్వాపర యుగంలో జరుపుకున్నట్లు ఆధారాలున్నాయి. కృష్ణుడు నల్లగా ఉన్నాడని, రాధ తనకంటే తెల్లగా ఉందని తల్లి యశోద దగ్గర చెప్తాడు. అప్పుడు తల్లి యశోద రాధకు రంగులు పూయమని కృష్ణుడితో చెబుతోంది. తల్లి సలహా మేరకు కృష్ణుడు రాధ మీద రంగులు గుప్పిస్తాడు. దానికి ప్రతీకగా రాధ కూడా కృష్ణుడిపై వసంతం చల్లుతుంది. అప్పటి నుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమవుతుందని అదే హోలీ పండుగగా జరుపుకుంటున్నట్లు పెద్దలు చెబుతుంటారు. 


ఇది ఒక కథ. 

రాక్షసులకు రారాజైన హిరణ్యకశ్యపుడు చాలాకాలం తపస్సు చేసి పగలు, రాత్రి ఇంట్లో, బయట, భూమిపైన, ఆకాశంలో, జంతువులు, అస్త్రశస్ర్తాల వల్ల చావులేకుండా బ్రహ్మ నుంచి వరం పొందుతాడు. ఆ గర్వంతో దేవుడితో పాటు తనను కూడా పూజించాలని రుషులు, మునులు, ప్రజలను హింసిస్తుంటాడు. భగవత్‌ అనుగ్రహంతో జన్మించిన హిరణ్యకశ్యపుడి పుత్రుడు ప్రహ్లాదుడు విష్ణుమూర్తిని పూజిస్తుంటాడు. ఇది నచ్చని హిరణ్యకశ్యపుడు విష్ణుభక్తి మానాలని ప్రహ్లాదుడిని పదేపదే హెచ్చరిస్తాడు. ప్రహ్లాదుడు వినకపోవడంతో ఆగ్రహించి సోదరి హోలికతో పాటు చితిలో కూర్చోవాలని ఆదేశిస్తాడు. హోలికకు మంటల సెగ తగలకుండా శాలువా కప్పుతారు. మంటలు చెలరేగిన కొద్ది సేపటికే ప్రహ్లాదుడు విష్ణువును ప్రార్ధించడంతో శాలువా ఎగిరిపోయి ప్రహ్లాదుడిపై పడి అతడు రక్షింపబడగా హోలిక దహించుకుపోతుంది. హోలిక మంటలో కాలిపోయిన రోజును హోలీ పండుగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని మరో కథ ప్రచారంలో ఉంది. 


కాముడి పున్నం.. 

తపస్సులో ఉన్న శివుడికి హిమవంతుడి కూతురైన పార్వతిదేవిని ఇచ్చి దేవతలు వివాహం చేయాలనుకుంటారు. కానీ శివుడికి ఎలా తప భంగం కలిగించాలో అని ఆలోచించి మన్మథుడిని శివుడి మీదకు పంపుతారు. మన్మథుడు తన బాణ ప్రభావంతో శివుడి మనస్సును పెళ్లి వైపు మళ్లిస్తాడు. దాంతో పార్వతీపరమేశ్వరుల కల్యాణం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి. మన్మథబాణ ప్రభావం తగ్గగానే శివుడు తనకు తపో భంగం అయిందని గ్రహించి తన మూడో కన్నుతో మన్మథుడిని భస్మం చేస్తాడు. పతీ వియోగ భారంతో మన్మథుడి భార్య రతీదేవి శివుడిని పలు విధాలుగా వేడుకోగా పరమేశ్వరుడు అనుగ్రహించి శరీరం లేకుండా కేవలం మానసికంగా బతికే వరం పాల్గుణ శుద్ధ పౌర్ణమి రోజు ప్రసాదిస్తాడు. కాముడు తిరిగి బతికిన రోజేకాముడి పున్నమిగా జరుపుకుంటారు. 


