గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 04, 2020 , 03:58:20

ఎదుర్కోలు సంబురం

ఎదుర్కోలు సంబురం

పట్టువస్ర్తాలు... వజ్రవైఢూర్యాలు ధరించిన పంచనారసింహుడు అశ్వవా హనంపై మండపానికి చేరుకోగా.. అప్పటికే ముగ్ధ్దమనోహర రూపంతో ముత్యాల పల్లకిపై ఆసీనురాలైన లక్ష్మీదేవి పెండ్లిచూపుల తంతు ను పాంచరాత్రాగ మానుసారం అర్చక బృందం, వేదపండితులు నిర్వహించా రు. మంగళవారం అర్ధరాత్రి దాటుతుండగా యాదాద్రీశుడి కల్యాణ సుమూహూర్తం నిర్వహించే ఎదుర్కోలు మహోత్సవ ఘట్టాన్ని కనుల పండువగా నిర్వహించారు. సిరి సంపదలకు నెలవైన లక్ష్మీ అమ్మవారి అందచందాలు... భక్త వరప్రదాయుడైన అవతారమూర్తి నృసింహుడి మహిమాన్విత విశేషాలను వర్ణి స్తూ ఎదుర్కోలు మహోత్సవాన్ని  నిర్వహించారు. నేటి ఉదయం శ్రీరామ అలంకారం, రాత్రి తిరుకల్యాణ మహోత్సవం నిర్వహిస్తారు. నారసింహుడికి వరపూజ, వధువు శ్రీలక్ష్మీదేవికి పూలు, పండ్లు  అర్ధరాత్రి వేళ పెండ్లి ఒప్పందాలు నేడు నవమి రోజు తులాలగ్నంలో శ్రీవారి కల్యాణంఉదయం శ్రీరామ అలంకారం, రాత్రి యాదాద్రీశుడి తిరుకల్యాణమహోత్సవంముస్తాబైన యాదాద్రికొండ  నేడు జరిగే కల్యాణోత్సవానికి దేవాదాయ శాఖ మంత్రి హాజరు 


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : పట్టువస్ర్తాలు... వజ్రవైఢూర్యాలు ధరించిన పంచనారసింహుడు అశ్వవాహనంపై మండపానికి చేరుకున్నారు. అప్పటికే లక్ష్మీదేవి ముగ్దమనోహర రూపంతో ముత్యాల పల్లకిపై ఆసీనురాలై ఉంది. ఎదురెదురుగా కూర్చున్న శ్రీవారు, లక్ష్మీ అమ్మవార్ల పెండ్లిచూపుల తంతును పాంచరాత్రాగమానుసారం అర్చక బృందం, వేదపండితులు నిర్వహించారు. మంగళవారం రాత్రి యాదాద్రీశుడి కల్యాణ సుమూహూర్తమును నిర్వహించే ఎదుర్కోలు మహోత్సవ ఘట్టాన్ని కనుల పండువగా నిర్వహించారు. సిరి సంపదలకు నెలవైన లక్ష్మీ అమ్మవారి అందచందాలు...భక్తవరప్రదాయుడైన అవతారమూర్తి నృసింహుడి మహిమాన్విత విశేషాలను వర్ణిస్తూ ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు. జీవకోటి పరమాత్మను ఆశ్రయించి అనుగ్రహించమని వేడుకొనుట ఈ ఎదుర్కోలు సారాంశం. శ్రీనృసింహుడు, అమ్మవార్ల లోకరక్షణ తీరును వారిరువురి వైభవాన్ని వివరించే తిరుకల్యాణమహోత్సవానికి సంబంధించిన ప్రక్రియను వధూవరుల గోత్ర, ప్రవర, పరిచయాదులు చేసుకుని సుమూహుర్త నిర్ణయంలో వేడుక నిర్వహించడం ఆగమశాస్త్ర ప్రత్యేకం. భగవానుడు సత్యజ్ఞాన స్వరూపుడని, ఆయన అనేక కల్యాణ గుణాలను పేర్కొంటూ గుణకోటి, జీవకోటికి ఉపయోగపడేవిధంగా భగవంతుడిని ప్రసన్నం చేసుకునేందుకు భక్తులను రక్షింపజేయమని స్తుతించే ఎదుర్కోలు ప్రక్రియ యాదాచలంలో కనుల పండువగా జరిగింది. బాలాలయ కల్యాణమండపంలో రాత్రి నిర్వహించిన కార్యక్రమంతో బ్రహ్మోత్సవాల్లో విశేషోత్సవాలకు తెరలేచింది. 


 అశ్వవాహనసేవపై శ్రీనారసింహుడు

పట్టువస్ర్తాల అలంకరణలతో అశ్వవాహనసేవపై శ్రీనారసింహుడు, ముత్యాల పల్లకి ద్వారా లక్ష్మీదేవి ఆలయం నుంచి ఊరేగింపుగా బయల్దేరారు. మేళ తాళాల మధ్య సేవ నిర్వహించారు. బాలాలయంలో ఎదురెదురుగా స్వామి, అమ్మవార్లను అధిష్టింపజేశారు. ఇరుపక్షాలుగా వీడిన నిర్వాహకులు పెండ్లిపెద్దలుగా వ్యవహరించారు. శ్రీవారి వైపు ఆలయ ఈవో గీత, అమ్మవారి వైపు ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి పెండ్లిపెద్దలుగా వ్యవహరించారు. ప్రధానార్చకులు నల్లందిగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, ఉప ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, బట్టర్‌ సురేంద్రాచార్యులు ఆధ్వర్యంలోని అర్చకులు పూజా కైంకర్యాలు జరిపారు.  వైష్ణవ సంప్రదాయ రీతిలో సంబంధం ఖాయమైన ఈ కార్యక్రమాన్ని అర్చకస్వాములు, వేదపండితులు, యాజ్ఞీకులు కలిసి కల్యాణ ఒప్పందాన్ని కుదుర్చారు. శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి కల్యాణం, నిశ్చయ తాంబూలాలకు ఒప్పందం కుదిరింది. బుధవారం ఉదయం 10 గంటలకు బాలాలయంలో,  రాత్రి 8 గంటలకు ఉన్నత పాఠశాల ఆవరణలో భక్తుల కోసం కల్యాణ ఘడియలుగా నిర్ణయించారు.. సంబంధం కుదిరాక వరుడైన నారసింహుడికి వరపూజ, వధువు శ్రీలక్ష్మీదేవికి పూలు, పండ్ల కార్యక్రమం జరిగింది.  


 నేడు శ్రీవారి తిరుకల్యాణం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణమహోత్సవం శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌స్వామి వారి సూచనల మేరకు బుధవారం ఉదయం 10 గంటలకు బాలాలయంలో నిర్వహించనున్నట్లు యాదాద్రి ఈవో గీత తెలిపారు. తిరిగి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జడ్పీ హైస్కూల్‌ ఆవరణలో శ్రీవారి తిరుకల్యాణోత్సవం నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి కల్యాణోత్సవానికి హాజరై శ్రీవారికి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పిస్తారు. ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, ఆర్‌టీఏ చీఫ్‌ కమిషనర్‌ సదారాం, ఆర్‌టీఏ కమిషనర్‌ బుద్ద మురళి,  కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ హాజరు కానున్నారు. 


logo