బుధవారం 08 ఏప్రిల్ 2020
Nalgonda - Feb 24, 2020 , 02:28:22

మున్సిపాలిటీలకు మహర్దశ..

 మున్సిపాలిటీలకు మహర్దశ..

నల్లగొండ, నమస్తే తెలంగాణ : కొత్త పంచాయతీ రాజ్‌ చట్టానికి అనుగుణంగా గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పల్లె ప్రగతి కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టి పల్లెలను అన్నిరంగాల్లో తీర్చిదిద్దింది. ఈ స్ఫూర్తితో పట్టణాలను సైతం అదేస్థాయిలో అబివృద్ధి చేయాలని యోచించి ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీల అభివృద్ధ్దికి నూతన మున్సిపల్‌ చట్టం రూపొందించి రాష్ట్రంలోని అన్ని పురపాలికలను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇటీవల మున్సిపల్‌ ఎన్నికలు సైతం ముగియడంతో నేటి నుంచి పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టనుండటంతో మున్సిపాలిటీలకు మహర్దశ రానుంది. ఈ నెల 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు పదిరోజులపాటు కార్యక్రమం నిర్వహించేందుకు మున్సిపల్‌ యంత్రాంగం సిద్ధ్దమైంది. జిల్లా వ్యాప్తంగా ఏడు మున్సిపాలిటీల్లోనూ ఈ కార్యక్రమం జరగనుంది. ప్రతి వార్డులో ఆ శాఖ నుంచి ఓ ప్రత్యేకాధికారిని నియమించి అభివృద్ధ్దిని ఎప్పటికప్పుడు సమీక్షనుండగా.. దీనికి నిధులు సైతం ఫిబ్రవరి నుంచే విడుదల చేయనుంది. 


24 నుంచి మార్చి 4వరకు...

జిల్లాలోని 844 పంచాయతీల్లో రెండు విడుతలుగా ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించి నూతన మున్సిపల్‌ చట్టాన్ని అనుసరించి ఈ నెల 24 నుంచి మార్చి 4వ తేదీ వరకు పదిరోజులపాటు పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహిస్తోంది. తొలి రోజు నుంచి చివరి రోజు వరకు పనుల గుర్తింపు, పరిష్కారం, ప్రణాళికల తయారు లాంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా 7మున్సిపాలిటీలు 162 వార్డులుండగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రతి వార్డుకు ప్రత్యేకాధికారిని నియమించనున్నారు. ఇక ఈ ప్రగతిలో చేపట్టే పనులు, సిబ్బంది చేయాల్సిన పనులపై శిక్షణలు కూడా ఇచ్చారు. ప్రదానంగా పారిశుద్యం దృష్టి సారించి తొలుత పట్టణాన్ని అందంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం నిరక్ష్యరాస్యతపైనా దృష్టి సారించటంతో తొలి రోజు నుండే వారి గుర్తింపు జరగనుంది. 


నిధుల వినియోగానికి కమిటీలు...

నూతన మున్సిపల్‌ చట్టంలో భాగాంగా మున్సిపల్‌ అభివృద్ధి కోసం కేటాయించే ప్రతి పైసా క్షేత్రస్థ్దాయిలో ప్రజాఅవసరాలకే ఖర్చు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిధుల వినియోగానికై వార్డుల వారిగా కమిటీలను సైతం వేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు నెలకు రూ.70కోట్ల చొప్పున ఫిబ్రవరి నుంచే ప్రభుత్వం ఈ నిధులను ఇవ్వనుంది. 2011జనాభా లెక్కల ఆదారంగా ఈ నిధుల విడుదల జరగనుంది. తొలి విడుత పట్టణ ప్రగతి కార్యక్రమానికి నిధులు రానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలకు ఫిబ్రవరి, మార్చిలకు సంబంధించిన నిధులు రానున్నాయి. ఇక నిదుల విడుదల సద్వినియోగానికై ఆయా వార్డుల్లో గుర్తించిన సమస్యల్లో ప్రాధాన్యతం బట్టి పరిష్కార మార్గాలు చూడనున్నారు. ప్రతి వార్డులో అన్ని కాలనీల నుంచి నాలుగు కమిటీలు వేస్తున్నారు. ప్రతి కమిటీలోనూ 15 మందికి ప్రాతినిధ్యం దక్కనుంది. ఇందులో మహిళలు, వృద్ధ్దులు, యువతి, యువకులతో పలు వర్గాలకు చెందిన వారు ఉండనున్నారు.


 గుర్తించాల్సిన పనులివే.. 

ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి ఎక్స్‌రే తీయాలి. ప్రతి రోజు చెత్తను ఎత్తుతున్నారా..లేదా.. మురికి విషయంలో పట్టణ పరిశుభ్రత ఏంటి.?శుద్ధ్ది చేసిన జలాలు సరఫరా చేస్తున్నారా..? అనేది పరిశీలిస్తారు. అదేవిదంగా ఆయా వార్డుల్లో ఉన్న గుంతలు, గోతులు, రహదారుల పరిస్థ్దితి చూడనున్నారు.  పట్టణం పచ్చదనంతో కళకళ లాడేందుకు తీసుకోవాల్సిన చర్యలు... చెత్త నిర్మూలనపై దృష్టి ...ఎప్పటికప్పుడు డంప్‌ యార్డులకు తరలించడం ఇబ్బందులు..  శ్మశాన వాటికల్లో సౌకర్యాలు పెంపొందింటం... యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు... ఓపెన్‌ జిమ్‌ల సౌకర్యం ... జనాభా అనుసరించి పరిశుబ్రమైన వెజ్‌, నాన్‌వెజ్‌ మార్కెట్‌లతో పాటు ప్రూట్‌, ఫ్లవర్‌ మార్కెట్‌ల అవసరం వాటి నిర్మాణం లాంటి చర్యలు తీసుకోనున్నారు. అదేవిదం గా  పట్టణ వ్యాప్తంగా ఉన్న విద్యుత్‌ లైన్ల లూజ్‌ వైర్లు, నిరక్ష్యరాస్యుల వివరాలు కూడా సేకరించనున్నారు. 


logo