మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Feb 25, 2020 , 02:21:30

మేళ్లచెర్వులో కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలు

మేళ్లచెర్వులో కొనసాగుతున్న శివరాత్రి ఉత్సవాలు

మేళ్లచెర్వు : మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని స్థానిక స్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నాలుగోరోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శివుడికి మహన్యాస రుద్రాభిషేకం, రుద్రహోమం, అర్చనలు, అభిషేకాలు, అమ్మవారికి కుంకుమార్చనలను అర్చకులు కొంకపాక  విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మలు జరిపారు. స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో శ్రీ మాతా చారిటబుల్‌ ట్రస్టు కొంకపాక రాధాకృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వశాంతి మహాయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.   


జోరుగా ఎడ్ల పందేలు.. 

ఎడ్ల  పందేల్లో భాగంగా సోమవారం జరిగిన  టచ్‌ పళ్ల విభాగంలో ప్రకాశం జిల్లా వీరాయపాలెంకు చెందిన వల్లాల సుబ్రహ్మణ్యం, హుజూర్‌నగర్‌కు చెందిన జక్కుల రాజశేఖర్‌యాదవ్‌ గిత్తలు ప్రథమ బహుమతిని సంయుక్తంగా గెలుచుకోగా, గుంటూరు జిల్లా నాదెండ్లకు చెందిన ధూళిపాల రోహిత్‌చౌదరి గిత్తలు ద్వితీయ, ప్రకాశం జిల్లా వీరన్నపాలెంకు చెందిన మువ్వ నందుప్రియకు చెందిన  గిత్తలు తృతీయ  బహుమతులు గెలుచుకున్నాయి. నాలుగో బహుమతిని గుంటూరు జిల్లా నాదెండ్లకు చెందిన దేవభక్తుని రవీంద్రబాబు, మఠంపల్లి మండలం రఘునాథపాలెంకు చెందిన ఖాసీంసాహెబ్‌ గిత్తలు , ఐదో బహుమతిని గుంటూరు జిల్లా వేటపాలెంకు చెందిన శివకృష్ణచౌదరి, హుజూర్‌నగర్‌కు చెందిన దేవరం సుజిత సుధాకర్‌రెడ్డి గిత్తలు, ఆరో బహుమతిని కోదాడ మండలం రామలక్ష్మిపురానికి చెందిన కొప్పుల సీతరామిరెడ్డి, రఘునాథపాలెంకు చెందిన ఆవులదొడ్డి వెంకటేశ్వర్లు గిత్తలు సంయుక్తంగా గెలుచుకోగా, ఏడో బహుమతిని మేళ్లచెర్వు  మండలం కందిబండకు చెందిన పొనగండ్ల కవిత సైదిరెడ్డి గిత్తలు గెలుచుకున్నాయి.  ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.


ముగిసిన కబడ్డీ పోటీలు....

జాతర సందర్భంగా ఫ్రెండ్స్‌యూత్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీలు ఆదివారం అర్ధరాత్రి దాటాక ముగిశాయి. ఈ పోటీల్లో ప్రథమ బహుమతిని బెంగుళూరు టీం గెలుపొందగా 2,3,4 బహుమతులను శ్రీకృష్ణ స్పోర్ట్స్‌ క్లబ్‌, సూర్యాపేట, విజయవాడ టీంలు సంయుక్తంగా గెలుచుకున్నాయి. ఐదో బహుమతిని రంగారెడ్డి జట్టు గెలుచుకోగా ఆరోస్థానంలో నాగర్‌కర్నూలు జట్టు నిలిచింది. విజేతలకు టీఆర్‌ఎస్‌ నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, స్థానిక సర్పంచ్‌ పందిళ్లపల్లి శంకర్‌రెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో యూత్‌ సభ్యులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు. 


నేడు హుండీ లెక్కింపు..

మహాశివరాత్రి జాతరకు హాజరైన భక్తులు హుండీల్లో వేసిన కానుకల లెక్కింపు ప్రక్రియను  మంగళవారం ఆలయ ఆవరణలో నిర్వహించనున్నట్లు ఆలయ మేనేజర్‌ సత్యనారాయణ తెలిపారు.


logo
>>>>>>