బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 06, 2020 , 01:57:37

సర్వం సిద్ధం..

సర్వం సిద్ధం..


నల్లగొండ, నమస్తే తెలంగాణ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌పై తెలంగాణ ప్రభుత్వం యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో ఆ దిశగా వైద్యఆరోగ్య శాఖ యం త్రాంగం అప్రమత్తమై చర్యలు చేపడుతోంది. ఆ వ్యాధి నివారణను దృష్టిలో పెట్టుకుని అనుమానితులను గుర్తిం చి భయాన్ని పోగొట్టేందుకు ఐసోలేషన్‌ వార్డులు ఏర్పా టు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్‌-19 వ్యాప్తి నిరోధానికి రూ.100 కోట్లు కేటాయించడంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు మిర్యాలగూడ, దేవరకొండ, సాగర్‌ ఏరియా దవాఖానాలతో పాటు నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానలోనూ ఐసోలేషన్‌ వార్డు ల ఏర్పాటు జరుగుతోంది. 


జిల్లా కేంద్ర దవాఖానలో 20 బెడ్లతో....

కరోనా కేసులు హైదరాబాద్‌లో గుర్తించబడటంతో సర్కార్‌ ఆదేశాల మేరకు జిల్లాలోనూ వైద్య శాఖ అప్రమత్తమైంది. జిల్లా కేంద్రంలో మెడికల్‌ అండ్‌ వైద్య విధాన పరిషత్‌ ఆద్వర్యంలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి ఐసోలేషన్‌ వార్డుగా రూపొందించి 20 బెడ్లు సమకూర్చారు.  ఇందులో జనరల్‌ మెడిసిన్‌ డాక్టర్‌తో పాటు అనస్తీషియా, నోడల్‌ ఆఫీసర్‌, సూపరింటెండెంట్‌, ఫిజీషియన్‌లతో పాటు ఇతర సిబ్బంది ఉన్నారు. నెల రోజుల ముందే జిల్లా కేంద్రంలోనూ తాత్కాలిక ఐసోలేషన్‌ వార్డులో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినప్పటికీ ప్రస్తుతం వైద్యుల కేటాయింపు సైతం చేపట్టి వారిని అప్రమత్తంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే విధంగా నార్కట్‌పల్లిలోని కామినేని దవాఖానలోనూ 50 పడకలతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటు చేశారు. నల్లగొండ, నార్కట్‌పల్లిలో వైద్య కళాశాలలు ఉండటంతో వైద్య విద్యార్థుల సహకారంతో అనుమానితులను పర్యవేక్షించనున్నారు. 


నేడు మిర్యాలగూడ, సాగర్‌, దేవరకొండలో..

నల్లగొండలో 20 బెడ్లతో, నార్కట్‌పల్లి కామినేనిలో 50 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసిన వైద్య శాఖ యంత్రాంగం నేడు మిర్యాలగూడలోనూ 12 బెడ్లతో ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. డీసీహెచ్‌ఎస్‌ మాతృ మిర్యాలగూడ ఏరియా దవాఖానను పరిశీలించి ఐసోలేషన్‌ వార్డు ఏర్పాటుపై అక్కడి వైద్యులకు పలు సూచనలు చేశారు. వ్యాధి అనుమానితులు దవాఖానకు వస్తే వెంటనే శాంపిల్స్‌ తీసుకుని హైదరాబాద్‌కు పంపించేలా ఏర్పాట్లు చేశారు. అదే విధంగా  దేవరకొండతో పాటు నాగార్జునసాగర్‌, ఏరియా దవాఖానల్లో 12 బెడ్లతో ఈ ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయనున్నారు. అనుమానితులను దవాఖానలకు తీసుకురావడానికి 104 సైతం అందుబాటులో ఉంది. దవాఖానకు వచ్చిన అనుమానితుల శాంపిల్స్‌ సేకరించి గాంధీ  దవాఖానకు పంపించి వ్యాధి నిర్ధారణ చేపట్టనున్నారు. 


logo