శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 07, 2020 , 00:55:22

రెండోదఫా ‘పట్టణ ప్రగతి’ నిధులు విడుదల

రెండోదఫా ‘పట్టణ ప్రగతి’ నిధులు విడుదల
నల్లగొండ, నమస్తే తెలంగాణ : పట్టణ ప్రగతిలో భాగంగా జిల్లాలోని 7మున్సిపాలిటీలకు ప్రభుత్వం గత నెల రూ. 3.38 కోట్లు విడుదల చేయగా ఈ నెలా అంతే మొత్తం శనివారం విడుదల చేసింది. పల్లెప్రగతిలో భాగంగా నెలనెలా జిల్లాలోని 844 పంచాయతీలకు నెలనెలా రూ.20కోట్లు అందుతుండగా పట్టణ ప్రగతిలో 7మున్సిపాలిటీలకు రూ.3.38 కోట్లు వస్తున్నాయి. గుర్తించిన తొలి ప్రాధాన్య సమస్యల పరిష్కారానికి ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. నల్లగొండ, మిర్యాలగూడ, దేవరకొండ, చిట్యాల, హాలియా, నందికొండ, చండూరు మున్సిపాలిటీలకు నిధులు విడుదలయ్యాయి. ఆయా మున్సిపాలిటీల ఖాతాల్లో నిధులు జమచేసినట్లు అధికారులు తెలిపారు. 

 పారిశుధ్యంపై ప్రధాన దృష్టి...

పట్టణ ప్రగతిలో భాగంగా ప్రభుత్వం 7మున్సిపాలిటీలకు రూ.3.38 కోట్ల చొప్పున విడుదల చేయగా ఈ నిధులు ఆయా మున్సిపాలిటీల్లో తొలి ప్రాధాన్య అంశాలకే కేటాయించేలా చర్యలు తీసుకోనున్నారు. ప్రధానంగా పారిశుధ్యం, చెత్త తొలగింపు, డ్రైనేజీలను శుభ్రం చేసేందుకే కేటాయించనున్నారు. అన్ని మున్సిపాలిటీల్లోని వార్డుల్లో ఇప్పటికే మున్సిపల్‌ కమిషనర్లు ప్రత్యేక అధికారులను నియమించారు. వీరు స్థానిక కౌన్సిలర్ల సహకారంతో కమిషనర్ల పర్యవేక్షణలో నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వార్డులో తొలుత తాత్కాలిక సమస్యలు పరిష్కరించి తర్వాత దీర్ఘకాలిక సమస్యలపై దృష్టి సారించనున్నారు. వీధిలైట్లు, సీసీరోడ్లు, పబ్లిక్‌ టాయ్‌లెట్ల నిర్మాణం, తాగునీటి సరఫరా, విద్యుత్‌ సమస్యల పరిష్కారానికి నిధులు వెచ్చించనున్నారు. 

నెలనెలా నిధుల విడుదల...

గత నెల 24నుంచి ఈ నెల 4 వరకు ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం  నిర్వహించి తొలి, మలి విడుతల్లో జిల్లాలోని 7మున్సిపాలిటీలకు రూ.6.76 కోట్లు విడుదల చేసింది. ఇక నెలనెలా రూ. 3.38 కోట్ల చొప్పున ఇవ్వనుంది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రభు త్వం గడిచిన 5నెలలుగా నెలనెలా ఆయా పంచాయతీలకు నిధులు విడుదల చేస్తోంది. జిల్లాలోని 844 పంచాయతీలకు నెలకు రూ.20 కోట్ల చొప్పున 5 నెలలుగా రూ.100కోట్లు అందాయి. అదేస్థాయిలో పట్టణాల్లో పట్టణ ప్రగతిలో భాగంగా చేపట్టాల్సిన పనులకు ఇప్పటికే 2నెలలుగా రూ.6.76కోట్లు అందించింది.


logo