శనివారం 04 ఏప్రిల్ 2020
Nalgonda - Mar 02, 2020 , 01:00:18

తీరిన రైతుల కష్టాలు

తీరిన రైతుల కష్టాలు

 కట్టంగూర్‌ : రైతన్నలకు గోదాంల నిర్మాణం వరంగా మారింది. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు నిల్వ ఉంచుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి గోదాంలను నిర్మించింది. ధాన్యం నిల్వ చేసుకోవాడానికి గతంలో ప్రభుత్వ పరంగా సరిపడా గోదాంలు లేకపోవడంతో రైతులు చాలా ఇబ్బందులు పడేవారు. రైతులు చేతికొచ్చిన పంటను ఎంతో కొంతకు దళారులకు విక్రయించి ఆర్థికంగా నష్టపోయేవారు. అన్నదాతల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం రైతులను అన్ని విధాల ఆదుకునే విధంగా పంటలకు గిట్టుబాటు ధర లభించే వరకు పంటలను నిల్వ చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ గ్రామాల్లో గోదాంల నిర్మాణం చేపట్టింది. 

రైతులు పండించిన పంటలను మద్ధతు ధర లేనప్పుడు వాటిని నిల్వ చేసుకోవాడానికి నకిరేకల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మండలంలోని కురుమర్తి గ్రామంలో నాబార్డు నిధులు రూ.3 కోట్లతో 5వేల మెట్రిక్‌ టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన రెండు మార్కెట్‌ గోదాములను ఆధునిక హంగులతో నిర్మించింది. 2017అక్టోబర్‌10న  గోదాముల నిర్మాణానికి నాటి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. సంబంధిత అధికారులు కాంట్రాక్టర్‌తో నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో 2020 జనవరి 30న ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య రెండు గోదాంలను ప్రారంభించి రైతులకు ఉపయోగంలోకి తెచ్చారు. దీంతో రైతులు తమ పంటలను మద్దతు ధర వచ్చేంత వరకు గిడ్డంగుల్లో నిల్వ ఉంచుకునే అవకాశం లభించింది. రైతులు గోదాంలలో నిల్వ చేసిన పంటలపై ప్రభుత్వం  నుంచి 75శాతం రుణాలు పొందే అవకాశం ఉంటుంది. రైతన్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం గోదాములు నిర్మించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


logo