గురువారం 09 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 03, 2020 , 01:35:41

గోవర్ధనగిరిధారిగా..

గోవర్ధనగిరిధారిగా..

యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహుడు సోమవారం గోవర్ధనగిరిధారిగా భక్తులకు దర్శనమిచ్చాడు. బ్రహ్మోత్సవాల్లో ఆరోరోజు శ్రీలక్ష్మీనరసింహుడు ద్వాపరంలో శ్రీకృష్ణుడు గోవర్ధనపర్వతాన్ని ఎత్తి గోకులాన్ని రక్షించిన అపూర్వసన్నివేశాన్ని యాదాచలంలో ఆవిష్కృతం చేశారు. ఉత్సవవరుడిగా ముస్తాబయ్యే సంబురాల్లో భాగంగా మృగనరహరి ఉదయం వేళ గోవర్థనగిరిధారుడిగా...రాత్రివేళ సింహవాహనంపై అలంకృతుడై సేవలు పొందారు. గోవర్ధనగిరిధారి నామస్మరణే ముక్తిదాయకమని సర్వలోకాలకు తెలియపర్చినతీరు భక్తులను మైమరిపించింది. స్వామి, అమ్మవార్లను కల్యాణమండపంలో అధిష్ఠింపజేసి వధూవరులుగా ముస్తాబు చేసి ఉత్సవాన్ని నిర్వహించారు.


సింహవాహనంపై ఊరేగిన శ్రీవారు..

బ్రహ్మోత్సవాల్లో రాత్రి శ్రీనారసింహుడు సింహవాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అడవిలోని ఇతర ప్రాణులు సింహాన్ని చూసి భయాందోళన చెందుతాయి. కానీ నారసింహ అవతారంలోని ‘సింహ’ శబ్దానికి కాపాడుతుందని అర్థం. హిరణ్యకశ్యపుడి వృత్తాంతంలో మరింత పాపపంకిలంలో పడకుండా భగవానుడు రక్షించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. వాడిగా ఉన్న గోళ్లతో హిరణ్యకశ్యపుని పొట్టను చీల్చే సందర్భంలో స్వామి గోర్లను వర్ణిస్తూ హరివంశంలో నఖ అనే శబ్దాన్ని ప్రయోగించిన తీరును ప్రధానార్చకులు వివరించారు. శ్రీలక్ష్మీనరసింహుడి గోర్లు హిరణ్యకశ్యపుడి పొట్టను తాకగానే గోర్లలోని కాఠిన్యం అతి మృదువైన శరీరంలోకి ప్రవేశించిందని, సనక, సనందనాథులు తనకు ఇచ్చిన శాపంనుంచి  సునాయసంగానే విముక్తినవుతున్నానని హిరణ్యకశ్యపుడు భావించాడని ప్రధానార్చకుడు వివరించారు.


గోవర్ధనగిరి అలంకారం  ప్రాధాన్యత

దేవతల రాజైన  ఇంద్రుడి అహంకారాన్ని అణచి సర్వలోకాలకు తానే ప్రభువునని శ్రీహరి తెలియజెప్పడమే గోవర్ధనగిరి అలంకార విశిష్టత. ప్రతి సంవత్సరం గోపకులు ఇంద్రుడికి జరిపే ఇంద్రోత్సవాన్ని శ్రీకృష్ణుడు తనకు జరిపించుకోవడంతో ఇంద్రుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. ఇంద్రోత్సవానికి సరితూగుతానా లేదా అని ఆలోచించకుండా శ్రీకృష్ణుడు ఇంద్రోత్సవం జరుపుకుంటాడా అని ఆగ్రహం చెంది అగ్ని, వాయు, వాన దేవుళ్లకు గోపకులను అణచివేయాలని ఇంద్రుడు ఆదేశించడంతో ముగ్గురు విజృంభించడంతో రేపల్లె ఏడు రోజులపాటు అతలాకుతలమవుతుంది. దీంతో శ్రీకృష్ణుడు చిటికెన వేలిపై గోవర్ధనపర్వతాన్ని నిలబెట్టి లోకాన్ని రక్షిస్తాడు. ఇంద్రుడి గర్వాన్ని భంగం చేస్తాడు. 


logo