సోమవారం 30 మార్చి 2020
Nalgonda - Mar 08, 2020 , 01:45:57

నిరక్షరాస్యులు @1.94లక్షలు

నిరక్షరాస్యులు @1.94లక్షలు

నల్లగొండ, నమస్తే తెలంగాణ : రాష్ట్రంలో నిరక్షరాస్యత లేకుండా చేయాలనే ఉద్దేశంతో అటు గ్రామీణప్రాంతాలతోపాటు ఇటు పట్టణప్రాంతాల్లో 18ఏళ్ల నుండి 35ఏళ్ల వయసు లోపల ఉన్నవారిని గుర్తించాలని సూచించింది. ఈ నేపధ్యంలో పంచాయతీశాఖ యంత్రాంగం పల్లెప్రగతిలో మున్సిపల్‌ యంత్రాంగం పట్టణప్రగతిలో స్థానిక అంగన్‌వాడీలు, ఆశ వర్కర్లు, బీఎల్‌వోలు, ఇతర సిబ్బంది సహకారంతో ఈచ్‌వన్‌-టచ్‌వన్‌లో భాగంగా నిరక్షరాస్యులను గుర్తించింది. పల్లెప్రగతి కార్యక్రమం జనవరి 2నుంచి 11వరకు జరగ్గా ఆ సర్వేలో గ్రామీణ నిరక్షరాస్యుల సంఖ్య తేలగా గతనెల 24నుంచి ఈ నెల 4 వరకు జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పట్టణ నిరక్షరాస్యుల సంఖ్య తేలింది. మొత్తంగా జిల్లావ్యాప్తంగా 1,94,747మంది నిరక్షరాస్యులు ఉన్నట్లుగా పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ యంత్రాంగం ఈచ్‌వన్‌ టచ్‌వన్‌ కార్యక్రమంలో నిరక్షరాస్యుల సంఖ్య తేల్చింది. 


ప్రగతి కార్యక్రమాల్లో ఈచ్‌వన్‌-టచ్‌వన్‌..

జిల్లా అధికార యంత్రాంగం ఈచ్‌వన్‌ టచ్‌వన్‌ కార్యక్రమం పేరుతో జనవరి 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జిల్లాలోని 844 గ్రామ పంచాయతీల్లో సర్వే నిర్వహించారు. స్థానిక అంగన్‌వాడిలు, ఆశ వర్కర్లు, బీఎల్‌వోలతో పాటు పంచాయతీ కార్యదర్శులు, ఇతరుల సహకారాన్ని తీసుకుని నిరక్షరాస్యులను గుర్తించారు. అదేవిధంగా జిల్లాలో నల్లగొండ, దేవరకొండ, మిర్యాలగూడ, నందికొండ, హాలియా, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలు ఉండగా ఆయా మున్సిపాలిటీల్లోను గత నెల 24నుంచి ఈ నెల 4వ తేదీ వరకు ఈ సర్వేను మున్సిపల్‌ యంత్రాంగం స్థానిక సిబ్బంది సహకారంతో చేపట్టింది. మొత్తంగా ఇరు శాఖలు చేపట్టిన సర్వేలో జిల్లావ్యాప్తంగా 1.94 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లుగా గుర్తించారు. గ్రామీణప్రాంతాల్లో నిరక్షరాస్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో రీసర్వే చేయాలని అధికారులను సూచించిన నేపధ్యంలో ఆ దిశగా సర్వే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  


1.94లక్షల మంది నిరక్షరాస్యులు..

జిల్లాలో 12,37,008మంది జనాభా ఉండగా అందులో 18సంవత్సరాల నుంచి 35సంవత్సరాలలోపు వయసు కలిగిన వారిని పరిగణలోకి  తీసుకుని నిరక్షరాస్యులను గుర్తించాలని సర్కార్‌ సూచించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్‌ శాఖ యంత్రాంగం 844 గ్రామ పంచాయతీల్లో సర్వే నిర్వహించారు. ఇందులో 1,73,688 మంది నిరక్షరాస్యులు ఉన్నట్లుగా గుర్తించగా వీరిలో 1,15,172మంది మహిళలు కాగా 58,489మంది పురుషులు ఉన్నారు.  అయితే అత్యధికంగా మిర్యాలగూడలో 11,562మంది, అత్యల్పంగా చిట్యాలలో 2119 మంది నిరక్షరాస్యులున్నారు. ఇక 7 మున్సిపాలిటీల్లో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టిన సర్వేలో 21059మంది నిరక్షరాస్యులు ఉండగా అందులో అత్యధికంగా నల్లగొండలో 7731 మంది అత్యల్పంగా నందికొండలో 963 మంది నిరక్షరాస్యులున్నారు.  


కనీస పరిజ్ఞానం లేనివారినే గుర్తింపు...

నిరక్ష్యరాస్యులను గుర్తించే సమయంలో ఈచ్‌ వన్‌ టచ్‌వన్‌ సందర్భంగా సర్వేబృందం కలిసి పలు అంశాలపై ప్రశ్నించారు. ప్రత్యేక ఫామ్‌లో సూచించిన అంశాల ఆధారంగా ప్రశ్నించి లెక్కించారు. చదవడం వస్తుందా...రాసే పరిజ్ఞానం ఉన్నదా.. పేరు రాసుకోగలరా..ఉత్తరం రాయగలరా అనే కోణంలో ప్రశ్నించారు. పేరు రాయనివారితోపాటు పేరుమాత్రమే రాయగల్గినవారిని కూడా నిరక్ష్యరాస్యులుగా గుర్తించారు. 18నుంచి 35 సంవత్సరాల వయస్సుకల్గిన వారినే పరిగణనలోకి తీసుకుని ఈ సంఖ్యను తెచ్చారు. 


అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళిక..

తెలంగాణ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచాలనే ఉద్దేశంతోనే నిరక్షరాస్యుల సంఖ్య లెక్కతీసింది. కాలానుగుణంగా అనేక మార్పులు రావడంతో పాటు డిజిటల్‌ యుగంలోను ఇంకా నిరక్షరాస్యత ఉండటం సర్కార్‌ను వేధించే అంశం. ఈ నేపధ్యంలో ఇప్పటికి ఉన్న నిరక్షరాస్యులను గుర్తించి వారికి కనీస అక్షరజ్ఞానం నేర్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ప్రధానంగా పల్లెల్లో ఎక్కువ మంది నిరక్షరాస్యులు ఉండే అవకాశం ఉన్నందున తొలుత ఆ సంఖ్యను లెక్కించేందుకు పల్లె ప్రగతిని వినియోగించుకున్న సర్కార్‌ తర్వాత పట్టణప్రగతిని వినియోగించుకుని పట్టణాల్లోను నిరక్షరాస్యుల సంఖ్యపై ఆరా తీసింది. ఇక గుర్తించిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించనుంది.  ఇందుకుగాను విద్యాశాఖతోపాటు స్థానిక మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోనున్నారు.


logo