మంగళవారం 31 మార్చి 2020
Nalgonda - Feb 23, 2020 , 03:27:00

పట్టణ ప్రగతి పకడ్బందీగా నిర్వహించాలి

పట్టణ ప్రగతి పకడ్బందీగా నిర్వహించాలి

దేవరకొండ, నమస్తేతెలంగాణ : ఈ నెల 24 నుంచి మార్చి 4 వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. దేవరకొండ మున్సిపల్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. అనంతరం మున్సిపల్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్‌, మున్సిపల్‌ కమిషనర్‌ పూర్ణచందర్‌, అధికారులు ఉన్నారు.


మొక్కల సంరక్షణ బాధ్యత కార్యదర్శులదే

గ్రామాల్లో మొక్కల సంరక్షణ బాధ్యత పంచాయతీ కార్యదర్శులదే అని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ అన్నారు. కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని జనప్రియ గార్డెన్స్‌లో శనివారం ఎంపీడీఓలు, పంచాయతీ అధికారులు, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో పల్లె ప్రగతిపై నిర్వహించిన దేవరకొండ డివిజన్‌ స్థాయి సమీక్ష సమావేశంలో మాట్లాడారు. గ్రీన్‌ ప్లాన్‌ ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీకి నర్సరీ తప్పనిసరి అని, గ్రామ అవసరాల మేరకు నర్సరీల్లో  మొక్కల పెంపకం చేపట్టి ఆన్‌లైన్‌ నమోదు, రిజిస్టర్‌ల నిర్వహణ పక్కాగా చేయాలని ఆదేశించారు. నాటిన మొక్కలలో 85 శాతానికి పైగా మొక్కల సంరక్షణ పంచాయతీ కార్యదర్శులదే అన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో 5 అడుగుల మొక్కలు నాటాలని, వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. 


ప్రతి గ్రామానికి ఒక వైకుంఠథామం, డంపింగ్‌ యార్డు తప్పనిసరిగా ఉండాలని, లేనిచోట వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. గత పల్లెప్రగతి కార్యక్రమంలో ఇంటింటికీ పంపిణీ చేసిన జామ, కరివేపాకు, మునగ, దానిమ్మ మొక్కలు, రైతులకు పంపిణీ చేసిన టేకు, ఈత, మలబార్‌ మొక్కలు, రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కల ఇండెంట్‌ ప్రకారం ఈసారి కూడా నర్సరీల్లో పెంచాలని సూచించారు. జూన్‌ చివరినాటికి మొక్కల డిస్ట్రిబ్యూషన్‌ చేయాల్సి ఉన్నందున మొక్కల పెంపకంపై ఎలాంటి అలసత్వం లేకుండా లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నూతన పంచాయతీరాజ్‌ యాక్ట్‌ ప్రకారం గ్రామ పంచాయ తీ కార్యదర్శులు తమ విధులు, బాధ్యతలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని అన్నారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌ శర్మ, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి శేఖర్‌ రెడ్డి, ఆర్డీఓ గుగులోతు లింగ్యానాయక్‌, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్దన్‌రెడ్డి, డీపీఓ రమే శ్‌, ఎంపీడీఓలు, మం డల అధికారులు, ఏపీఓలు, కార్యదర్శులు పాల్గొన్నారు. 


నలుగురికి షోకాజ్‌ నోటీసులు

పల్లె ప్రగతిలో భాగంగా చేపడుతున్న నర్సరీల్లో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహించిన నలుగురు అధికారులకు జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ షోకాజ్‌ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు. శనివారం కొండమల్లేపల్లిలో పల్లెప్రగతిపై నిర్వహించిన సమీక్షలో మొక్కల పెంపకం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్రపోడు ఎంపీఓ భాగ్యవతి, బుడ్డారెడ్డిగూడెం, వెంకటాపురం పంచాయతీ కార్యదర్శులు క్రాంతి, లసుష్మాంజలి, మర్రిగూడ మండలం ఖుదాబక్ష్‌పల్లి కార్యదర్శి కృష్ణయ్యలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్‌ డీపీఓ విష్ణువర్దన్‌రెడ్డిని ఆదేశించారు.logo
>>>>>>