మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Feb 24, 2020 , 02:30:37

పట్టణాలను నందనవనంగా మార్చాలి

పట్టణాలను నందనవనంగా మార్చాలి

నల్లగొండ, నమస్తే తెలంగాణ : గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి పరిచేందుకు సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచనతో తొలుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలుచేసి తాజాగా పట్టణ ప్రగతిని ప్రారంభిస్తున్న నేపథ్యంలో దీన్ని సద్వినియోగం చేసుకుని నల్లగొండ జిల్లాను నందనవనంగా మార్చేవిధంగా ఎమ్మెల్యేలు, మున్సిపల్‌ చైర్మన్లు, కౌన్సిలర్లు, అధికారయంత్రాంగం కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నేటినుంచి జిల్లావ్యాప్తంగా 10రోజుల పాటు పట్టణ ప్రగతి ప్రారంభంకానున్న నేపధ్యంలో ఆదివారం కలెక్టరేట్‌లోని ఉదయాదిత్య భవన్‌లో ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన అదికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన పట్టణ సమ్మేళన్‌కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. తొలుత అన్ని మున్సిపాలిటీల్లో ప్రణాళికలు రూపొందించి సమస్యలను గుర్తించి ప్రాధాన్యతను బట్టి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేడు ప్రపంచాన్ని పర్యావరణం, డిస్పోజబుల్‌, శ్మశానవాటికలే పట్టి పీడిస్తున్నాయని వీటి సమస్యతో ప్రపంచ వ్యాప్తంగా ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తెలిపారు. భూభాగంలో కనీసం 33శాతం అటవీప్రాంతం ఉండాలని ప్రతి ఇంటిలోను 30శాతం చెట్లు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఇదిలేనందునే నేడు పర్యావరణ సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. 


ఇక డిస్పోజబుల్‌ కారణంగా అన్ని మున్సిపాలిటీల్లోను పర్యావరణ సమస్య తలెత్తుతుందని శ్మశానవాటికలు లేకపోవడం... కొన్ని ప్రాంతాల్లో ఉన్న ఖననం కారణంగా స్థలం లేక ఇబ్బందులు జరుగుతున్నాయన్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మున్సిపాలిటీల్లో ఈ సమస్యలను అధికమించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణం కారణంగా ప్రస్తుతం నీటిని కొనుక్కుని తాగుతున్నామని, రానున్నరోజుల్లో ఆక్సిజన్‌ బాటిళ్లు సైతం కొనుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశమున్నందున అంతకు ముందే అందరు అప్రమత్తం కావల్సిన అవసరం ఉందన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో తొలుతగా డ్రైనేజీలు శుభ్రం చేయడంతోపాటు చెత్తను డంపింగ్‌ యార్డులకు రెగ్యులర్‌గా తరలిస్తు పిచ్చిచెట్లను, పొదలను తొలగించి అన్ని వీధులను శుభ్ర పరచాలన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా కౌన్సిలర్లు అభివృద్దిపై దృష్టిసారించాలని ఈ విషయంలో అధికారుల కంటే కౌన్సిలర్లే  బాధ్యత వహించాలన్నారు. మానవజాతి ఉన్నంత వరకు చెత్త సమస్య రెగ్యులర్‌గా ఉంటుందని దీనిపై తొలి దృష్టి సారించి డ్రైనేజీ, వీధిదీపాల నిర్వహణ చేపట్టాలన్నారు. మన వూరిని ఎవరో వచ్చి బాగుచేయరని మనమే చేసుకోవాల్సిన బాధ్యత ఉందనే విషయం ఎవరు మరిచిపోవద్దని ఈ సందర్భంగా ఆయన సూచించారు. మున్సిపాలిటీలు అభివృద్ధి విషయంలో పోటీ పెట్టుకుని ముందుకు సాగాలన్నారు. ప్రతి వార్డులోను ఉన్న స్వల్పకాలిక సమస్యల నుంచి దీర్ఘకాలిక సమస్యల వరకు ప్రతిది గుర్తించి ప్రణాళికలు పొందుపరచాలని సూచించారు. ప్రత్యేక అధికారులను సమన్వయం చేసుకుని ముందుకు సాగాలన్నారు. 


మున్సిపాలిటీల్లో సమస్యలపై కౌన్సిలర్ల ప్రస్తావన...

పట్టణ సమ్మేళన్‌ కార్యక్రమం కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ అధ్యక్షతన జరగ్గా ఈ సందర్భంగా జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్మన్లు, కౌన్సిలర్లు హాజరై ఆయా మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలపై ప్రస్తావించారు. ప్రధానంగా అన్ని మున్సిపాలిటీల్లోను పందుల బెడద కారణంగా ఇబ్బందులు జరుగుతున్నట్లు కౌన్సిలర్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కొత్త మున్సిపాలిటీలైన నందికొండ, హాలియా, చండూరు, చిట్యాలతోపాటు పాత మున్సిపాలిటీలైన దేవరకొండ, మిర్యాలగూడ, నల్లగొండలోను పారిశుద్ధ్యకార్మికుల సంఖ్య పెంచితేనే ఈ సమస్య నుంచి పూర్తిస్థాయిలో బయటపడే అవకాశం ఉంటుందన్నారు. నల్లగొండలో మటన్‌ మార్కెట్‌ లేక ఇబ్బందులు జరుగుతున్నట్లు కౌన్సిలర్లు కలెక్టర్‌ దృష్టికి తీసుకొచ్చారు. ఆయా మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల్లో నిధులు లేక అభివృద్ధికి దూరంగా ఉన్నాయని పట్టణ ప్రగతిలో వాటికి అధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని సూచించారు. 


మిషన్‌ భగీరథ, పైపులైన్లు పూర్తిస్థాయిలో వేయలేదని వేసిన ప్రాంతాల్లో సీసీరోడ్లు, మరమ్మతులు చేపట్టలేదని పలువురు కౌన్సిలర్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. నల్లగొండ, మిర్యాలగూడ పట్టణాలు పెద్దగా విస్తరించడంతో ఎక్కువ మంది అద్దె ఇళ్లలో ఉంటున్నారని ఆ ఇళ్లలో ఎవరైనా చనిపోతే మృతదేహాన్ని సంబంధిత ఇంటి యజమాని ఆ ఇంట్లో సందర్శనీయం పెట్టనీయడం లేదని దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయా పట్టణాల్లో ప్రత్యేక హాల్స్‌ నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానికసంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ, నల్లగొండ, దేవరకొండ మున్సిపల్‌ చైర్మన్లు మందడి సైదిరెడ్డి, ఆలంపల్లి నర్సింహా, నందికొండ మున్సిపల్‌ చైర్మన్‌ కర్ణ అనూష, హాలియా మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వెంపటి పార్వతమ్మ, చండూరు మున్సిపల్‌ చైర్మన్‌ తోకల చంద్రకళ, చిట్యాల మున్సిపల్‌ చైర్మన్‌ చినవెంకటరెడ్డి పాల్గొన్నారు. 


logo
>>>>>>