బుధవారం 01 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 07, 2020 , 00:58:56

పంట పండింది..

పంట పండింది..

మిర్యాలగూడ, నమస్తేతెలంగాణ : లిఫ్టుల ఆధునీకరణతో ఆయకట్టులో నూరుశాతం వరిపొలాలు సాగు కావటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఎస్‌పీ ప్రధాన కాల్వ కింద ఆయకట్టుకు నీరు అందిన విధంగానే లిఫ్టుల కింద ఆయకట్టుకు చివరి భూములకు సైతం సాగునీరు అందటంతో పచ్చదనం పరిఢవిల్లుతోంది. నల్లగొండ, సూర్యాపేట జిల్లాల పరిధిలో మూడు దశాబ్దాల క్రితం సాగర్‌ ఎడమకాల్వపై  41 ఎత్తిపోతల పథకాలను నిర్మించారు. అయితే వీటిని గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో మోటర్లు, పంపులు, స్లార్టర్లు, పంపుహౌస్‌లు, కాల్వలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. దీంతో 20శాతం భూములకు కూడా నీరందక రైతులు ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక లిఫ్టుల పునర్నిర్మాణం చేసేందుకు సీఎం కేసీఆర్‌ నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఆధుణీకరణతోపాటు ఎత్తిపోతల పథకాలను ఆధునీకరించాలని రూ.117.92 కోట్లు నిధులు కేటాయించారు. ఈ నిధులతో లిఫ్టుల్లోని మోటార్లు, స్టార్టర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్‌వైర్లు, నూతనంగా పైపులైనులు, ప్రధాన కాల్వలు పూర్తిస్థాయిలో ఆధునీకరించారు. దీనివలన 41లిఫ్టుల కింద ఉన్న 78, 041 ఎకరాల భూమి సాగులోకి వచ్చింది. 

కాల్వల పునర్నిర్మాణం..

గత పాలకులు పట్టించుకోక పోవడంతో ఎత్తిపోతల పథకాలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. కాల్వలు, తూములు, డ్రాపులు, కాల్వకట్టలు పూర్తిగా శిథిలమయ్యాయి.సీఎం కేసీఆర్‌ చొరవతో ఎట్టకేలకు 41లిఫ్టుల పునర్నిర్మాణానికి మోక్షం లభించింది. కాల్వల్లో పూడిక తొలగించారు, కాల్వకట్టలు విస్తరించి బలోపేతం చేశారు. కట్టలపై ఉన్న కంపచెట్లు తొలగించారు. శిథిలమైన తూములను తిరిగి పునర్నిర్మించారు. కాల్వలు బాగవడంతో చివరి ఆయకట్టుకు నీరు అందుతోంది. 

యాసంగిలో పెరిగిన ఆయకట్టు..

లిఫ్టులను పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతో  ఈ యాసంగి ఎత్తిపోతల పథకాల కింద చివరి భూములకు సాగునీరు చేరింది. 41లిఫ్టుల కింద పూర్తిస్థాయి ఆయకట్టు 78041 ఎకరాలు కాగా ఈ యాసంగి పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందుతోంది. లిఫ్టులకు కొత్త మోటర్లు, స్టార్టర్లు ఏర్పాటు చేసి కాల్వలు, తూములు పునర్నిర్మాణం చేయడంతో లిఫ్టుల కింద చివరి భూములకు సాగునీరు అందటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరిపొలాలు పచ్చగా ఉండి పంట చివరి దశకు చేరటంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం లిఫ్టులకు 24గంటల కరెంటు సరఫరా చేస్తుండడంతో చివరిభూములకూ సాగునీరు అందుతోంది. గత ప్రభుత్వాల హయాంలో 4 నుంచి 7 గంటల కరెంటుతో లిఫ్టుల కింద రైతుల భూములు బీళ్లుగా మారాయి. సీఎం కేసీఆర్‌ రైతులను ఆదుకునేందుకు లిఫ్టులకు ప్రత్యేక విధ్యుత్‌ లైన్లు ఏర్పాటు చేసి, పూర్తిస్థాయిలో ఆధునీకరించడంతోపాటు 24గంటల కరెంటు ఇవ్వడంతో చివరిభూములకు సాగునీరు అందుతుందని రైతులు సంబురపడుతున్నారు.


logo
>>>>>>