బుధవారం 01 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 03, 2020 , 01:32:35

మర్రిగూడలో ‘చిరుత’ కలకలం

మర్రిగూడలో ‘చిరుత’ కలకలం

చండూరు, నమస్తే తెలంగాణ/మర్రిగూడ : మండలంలోని అటవీప్రాంత గ్రామాల్లో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. రైత తమ పశువులను కొట్టాల్లో కట్టేసిన ఆవుదూడలపై దాడి చేసి చంపేస్తున్నాయి. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండంతో రైతులు, గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. ఈ ఏడాది జనవరి 13న అజిలాపురంలో ఓ రైతు తన పంటను అడవి పందుల బారి నుంచి  కాపాడుకోవడానికి పంట చుట్టూ ఉచ్చు బిగించాడు. తెల్లావారేసరికి ఉచ్చులో చిరుత చిక్కడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గత సంవత్సరం నవంబర్‌ 14న యరుగండ్లపల్లిలో నేనావత్‌ రాములు, నవంబరు 29న రాంరెడ్డిపల్లిలో ఐతగోని వెంకటయ్యకు చెందిన ఆవు దూడలపై చిరుత దాడిచేసి చంపేసింది. ఇటీవల మండలంలోని ఖుదాభక్షిపల్లిలో సిరిసాల యాదయ్య, తాజాగా అజిలాపురంలో గుణగంటి పెంటయ్యకు చెందిన ఆవుదూడలను చంపేసింది. అజిలాపురం, యరుగండ్లపల్లి, వెంకెపల్లి, చెర్లగూడెం, రాంరెడ్డిపల్లి, ఖుదాభక్షిపల్లి గ్రామాలు గుట్టలకు ఆనుకొని ఉండడంతో ఆ గ్రామాల రైతులు వ్యవసాయ బావుల వద్దకు వెళ్లడానికి జంకుతున్నారు.

చిరుత చిక్కడంతో బలపడిన అనుమానాలు 

అజిలాపురం శివారులో ఓ రైతు తన పంటను కాపాడుకునేందుకు చేను చుట్టూ వేసిన ఉచ్చులో ఇటీవల చిరుత చిక్కుకున్న విషయం విధితమే. అదే సమయంలో రైతులు తమ పొలాల్లో చిరుత తిరుగోతోందని హెచ్చరించినప్పటికీ అటవీ అధికారులు ఆ విషయాన్ని కొట్టిపారేశారు. తీరా చిరుత చిక్కడంతో తమ తప్పు తెలుసుకొని అధికారులు సమాధానం దాటవేశారు. ప్రస్తుతం పశుసంపదపై జరుగుతున్న దాడులతో రైతులు బెంబేలెత్తుతుండగా అటవీ అధికారులు మాత్రం తమ ధోరణి వీడడంలేదు. 

ఉచ్చు వేసిన రైతుపై కేసుతో కొత్త చిక్కులు

గతంలో పంట కాపాడుకునేందుకు వేసిన ఉచ్చులో చిరుత చిక్కుకోవడంతో అటవీ శాఖ అధికారులు రైతుపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.  దీంతో ప్రస్తుతం తమ మూగ జీవాలపై దాడి చేస్తున్నది చిరుత అని తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి అన్నదాతల్లో నెలకొంది. ఆత్మ రక్షణకోసమో.. పంట రక్షణ కోసమో చర్యలు చేపట్టాలంటే జంకుతున్నారు. భూముల ధరలకు రెక్కలు రావడంతో తమ శాఖ ఆధీనంలో ఉన్న భూములకు లెక్కలేసుకుంటున్న అటవీశాఖ అధికారులు సమీప గ్రామల ప్రజల భద్రతను గాలి కొదిలేశారని పలువురు ఆరోపిస్తున్నారు. logo
>>>>>>