విరగబూసిన మోదుగుచెట్టు

చండూరు మండల పరిధిలోని పడమటితాళ్ల వద్ద మోదుగు చెట్టు విరగబూసింది. ఏటా హోలీ పండుగకు ముందుగానే మోదుగు చెట్లకు పూలు పూస్తాయి. మోదుగు పూల అనంతరం కాసే కాయల్లో ఉండే గింజలను బట్టి పూర్వం కరువు కాలాలను పెద్దలు నిర్ణయించేవారు. సహజంగా మోదుగు కాయలో మూడు గింజలు ఉన్నట్లు కనిపించినా ఒక్కటే గింజ ఉంటుంది. మొదట గింజ ఉంటే వర్షాకాలం ముందుగా వస్తుందని, మధ్యలో ఉంటే దసరా సమయంలో వర్షాలు కురుస్తాయని, చివరిలో ఉంటే ఈ సారీ కాలం చివరకు  అవుతుందని మన పూర్వీకుల నమ్మకం. దీంతో వర్తమానాన్ని అంచనా వేసేవారు. ఫల్గుణ మాసంలో వచ్చే హోలీ పండుగలో మోదుగు పూలతో తయారు చేసిన రంగు నీళ్లను పండుగకు వాడటం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. అయితే మోదుగుపూలను ముందు రోజే తీసుకొచ్చి నీళ్లలో నానబెట్టి పండుగ రోజు చల్లుకుంటే మశూచితో పాటు వివిధ చర్మ రోగాలు దరి చేరవు.


సహజ రంగుల తయారీ.. 

పసుపు, కుంకుమ, పూలు, పండ్లు వివిధ రకాల పిండిని నీళ్లలో కలుపి ఉపయోగించవచ్చు. 

గంధం, ఎర్రమందార, మోదుగు, గోగుపూలు, దానిమ్మ తొక్క, టమాట, క్యారెట్‌, పసుపు, సున్నం మిశ్రమం కలిస్తే ఎరుపురంగు వస్తుంది. 

శనగపిండి, పసుపు మిశ్రమం, బంతి, పసుపుపచ్చ చామంతిపూల మిశ్రమంతో పసుపురంగు వస్తుంది. 

గోరింటాకు, గుల్‌మొహర్‌ ఆకులు, గోధుమ మొలకలు, పాలకూర, కొత్తిమీర, పూదీనా, టమోటా ఆకులతో ఆకుపచ్చ రంగు తయారు చేసుకోవచ్చు. 

సిరాచెట్టు (ఇండిగోప్లాంట్‌) కాయలతో నీలిరంగు వస్తుంది. 

బీట్‌రూట్‌, ఉల్లిపాయ తొక్కల మిశ్రమంతో ముదురు కెంపు రంగు వస్తుంది. పారిజాత పూలకాండాలను ఎండబెట్టి నానబెడితే సింధూరం రంగు వస్తుంది. 

బ్రౌన్‌ కలర్‌ కోసం కాఫీ లేక టీ పొడి కలిపి వడపోసిన లేక మరగపెట్టిన నీళ్లు వాడొచ్చు.

నల్లద్రాక్ష రసం లేదా ఎండబెట్టిన పెద్ద ఉసిరికాయల్ని ఉడికించి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు నీటిలో కలుపుకుంటే నల్ల రంగు వస్తుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. 

రసాయన మందుల వల్ల కళ్లకు హాని కలుగకుండా సన్‌గ్లాసెస్‌ వాడాలి. దంతాలపై రంగులు పడకుండా డెంటల్‌ క్యాప్స్‌ వేసుకోవాలి. 

మందం దుస్తులను ధరించాలి.

ముదురు రంగు దుస్తులు మంచిది. పుల్‌హ్యాండ్స్‌ షర్ట్‌, చేతులకు గ్లౌజులు, కాళ్లకు సాక్సులు వేసుకోవాలి. 

కళ్లల్లో రంగు పడితే వెంటనే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. మంట అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి. 

తలపై రంగులు పడకుండా క్యాప్‌ ధరించాలి. రంగులు చల్లుకోవడం పూర్తయ్యాక గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి.


logo