మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Mar 04, 2020 , 03:57:36

సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం

సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యం
  • ప్రజలకు నమ్మకం పెరిగేలా వైద్యసేవలు
  • కార్పొరేట్‌ను తలపించేలా వైద్యశాలలు
  • కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌
  • మెడికల్‌ కళాశాల, దవాఖానలో తనిఖీ

సర్కారు వైద్యశాలలను కార్పొరేట్‌కు దీటుగా వైద్యం అందించేలా తీర్చిదిద్దుతున్నామని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. ప్రజలకు నమ్మకం కలిగేలా సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. మంగళవారం జిల్లాకేంద్ర దవాఖానను స్థానిక ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో కలిసి పరిశీలించిన కలెక్టర్‌.. సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి అధికారులను పురమాయించారు. ఐసీయూ, ఐసోలేషన్‌, డయాలసిస్‌ వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు.


నీలగిరి : ప్రభుత్వం దవాఖానల్లో సీఎం కేసీఆర్‌ అన్ని రకాల వసతులు కల్పించడంతో రోగులకు మెరుగైన వైద్యం అందుతోందని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి జిల్లాకేంద్రంలోని మెడికల్‌ కళాశాల, దవాఖానను తనిఖీ చేశారు. వార్డులలో తిరిగి రోగులతో మాట్లాడారు. దవాఖాన ఆవరణ పరిశీలించి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దవాఖానలో రెండు బ్లాక్‌లలో విద్యుత్‌ సౌకర్యం కల్పించేందుకు ప్రస్తుతం ఉన్న 250 కేవి ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేయించడంతో పాటు కొత్తగా 315 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలన్నారు. దవాఖానలో మౌళిక సదుపాయాల కోసం సంస్థ ఈఈని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం ఐసీయూ, ఐసోలేషన్‌ వార్డు, డయాలసిస్‌ వార్డులు సందర్శించి రోగులతో మాట్లాడారు.


ఐసీయూ మరో వార్డు నాలుగు వెంటిలేటర్లు, సిబ్బంది, పడకలతో ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని, నిధుల మంజూరుకు ప్రభుత్వానికి పంపించనున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. డయాలసిస్‌ రెండో యూనిట్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌కు అదనంగా ప్రసవాల కోసం వచ్చే మహిళలకు బ్లాక్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. ప్రతి వార్డులో వేర్వేరు చెత్త వ్యర్థ పదార్థాలు, బయో వెస్టు మెటీరియల్‌ వేసేందుకు డస్ట్‌బిన్‌లు ఏర్పాటు చేసి డంపింగ్‌యార్డుకు తరలించాలని పారిశుధ్య కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్‌ దవాఖానకు ధీటుగా ప్రతి రోగికి చికిత్స అందించే విధంగా దవాఖానను తీర్చిదిద్దనున్నామన్నారు. దవాఖానలో విద్యుత్‌ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, ట్రాన్స్‌కో ఎస్‌ఈ కృష్ణయ్య, దవాఖాన సూపరింటెండెంట్‌ డా. నర్సింహ, డా. మాతృ, పీఆర్‌ ఈఈ తిరుపతయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ దేవ్‌సింగ్‌, డీఈ అజీజ్‌, లోక్‌లాల్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌ ఉన్నారు.


logo
>>>>>>