గురువారం 02 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 28, 2020 , 02:36:41

దేవేరులకు గరుత్మంతునితో ఆహ్వానం

దేవేరులకు గరుత్మంతునితో ఆహ్వానం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ధ్వజారోహణం.. దేవతాహ్వానం.. భేరీపూజలు గురువారం యాదాద్రి వైభవంగా నిర్వహించారు.   శ్రీమన్నారాయణుడి వాహనమైన గరుత్ముంతున్ని ఆహ్వానించి సకల దేవతలకు యాదాద్రి నారసింహుడు శుక్రవారం పెండ్లి కొడుకు అవుతున్నాడని సబ్బండ బంధుగణంతో 33 కోట్ల దేవతలు తరలిరావాలనే ఆహ్వానాన్ని పంపే తంతును ఘనంగా నిర్వహించారు. స్థానాచార్యులు రాఘవాచార్యులు, ప్రధాన అర్చకులు నల్లందిగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు, కారంపుడి నరసింహాచార్యులు, యాజ్ఞీకులు ప్రణీతాచార్యులు ఆధ్వర్యంలోని వేదపండితులు, అర్చకులు, పారాయణికులు వేదమంత్రోచ్ఛారణ మధ్య ఈ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులకు ఉదయం పంచామృతాలతో అభిషేకం చేశారు. పట్టు పీతాంబరాలతో ముస్తాబు చేసి పలురకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మంగళవాయిద్యాలు, ఆలయ అర్చకుల వేదమంత్రాలు, ఉపనిషత్తుల పారాయణాలతో ఆలయంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్నది.


గరుత్మంతున్ని ఆహ్వానిస్తూ..

ఉత్సవమూర్తులను బాలాలయంలోని ధ్వజ స్తంభానికి ఎదురుగా ప్రత్యేక పీఠంపై అధిష్ఠింపజేసి ధ్వజారోహణం నిర్వహించారు. ధ్వజస్తంభానికి తెల్లని వస్త్రంపై గరుత్మంతుని చిత్రపటం కుంకుమతో వేసి, ఆ వస్ర్తానికి షోడషోపోచరాలు చేశారు. ధ్వజస్తంభానికి దర్పలతో తయారుచేసిన తాడుతో గరుత్మంతుని చిత్రపట వస్ర్తాన్ని కట్టారు. ధూపదీప నైవేద్యాలు చేసి గరుడముద్దలను ఎగురవేశారు. గరుడముద్దలను అందుకోవడానికి భక్తులు పోటీపడ్డారు.  యాజ్ఞీకులు ప్రణీతాచార్యులు గరుడిని ఆహ్వానిస్తూ పాడిన వేదోక్తమైన భక్తిగీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.


కోటి సూర్యతేజస్సుతో..

గరుత్మంతుని ఆహ్వానించడం ద్వారా.. సకలదేవకోటి ఉత్సవ తంతులో భాగస్వామ్యం తీసుకోవాలని గరుత్మంతుని వేడుకున్నారు. గరుత్మంతుని వైభవం గురించి కొనియాడుతూ మంత్రోచ్చారణలతో నిర్వహించే ఘట్టమే ధ్వజారోహణం.  కోటి సూర్యతేజస్సుతో వెలిగిపోయే గరుడ అళ్వార్లను మంత్రపూర్వకంగా ఆహ్వానించారు.


logo
>>>>>>